Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోగులలో అనేక లక్షణాలు కన్పిస్తున్నాయి
- అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ : ప్రజలలో దీర్ఘకాలక కోవిడ్ (లాంగ్ కోవిడ్) లక్షణాలు ఒకేలా ఉండడం లేదని ఓ అధ్యయనం తెలిపింది. కోవిడ్‌తో బాధపడుతున్న వారిలో వేర్వేరు లక్షణాలు కన్పిస్తున్నాయని, ఈ నేపథ్యంలో కచ్చితమైన వ్యాధి నిర్ధారణ, చికిత్స కోసం మరిన్ని పరిశోధనలు అవసరమని వివరించింది. నేచర్ కమ్యూనికేషన్ అనే జర్నల్‌లో ఈ పరిశోధన ప్రచురితమైంది. సార్స్-కోవిడ్ 2 ఇన్‌ఫెక్షన్ ప్రబలిన తర్వాత వ్యాధి లక్షణాలను మరింతగా అర్థం చేసుకునేందుకు అమెరికాలోని ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డులను అధ్యయనం విశ్లేషించింది. ఈ ఇన్‌ఫెక్షన్‌నే లాంగ్ కోవిడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇది చాలా సంక్లిష్టమైనదని, దీనిని విశ్లేషించడం కష్టమని అధ్యయనానికి నేతృత్వం వహించిన చెంగ్సీ జాంగ్ చెప్పారు.
'ఈ వ్యాధి పలు అవయవాలపై ప్రభావం చూపుతుంది. సమాజానికి భారంగా మారింది. అందువల్ల దీనిని తక్షణమే విశ్లేషించి, ప్రజలకు ఎలాంటి చికిత్స అందించాలో నిర్ణయించాల్సి ఉంది. వ్యాధిపై మరింత అధ్యయనం కోసం మేము రూపొందించిన పత్రం ఉపయోగపడుతుంది' అని జాంగ్ తెలిపారు. న్యూయార్క్‌కు చెందిన 1.1 కోట్ల మంది కోవిడ్ రోగులు, ఫ్లోరిడా, జార్జియా, అలబామా నగరాలకు చెందిన 1.68 కోట్ల మంది రోగులపై అధ్యయనం జరిగింది.
రోగులపై జరిపిన వ్యాధి నిర్ధారణ పరీక్షలను కూడా పరిశీలించారు. న్యూయార్క్, ఫ్లోరిడాలలో కోవిడ్ సోకిన వారి వ్యాధి లక్షణాలను గమనించారు.
లాంగ్ కోవిడ్ సోకిన వారిలో కొందరికి మతి భ్రమించింది. కొందరి జుట్టు ఊడిపోయింది. మరికొందరికి కడుపులో గడ్డలు ఏర్పడ్డాయి. చిన్న పేగులో పుండ్లు, ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం, ఛాతినొప్పి, అసాధారణ వేగంతో గుండె కొట్టుకోవడం వంటి లక్షణాలు కూడా కన్పించాయని అధ్యయన పత్రం వివరించింది.