Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బ్లూప్రింట్‌పై ఎస్టీ కమిషన్ అభ్యంతరం
న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కేంద్రం ప్రారంభించబోయే నూతన కార్యక్రమానికి సంబంధించిన బ్లూప్రింట్‌పై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికను, షెడ్యూల్డ్ తెగల ప్రణాళికను విలీనం చేయాలని కేంద్రం యోచిస్తోంది. ప్రధానంగా వేర్వేరు ప్రణాళికలను విలీనం చేయడంపై ఎస్టీ కమిషన్ అభ్యంతరం తెలిపింది. ఎస్సీలు, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నంగా ఉంటాయని, వాటిని వేర్వేరుగా పరిష్కరించాలని, ఈ రెండింటినీ ఒకే పద్దు కింద కలగలపడం సబబు కాదని కమిషన్ వ్యాఖ్యానించింది.
త్వరలో ప్రారంభించబోయే ఈ కార్యక్రమానికి రెండున్నర లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీల కోసం లక్షిత పథకాల అమలుకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. స్కాలర్‌షిప్పులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు వంటి పథకాల కోసం నేరుగా నిధులు అందిస్తారు. ఎస్సీలు, ఎస్టీల జనాభా యాభై శాతానికి పైగా ఉన్న గ్రామాలు, శివారు ప్రాంతాలలో ఈ నిధులు ఖర్చు చేస్తారు. లక్షిత పథకాల కోసం 41 కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు తమ బడ్జెట్‌లో కొంత మొత్తాన్ని కేటాయించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీల సమస్యలు భిన్నమైనవని, అసమానతలను గుర్తించేందుకు వేర్వేరు వ్యూహాలను రూపొందించుకోవాలని, పాలనాపరమైన ఏర్పాట్లు కూడా భిన్నంగా ఉంటాయని జాతీయ ఎస్టీ కమిషన్ అభిప్రాయపడింది. పైగా ఎస్టీల సంక్షేమం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించే బాధ్యత నుండి కొన్ని మంత్రిత్వ శాఖలను మినహాయించడంపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకు మినహాయింపు ఇచ్చారో తెలపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది.