Authorization
Tue April 08, 2025 11:20:08 am
- బిల్లుకు తమిళనాడు గవర్నర్ ఆమోదం
- తమిళనాడు రాజకీయాల్లో భగ్గుమంటున్న విభేదాలు
చెన్నై : ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌ను నిషేధించడం, ఇంటర్నెట్ గేమ్‌లను నియంత్రించడం కోసం రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి సోమవారం ఆమోదించారు. ఆరు నెలల పాటు పెండింగ్‌లో ఉంచిన బిల్లును గవర్నర్‌కి వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన గంటల వ్యవధిలోనే ఆమోదించడం గమనార్హం. గత నెలలో గవర్నర్ కొన్ని ప్రశ్నలతో బిల్లుని వెనక్కిపంపారు. దీంతో ప్రభుత్వం రెండోసారి బిల్లును ఆమోదించింది. రాష్ట్ర యూనివర్సిటీ ఛాన్సలర్‌గా తనను తొలగించాలని కోరుతూ ప్రవేశపెట్టిన బిల్లుతో పాటు తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఇప్పటివరకు సమ్మతించలేదు. కాగా, ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే గవర్నర్ ఆర్.ఎన్. రవికి వ్యతిరేకంగా సోమవారం ఉదయం మరో తీర్మానం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ క్లియర్ చేయడం లేదని, ప్రజా సంక్షేమానికి వ్యతిరేకంగా ఆయన పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. ఇది గవర్నర్‌కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం చేసిన రెండో తీర్మానమని అన్నారు. గవర్నర్ నిర్లిప్త వ్యక్తిగా ఉండాలని సర్కారియా కమిషన్ పేర్కొందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో గవర్నర్ జోక్యం చేసుకోకూడదని డాక్టర్ అంబేద్కర్ కూడా చెప్పారన్నారు. కానీ గవర్నర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధిలా వ్యవహరి స్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అలాగే గవర్నర్ గైడ్‌గా ఉండాలని అనేక సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా స్పష్టం చేశాయన్నారు. అయితే మన గవర్నర్ ప్రజలకు మిత్రుడిగా ఉండటానికి సిద్ధంగా లేరని సీఎం స్టాలిన్ విమర్శించారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో ఉంచుతూ తప్పుడు సమాచారం ఇస్తున్నా రని దుయ్యబట్టారు. బిల్లును పెండింగ్‌లో ఉంచడం అంటే తిరస్కరించి నట్లేనని ఇటీవల గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా స్టాలిన్ మండిపడ్డారు. గవర్నర్ చర్యలను మాత్రమే తాము విమర్శిస్తున్నామనీ, అసెంబ్లీ కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తే ఊరుకోమని అన్నారు. అనం తరం తమిళనాడు మంత్రి దురై మురుగన్, గవర్నర్ రవికి వ్యతిరేకంగా చేసిన తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు నిర్దిష్ట వ్యవధిలోగా ఆమోదం తెలిపేలా తమిళనాడు గవర్నర్‌కు తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఈ తీర్మానం ద్వారా తమిళనాడు ప్రభుత్వం కోరింది.