Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 36 నర్సింగ్ విద్యార్థినిలకు పనిష్‌మెంట్
- వారం పాటు హాస్టల్‌ను వీడి బయటకు రాకుండా ఆదేశాలు
- చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ సంస్థ నిర్వాకం
చండీగఢ్ : ప్రధాని మోడీ నిర్వహించే మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌కు హాజరు కాలేదని నర్సింగ్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నది ఒక విద్యా సంస్థ. వారం పాటు సదరు విద్యార్థినులను వారుండే హాస్టల్ వీడి బయటకు రాకుండా ఆదేశాలు జారీ చేసింది. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) లో ఈ ఘటన చోటు చేసుకున్నది. పీజీఐఐఎంఈఆర్ చర్య తాజాగా వెలుగులోకి వచ్చింది. విద్యా సంస్థ తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతనెల 30న మోడీ రేడియో కార్యక్రమం మన్‌కీ బాత్ 100వ ఎపిసోడ్ జరిగింది. క్యాంపస్‌లో ప్రదర్శించబడే మోడీ మన్‌కీ బాత్ కార్యమ్రాన్ని వినడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా విద్యార్థులను సదరు సంస్థ డైరెక్టర్ ఆదేశించారు.
దీనికి సంబంధించిన ఒక సర్క్యులర్ సోషల్ మీడియాలో సైతం చక్కర్లు కొట్టింది. ఈ విషయాన్ని పీజీఐఎంఈఆర్ కూడా కొట్టిపారేయలేదు. అయితే 28 మంది మొదటి సంవత్సరం విద్యార్థినులు, 8 మంది మూడో సంవత్సరం విద్యార్థినులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో వారిని వారం పాటు హాస్టల్ వీడి బయటకు రాకుండా ఈనెల 3న సంస్థ డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపాల్ డాక్టర్ సుఖ్‌పాల్ కౌర్ ఒక లేఖను జారీ చేశారు. అయితే, ఈ విషయం ఇప్పుడు బటయకు రావటంతో విద్యాసంస్థ ఆత్మరక్షణలో పడింది. విద్యాసంస్థ చర్య నియంతృత్వ నిర్ణయమని చండీగఢ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మనోజ్ లుబానా ఆరోపించారు.