Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊరిసామెతలు
సామెతల్లో గురిజల ప్రస్థావన చాలాసార్లే వస్తుంటది. గురిజ అంటే కందిగింజ కన్నా కొంచెం పెద్ద సైజులో అందంగా వుంటది. గురిజల చెట్లు అడవిలో వుంటాయి. చుట్టూ ఎర్ర రంగుతో వుంటే కింది భాగం నల్లగా వుంటుంది. కొందరు మంది అందరినీ ఎక్రిచ్చి పెడుతుంటరు. వీడు మంచోడు కాదు, వాడు ఇట్ల చేసిండు అంటూ ఫిర్యాదులు చేస్తుంటరు. వాస్తవానికి అతను కూడా ఏదో తప్పు చేసే వుంటడు కానీ అందరినీ ఏదో మాట అనేవాన్ని 'గురిజ తన కింద నలుపు ఎరుగదు' అన్న సామెత వాడతారు. అంటే తను అంతా ఎర్రగా వున్నానన్న బమిసి వుంటది. తన అడుగు భాగంలో మాత్రం నల్లగా వుంటది అనే అర్థంలో వాడుతరు.
అట్లనే ఎవలింట్లన్న ఏదన్న పిండివంటలు చేస్తే చిటికెడంత సై చూసేందుకు ఇస్తరు. లేదంటే కొందరు పిసినాసి వాల్లు వుంటరు. వాల్లకు ఏది ఇతరులకు పెట్టడం ఇష్టం వుండదు. కొంచెమే ఇస్తరు. ఇగ చాలునా అని కూడా అంటరు. వాల్లు పెట్టిన దాన్ని చూసి 'గురిజ ఎత్తు బెల్లం అంట పేగుల దాకా తీపి అట' అంటరు. అంటే గురిజలను త్రాసులో జోకేందుకు ఉపయోగిస్తరు. గురిజ అంత బరువు వున్న పదార్థాం కడుపులో పేగుల దాకా తీపి వచ్చినట్టు వెటకారంలో వాడుతరు. గురిజలు అన్ని ఒకే సైజులో ఒకే తూకం కల్గి వుంటయి. బంగారం పనులు చేసేవారు బంగారాన్ని గురిజ వజనుతో కొలుస్తారు. ఇట్లా గురిజలు ప్రతీ జీవితంలోకి వచ్చాయి.
కొందరు ఎంత తిన్నా ఏర్పడకుంట మొకం పెడుతరు. సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత నిండుగా కొందరు కనపడుతరు. మరికొందరు ఏదో కోల్పోయినట్టు ఎవరో ఎత్తుక పోయినట్టు కన్పిస్తరు. వాల్లను 'మొంటెడు శాపలు తిన్న పిల్లి వలె మొకం పెడుతడు' అని అంటరు. పిల్లి ముఖం మీద హావభావాలు ఏమీ ఏర్పడయి. తినక ముందు తిన్నంక దాని ముఖం ఒకే తీరుగ అమాయకంగా వుంటది. వాల్లను ఇట్లా అంటరు. కొందరు పుల్లెగండువాల్లు వుంటరు. అంటే ఎప్పుడూ ఏదో ఒకటి తినుడే పని. నోట్లే ఏదో నములుతనే వుంటరు. వాల్లకు ఏదైనా తినే వస్తువులు దాచిపెట్టమని ఇస్తే ఇంతే సంగతులు. అట్లాంటోల్లను 'పిల్లికి రొయ్యల మొలతాడు కట్టినట్టే' అంటరు. పిల్లికి ఎండిన రొయ్యలు ఇష్టం. దాని నడుమే రొయ్యల దండ కడితే తాపతాపకు తిరిగి ఖతం చేస్తదన్నట్టు.
- అన్నవరం దేవేందర్, 9440763479