Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 12 విద్యార్థి సంఘాల పిలుపు
న్యూఢిల్లీ : జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా ఐక్య విద్యార్థి పోరాటానికి విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చాయి. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, లౌకిక విద్యార్థి సంఘాలను ఏకం చేయడానికి శనివారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో సన్నాహక సమావేశం జరిగింది. దేశంలోని పది ప్రముఖ విద్యార్థి సంఘాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను కేంద్రీకరణ, కాషాయీకరణ, వ్యాపారీకరణకు వ్యతిరేకంగా ఐక్య విద్యార్థి ఉద్యమ ప్రాముఖ్యతపై చర్చించారు. విద్యా విధానంలో రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించే, విద్యార్థి వ్యతిరేక ఎన్‌ఈపీ విధానాన్ని అప్రజాస్వామికంగా అమలు చేయడాన్ని నిరసిస్తూ ఉమ్మడి ఆందోళన చేపట్టాలని సంఘాల నేతలు ఏకగ్రీవంగా నిర్ణయించారు.ఫీజుల పెంపు, పాఠశాలల మూసివేత, ఉపకార వేతనాల కోత, నిరుద్యోగం, రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, కేంద్ర విద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, ఒకే భాష, సంస్కృతి అమలు వంటి పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సన్నాహక కమిటీ ఐక్య విద్యార్థి ఉద్యమం కోసం డిమాండ్ల చార్టర్‌ను తయారు చేయడానికి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. దేశం కోసం ప్రత్యామ్నాయ ప్రగతిశీల, శాస్త్రీయ, లౌకిక, ప్రజాస్వామ్య విద్యా ఎజెండాను సిద్ధం చేయడంపైనా సమావేశంలో చర్చించారు. ఎన్‌ఈపీ అప్రజాస్వామిక అమలును ప్రతిఘటించడానికి ఆయా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య, ప్రగతిశీల, లౌకిక విద్యార్థి ఉద్యమాల ఉమ్మడి వేదికలను ఏర్పాటుచేయాలని నాయకులు నిర్ణయించారు.ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఏ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐఎస్బీ, సీవైఎస్‌ఎస్, డీఎంకే విద్యార్థి విభాగం, ఎన్‌ఎస్‌యూఐ, పీఎస్‌యూ, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ద్రావిడియన్ నేతలు పాల్గొన్నారు. సీఆర్జేడీ, సమాజ్‌వాదీ ఛత్ర సంఘర్ష్, పీఎస్‌ఎఫ్ సంఘాలు కూడా ఈ సమావేశంలో భాగమవుతాయని హామీ ఇచ్చాయి.ఎజియరాసన్, ఎస్. మోహన్ (డీఎంకే స్టూడెంట్ వింగ్), విక్కీ మహేశ్వర్, ఇంజమాముల్ హసన్, ఎండీ అమీనుయేల్ హసన్ (ఏఐఎస్‌ఎఫ్), నితీష్ గౌర్ (ఎన్‌ఎస్‌యూఐ), ప్రసేన్‌జీత్ (ఏఐఎస్‌ఏ), మయూఖ్ బిస్వాస్, ఆదర్శ్ ఎం. సాజీ (ఎస్‌ఎఫ్‌ఐ), ఎండి సఫివుల్లా (పీఎస్‌యూ), గౌతమ్ కెఆర్ (ఏఐఎస్‌బీ), అరవింద్ బీ, కలియపరుమాల్ (ఎస్‌ఎఫ్‌డీ) సమావేశంలో తమ సంఘాల నేతలు అభిప్రాయాలను సమర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు వి.పి సాను అధ్యక్షత వహించారు.