Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ ప్రజలకు ఎస్కేఎం నేతల పిలుపు
- కార్పొరేట్ కోసమే జీఎం మస్టడ్ : రాష్ట్రపతికి ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతి
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక బీజేపీని ఓడించాలని గుజరాత్ ప్రజలకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు పిలుపు ఇచ్చారు. దేశంలోని రైతాంగాన్ని బీజేపీ నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. గురువారం నాడిక్కడ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్కేఎం నేతలు హన్నన్ మొల్లా, దర్శన్పాల్, యుద్వీర్ సింగ్, అశోక్ దావలే, అవిక్ సాహా మాట్లాడారు. కార్పొరేట్ల కోసమే జీఎం మస్టడ్ మోడీ సర్కార్ తీసుకొచ్చిందని, దానిపై సరైనా పరిశోధన కూడా జరగలేదని హన్నన్ మొల్లా విమర్శించారు. జిఎం మస్టడ్ చాలా ప్రమాదకరమైనదని, దీన్ని ఏఐకేఎస్, ఎస్కేఎం వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. రైతు శత్రువు బీజేపీని గుజరాత్ ఎన్నికల్లో ఓడించాలనీ, అలాగే మిగిలిన పార్టీలను కూడా రుణమాఫీ, ఎంఎస్పీపై వైఖరి స్పష్టం చేయాలని ప్రజలు కోరాలని సూచించారు. చారిత్రాత్మక రైతు ఉద్యమం విజయవంతమై ఏడాది కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎస్‌కేఎంకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు నేటికీ నెరవేర్చలేదని విమర్శించారు. గతేడాది నవంబర్ 19న రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారని, అదే రోజు ఈ ఏడాది నవంబర్ 19న ఫతే దివస్‌గా నిర్వహిస్తామని తెలిపారు. ఎస్కేఎం పిలుపుతో 2020 నవంబర్ 26న లక్షలాది మంది రైతులు ఢిల్లీకి వచ్చారనీ, ఈ ఏడాది అదే రోజున అన్ని రాష్ట్రాల్లో రాజ్భవన్లకు పాదయాత్రలు చేపట్టి, గవర్నర్లకు ఎస్కేఎం డిమాండ్లతో పాటు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేకమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా డిమాండ్లతో కూడిన వినతి సమర్పిస్తామని అన్నారు. ''కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధ హామీ. రుణమాఫీ నుంచి రైతులకు స్వేచ్చ, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి. కేంద్ర హౌం సహాయ మంత్రి అజరు మిశ్రాను తొలగించాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పంట బీమా సదుపాయం కల్పించాలి. రైతులకు నెలకు రూ.5,000 పెన్షన్ ఇవ్వాలి. రైతులపై నమోదు చేసిన అక్రమ, నకిలీ కేసులను ఉపసంహరించుకోవాలి. చారిత్రాత్మక రైతు ఉద్యమంలో అమరులైన రైతులకు పరిహారం చెల్లించాలి'' అంటూ ఎనిమిది డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పించనున్నట్టు తెలిపారు.
2021 డిసెంబర్ 11న విజయం సాధించిన తరువాత రైతులు విజయ యాత్రలతో తమ తమ గ్రామాలకు తిరిగి వెళ్లారని, ఈ ఏడాది అదే రోజున విజయోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 1 నుంచి 11 వరకు లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందజేస్తామని అన్నారు. ఎంఎస్పీ, రుణమాఫీపై రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానం చేయాలని ఎమ్మెల్యేలను కోరనున్నట్టు, అలాగే పార్లమెంట్ సమావేశాల్లో ఎంఎస్పీ, రుణమాఫీ బిల్లు తీసుకురావాలని విజ్ఞప్తి చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎస్కేఎం తదుపరి సమావేశం డిసెంబర్ 8న జరగనుందని, ఆ సమావేశంలో ఉద్యమ భవిష్యత్తు కార్యచరణను నిర్ణయిస్తామన్నారు. అలాగే ఆ సమావేశంలో ''పూర్తి స్థాయి రుణమాఫీ, ఎంఎస్పీ హామీ'' కోసం పోరాటాన్ని ప్రకటిస్తామని తెలిపింది.