Authorization
Tue April 08, 2025 10:10:46 am
- కేవలం నందిని పాలనే వినియోగిస్తాం
- బృహత్ బెంళూరు హౌటళ్ల అసోసియేషన్ నిర్ణయం
బెంగళూరు : గుజరాత్‌కు చెందిన అమూల్ సంస్థకు కర్నాటకలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కర్నాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) ఆధ్వర్యంలోని నందిని పాలను మాత్రమే వినియోగిస్తామని బృహత్ బెంగళూరు హౌటళ్ల అసోసియేషన్ నిర్ణయించింది. రాష్ట్ర పాడి రైతులకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నది. బెంగళూరు డైరీ మార్కెట్లోకి అమూల్ ప్రవేశంపై కర్నాటకలో రాజకీయంగానూ దుమారం రేగింది. ఈ విషయంలో రాష్ట్రంలో అధికార బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. దీనిపై బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్)ల మధ్య మాటల యుద్ధమే జరుగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయ పార్టీలే కాకుండా కన్నడ సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్నాటకలో 'పాల' రాజకీయం కూడా ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ఇప్పటికే అధికార బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న కన్నడ ఓటరుకు.. రాష్ట్రంలోని పాడి రైతుల ప్రయోజనాలను పక్కన బెట్టి గుజరాత్‌కు చెందిన అమూల్‌కు కర్నాటక సర్కారు అవకాశం కల్పించడం ఆగ్రహం తెప్పించే విషయమంటున్నారు.