Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు వారాలకు చేరిన రెజ్లర్ల ఆందోళన
నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న ఆందోళన మూడు వారాలకు (21వ రోజు) చేరింది.
సిట్ ఏర్పాటు : కోర్టుకు ఢిల్లీ పోలీసులు
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు తెలియజేశారు. స్టేటస్ నివేదికను దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు ప్రతిస్పందనగా అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ హర్జీత్ సింగ్ జస్పాల్ ముందు ఢిల్లీ పోలీసులు నివేదిక సమర్పించారు. ''కేసు తీవ్రత దృష్ట్యా సిట్‌ని ఏర్పాటు చేశాం. సిట్ ఈ కేసును దర్యాప్తు చేస్తుంది''అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసినట్లు తెలిపారు. కేసు స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని నివేదికను ఎవరితోనూ పంచుకోవద్దని అభ్యర్థించారు. ఈ నివేదికను ఢిల్లీ పోలీసులు సీల్డ్ కవర్‌లో దాఖలు చేశారు. సమర్పణ తరువాత, తదుపరి విచారణను మే 27కి కోర్టు వాయిదా వేసింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలను సేకరించేందుకు ఢిల్లీ పోలీసు బృందం ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, హర్యానాలకు వెళ్లి ఆధారాలను సేకరిస్తుంది.
18న దేశవ్యాప్త ఆందోళన: ఆరు సంఘాలు ఉమ్మడి పిలుపు
మల్లయోధుల పోరాటానికి సంఘీభావంగా మే 18న దేశవ్యాప్తంగా ఆందోళనకు ఆరు సంఘాలు పిలుపు ఇచ్చాయి.ఈ మేరకు శుక్రవారం సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాలు సంయుక్తంగా పిలుపు ఇచ్చాయి. ''జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్ల నిరవధిక ధర్నా కొనసాగుతోంది. నిందితులపై బీజేపీ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బ్రిజ్ భూషణ్, సందీప్ సింగ్‌లను అరెస్టు చేయలేదు'' అని పేర్కొన్నా యి. 18న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, క్యాండిల్ లైట్ ప్రదర్శనలు చేయనున్నట్టు తపన్ సేన్ (సీఐటీయూ) విజూ కృష్ణన్ (ఏఐకేఎస్), బి. వెంకట్ (ఏఐఏడబ్ల్యూయూ,),మరియం ధావలే (ఐద్వా), హిమఘ్నరాజ్ భట్టాచార్య (డీవైఎఫ్‌ఐ), మయూఖ్ బిస్వాస్ (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రకటనలో తెలిపారు.