Authorization
Sun May 04, 2025 12:55:49 pm
- ఆర్ఎస్ఎస్-బీజేపీ చర్యలపై నేతాజీ కుమార్తె అనితా బోస్
- రెండు ధ్రువాలు ఎన్నటికీ కలవబోవని వ్యాఖ్య
కోల్‌కతా : ప్రముఖ భారత స్వాతంత్య్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలను జరపడానికి ఆరెస్సెస్ ప్రయత్నిస్తున్న తరుణంలో.. సుభాష్ చంద్రబోస్ కూతురు అనిత బోస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుభాష్ చంద్రబోస్ ఒక వామపక్షవాది అన్నారు.
ఆయన వైఖరిని బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రతిబింబించవని తెలిపారు. తన తండ్రి వారసత్వాన్ని దోచుకునేందుకు, నాశనం చేసేందుకు ప్రయత్నం జరుగుతున్నదని వివరించారు. ఆరెస్సెస్ భావజాలం, జాతీయవాద నాయకుడి లౌకికవాదం, సమగ్రత ఆలోచన ధ్రువాలు వేరుగా ఉంటాయనీ, అవి కలవబోవని స్పష్టం చేశారు. భావజాలం విషయానికొస్తే, దేశంలోని ఇతర పార్టీల కంటే కాంగ్రెస్‌కు నేతాజీతో చాలా సారూప్యతలున్నాయన్నారు. నేతాజీ బోధించినట్టుగా అన్ని మతాలను గౌరవించాలనే ఆలోచనను బీజేపీ, ఆరెస్సెస్‌లు ప్రతిబింబించడం లేదని తెలిపారు.
సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకలను జరుపుతూ ఆయనను తమ భావజాలం కలవాడిగా ప్రచారం చేసుకోవడానికి బీజేపీ ఎన్నో ప్రయత్నాలను చేస్తున్నది. దీంతో సుభాష్ చంద్రబోస్ కూతురు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.