Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు నెలలు అనుమతి ఇచ్చిన సుప్రీం
- అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై నిపుణుల నివేదిక స్వీకరణ
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదంపై దర్యాప్తునకు గడువును మరో ఆరు నెలలు పొడిగించాలని సెబీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దివాలాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. గడువును ఆరు నెలలపాటు పొడిగించలేమని స్పష్టం చేసింది. చేసే పనిలో కాస్త హుషారు ఉండాలని తెలిపింది. దర్యాప్తు కోసం ఓ బృందాన్ని ఏర్పాటు చేయాలని, కనీస గడువును ఆరు నెలలుగా నిర్ణయించలేమని చెప్పింది. ఆగస్టు రెండో వారం తువాత తదుపరి విచారణ జరుపుతామని, అప్పటికి నివేదికను సిద్ధం చేయాలని తెలిపింది. సెబీ నిరవధికంగా సుదీర్ఘ సమయాన్ని తీసుకోకూడదని, గడువును మూడు నెలలు మాత్రం పొడిగించగలమని తెలిపింది.సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ (రిటైర్డ్) ఎఎం సప్రే కమిటీ నివేదిక సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఇటీవల చేరింది. ఈ విషయాన్ని ధర్మాసనం తెలిపింది. దీనిపై ఈ కమిటీ చేసిన పరిశీలనలను పరిశీలించిన తరువాత మే 15న విచారణ జరుపుతామని తెలిపింది. దర్యాప్తు కోసం గడువును పొడిగించాలని సెబీ చేసిన విజ్ఞప్తిపై ఆదేశాలను మే 15న జారీ చేస్తామని తెలిపింది.
అదానీ గ్రూప్‌పై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. రెండు నెలల్లోగా దర్యాప్తు జరిపి, నివేదికను సమర్పించాలని సెబీని సుప్రీంకోర్టు మార్చిలో ఆదేశించింది. అదే విధంగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎఎం సప్రే, మాజీ బ్యాంకర్లు కెవి కామత్, ఒపి భట్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, సెక్యూరిటీస్ లాయర్ సోమశేఖర్ సుందరేశన్, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జెపి దేవధర్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కూడా రెండు నెలల గడువును ఇచ్చింది. సెబీ మే 2 నాటికి దర్యాప్తును పూర్తి చేసి ఉండవలసింది. కానీ ఏప్రిల్ 29న సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తమకు మరో ఆరు నెలల గడువు కావాలని అడిగింది. అలాగే అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై నిపుణుల కమిటీ నివేదికను అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది.