Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండాలి
- శాంతి భద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ సర్కార్‌దే నియంత్రణ : రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
దేశ రాజధాని ఢిల్లీలో పాలనా సర్వీసులపై నియంత్రణాధికారం ఎవరికి ఉండాలనే వివాదంలో అరవింద్ కేజ్రీవాల్ సర్కారుకు సుప్రీంకోర్టులో భారీ విజయం లభించింది. ప్రభుత్వాధికారులపై ఎన్నికైన ప్రభుత్వానికే సర్వాధికారాలు ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా కీలక తీర్పు ఇచ్చింది. ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) కట్టుబడి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. భూమి, శాంతి భద్రతలు మినహా మిగతా అన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వానికే నియంత్రణ ఉండాలని తెలిపింది.
''ప్రజాస్వామ్యం, ఫెడరల్ విధానాలు.. అన్నీ రాజ్యాంగ మూల స్వరూపంలో భాగమే. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అసలైన అధికారాలు.. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధుల చేతుల్లోనే ఉండాలి. పాలనా వ్యవహారాలపై నియంత్రణ కూడా వారిదే. ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలకు ఎల్జీ కట్టుబడి ఉండాలి. అధికారులు మంత్రులకు నివేదించకపోతే.. వారి ఆదేశాలను పాటించకపోతే.. అప్పుడు సమగ్ర పాలనా విధానాలపై అది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది'' అని సుప్రీంకోర్టు పేర్కొంది.
''ఢిల్లీ దేశంలోని ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల మాదిరిగా ఉండదు. దేశ రాజధాని అయినందున దీనికి ప్రత్యేక స్వరూపం ఉంది. ఇక్కడ పబ్లిక్ ఆర్డర్, భూమి, పోలీసు వ్యవస్థపై కార్యనిర్వాహక అధికారాలు కేంద్రానికే ఉంటాయి. అయితే, ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఢిల్లీలోనూ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది. అందువల్ల పాలనా సర్వీసులపై అసలైన అధికారాలు ప్రజాప్రతినిధులతో కూడిన ప్రభుత్వానికే ఉంటాయి'' అని తెలిపింది.
ఢిల్లీలోని అన్ని పాలనా సర్వీసులపై కేంద్రానికే నియంత్రణ ఉంటుందంటూ 2015లో కేంద్ర హౌంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రివాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ సానుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం 2019 ఫిబ్రవరి 14న ఈ వివాదంపై భిన్నాభిప్రాయ తీర్పును వెలువరించింది. పాలనా సర్వీసులపై ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు లేవని జస్టిస్ అశోక్ భూషణ్ చెప్పగా.. జస్టిస్ ఏకె సిక్రి దాన్ని వ్యతిరేకించారు.
ఢిల్లీలోని పాలనాధికారుల నియంత్రణకు సంబంధించిన శాసన, కార్యనిర్వాహక అధికారం కేంద్రానిదా, ఆ రాష్ట్ర ప్రభుత్వానిదా అనే వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేస్తున్నట్లు గతేడాది మే 6న సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం జనవరి 18న తీర్పు రిజర్వ్ చేసింది. ఈ క్రమంలోనే జస్టిస్ అశోక్ భూషణ్ ఇచ్చిన తీర్పును విస్తృత ధర్మాసనం తోసిపుచ్చింది.
చారిత్రాత్మక తీర్పు: కేజ్రీవాల్
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డంకులు సృష్టిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం-ఢిల్లీ సర్వీసుల వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఇది చరిత్రాత్మక తీర్పు అని అన్నారు. దేశ రాజధాని నగరంలోని సర్వీసెస్‌పై కేంద్ర ప్రభుత్వానికే నియంత్రణ ఉంటుందని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ 2015లో జారీ చేసిన నోటిఫికేషన్‌పై మండిపడ్డారు. గురువారం కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన చేతులను కట్టేసి, నీటిలో పడేసినప్పటికీ, తమ ప్రభుత్వం చాలా మంచి పనులు చేసిందన్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఈ ధర్మాసనానికి ధన్యవాదాలు తెలిపారు. తాము దేశానికి సరికొత్త విద్యా విధానాన్ని అందించామన్నారు.
ఇదివరకటి కన్నా 10 రెట్ల వేగంతో పనులు ఇకపై జరుగుతాయన్నారు. యావత్తు దేశానికి సమర్థ పరిపాలన నమూనాను ఢిల్లీ సమర్పిస్తుందన్నారు. రానున్న రోజుల్లో బ్యూరోక్రసీలో భారీ మార్పులు జరుగుతాయనే సంకేతాలు ఇచ్చారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పనులకు ఆటంకాలు సృష్టించే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. సమర్థులు, నిజాయితీపరులు, బాధ్యతాయుతంగా మెలిగేవారు, కారుణ్యంగలవారు ఢిల్లీ ప్రజలకు సేవ చేసే అవకాశం పొందుతారని చెప్పారు. పరిపాలనా వ్యవస్థను సంపూర్ణంగా ప్రక్షాళన చేస్తామన్నారు. మొత్తం వ్యవస్థ కుళ్లిపోయిందన్నారు. ప్రజలకు జవాబుదారీగా, బాధ్యతాయుతంగా ఉండే వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకె సక్సేనాను త్వరలో కలుస్తానని, ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటానని చెప్పారు. యాంటీ కరప్షన్ బ్రాంచ్ గురించి విలేకర్లు అడిగినపుడు ఆయన స్పందిస్తూ, ఏసీబీ తన ప్రభుత్వ పరిధిలో లేదని, విజిలెన్స్ తన ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని చెప్పారు. సక్రమంగా పని చేయని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.