Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ ప్రభుత్వాల ప్రోద్బలం..భారత ప్రజాస్వామ్యానికి ముప్పు
- సామాజికవేత్తలు,మేధావులు
- మైనారిటీలు అభద్రతలో ఉన్నారని ఆందోళన
న్యూఢిల్లీ : దేశంలో హిందూత్వ శక్తుల చర్యలు ఆందోళనను కలిగిస్తున్నాయి. ఈ హిందూత్వ శక్తులు దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయనీ, వీటి తీరు దేశ ప్రజాస్వామ్యానికి చాలా ముప్పు తీసుకొస్తుందని సామాజిక కార్యకర్తలు, మేధావులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగానికి రక్షణగా నిలవాల్సిన కేంద్రంలోని ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్నదని తెలిపారు. అధికార బీజేపీ ప్రోద్బలంతో హిందూత్వ శక్తులు రెచ్చిపోతున్నాయని అన్నారు. ఇది దేశానికి ఏ మాత్రమూ శ్రేయస్కరం కాదనీ, దేశాన్ని తిరోగమనంలోకి తీసుకెళ్తుందని తెలిపారు.
ముఖ్యంగా, ఆరెస్సెస్ కార్యకలాపాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. దేశంలోని అమాయకపు యువతకు భావోద్వేగంతో కూడిన అంశాలను నూరిపోస్తూ వారిని రెచ్చగొడుతున్నారని అన్నారు. హిందూత్వ, హిందూ రాష్ట్ర వంటి భావోద్వేగ, సున్నిత అంశాలను ఆరెస్సెస్,దాని పరివార శక్తులు ఆయుధంగా మలచుకొని దేశ ప్రజాస్వామ్యానికి ముప్పును తీసుకొస్తున్నాయని అన్నారు.
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు, ఇతర హిందూత్వ సంస్థలు ఇలాంటి ప్రయత్నాలను తీవ్రతరం చేశాయనీ, ముఖ్యంగా మోడీ సర్కారులూ అనేక ముఖ్యమైన లక్ష్యాలను సాధించిందని ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. ఇందుకు దేవుళ్ల విగ్రహాలు, గుడుల నిర్మాణాలను చూపెడుతున్నాయన్నారు. ఇటు అమెరికా అధ్యక్షుడు జోబిడెన్ ఆహ్వానంతో మోడీ ఆ దేశంలో పర్యటించడాన్ని ఆయనను ఒక రాజనీతిజ్ఞుడిలా చూపెడుతున్నాయని తెలిపారు. ముస్లింల సామూహిక హత్యలు, పోలీసుల ద్వారా న్యాయవ్యతిరేక హత్యలు, దేశం ప్రజాస్వామ్య సూచికలు, భారీ నిరుద్యోగం, అస్తవ్యవస్త ఆర్థిక విధానం వంటి చర్చలను ముందుకు రానివ్వటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశాన్ని హిందూత్వ రాష్ట్రంగా మార్చాలన్న ఆరెస్సెస్.. ఆ ప్రయత్నాన్ని తొమ్మిది దశాబ్దాల కిందే మొదలు పెట్టిందనీ, ఆ ప్రయత్నాలు మోడీ పాలనలో పుంజుకుంటున్నాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ సర్కారు రాజ్యాంగం ప్రకారం నడుచుకొని దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సింది పోయి.. సంఫ్‌ు భావజాలాన్ని అమలుపర్చడానికి కృషి చేస్తున్నదన్నారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే పంథాను అవలంభిస్తున్నదని సామాజికవేత్తలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేశారు. సావర్కర్, గాడ్సే వంటి వ్యక్తులను బీజేపీ పార్టీ ఆరాధించటం ఆ పార్టీ ప్రభుత్వ తీరుకు నిదర్శనమన్నారు.
దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనారిటీలు అభద్రతా జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. మోడీ పాలనలో వారిపై విద్వేషం మరింతగా పెరిగిపోయిందని అన్నారు. కూడు, గూడు, గుడ్డ వంటి ప్రాథమిక అవసరాలను తీర్చి ప్రజలను ఆదుకోవాల్సింది పోయి.. ఆ అంశాల మీదే మత చిచ్చు పెడుతూ బీజేపీ రాజకీయంగా లబ్ది పొందుతున్నదని నిపుణులు అన్నారు.
యూపీలోని యోగి పాలనలో ఒక ముస్లిం గ్యాంగ్‌స్టర్‌ను పోలీసుల భద్రత నడుమే నిందితులు కాల్చటం బీజేపీ ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనమన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీ పాలిత మహారాష్ట్రలోని ముంబయిలో క్రైస్తవులపై జరిగిన దాడుల పట్ల క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మతం పేరుతో జరిగే రాజకీయాలకు స్వస్తి పలకాలనీ, రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు పరిచి దాని విలువలను కాపాడాలని సామాజికవేత్తలు, నిపుణులు తెలిపారు. ఇలాంటి విషయంలో హిందూత్వ శక్తుల ్పయత్నాలకు తలొగ్గకూడదని తెలిపారు. దేశంలోని దళితులు, మైనారిటీల రక్షణ విషయంలో రాజకీయ పార్టీలు ఏకమై బీజేపీ ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.