Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పుస్తకం రేపటి తరం కవులకు, రిసోర్స్ మెటీరియల్‌గా భావించవచ్చు. 1993లో ఈ పుస్తకం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెచ్చారు ఏటుకూరి ప్రసాద్. ఇది చాలా విలువైన పుస్తకం. చాలా సంపాదకీయాలు వచ్చాయి. తొలుత ఎంపికలో 1862 నుండి 1940 వరకూ కవుల్ని తీసుకుని ప్రచురించదలచడం గొప్ప విషయం. ఇప్పటి సంకలనం పరివర్థిత ప్రచురణగా తెచ్చారు. తెలుగులో కవుల చేతిరాతలతో అచ్చయినవి శీలా వీర్రాజు 1980లో 'కిటికీకన్ను', 1981లో శ్రీశ్రీ 'మహాప్రస్థానం' కావ్యాలే. అంతకుముందే 1970లో ఇందూర్ భారతి 'సైబ' చేతి రాతలో సైక్లోస్టైల్ సంకలనం తెచ్చారు. 1990ల్లో అలిశెట్టి ప్రభాకర్ కూడా చేతిరాతతో తన కవితల సంకలనం తెచ్చారు. కవితలు రాసే విధానంలో కొట్టివేతలు... మళ్ళీ రాయడం కూడా ఈ పుస్తకంలోని దస్తూరిలో చూడగలం. పాశ్చాత్య కవుల సమాచారం ఇందులో వుంది. మార్వాడీ లెక్కలు రాసే పుస్తకాల కాగితాల మీద జయశంకర్ ప్రసాద్ 'కామాయని' రాసిన స్థితి ఈ పుస్తకంలో పొందుపరిచారు.
1934లో చంద్రిక పత్రికలో హస్తాక్షరి, ముద్రాక్షరి శీర్షికలతో కవుల సంతకాలు ప్రచురించారు. మన కాలంలో నేటి నిజం పత్రికలో ప్రముఖ కవుల నుండి తొలి కవిత రాసిన కవుల కవితలు సైతం 'దస్తూరి' శీర్షికలో బైసా దేవదాసు ప్రచురించి కొత్త ట్రెండ్ సృష్టించారు. టాగూర్ కవితల్లోనూ కొట్టివేతలు, మార్పులుంటాయి. 1862 గురజాడ జన్మ సంవత్సరం నుండి 1962 వరకూ జన్మ సంవత్సరాలున్నవారివి మాత్రమే పరిమితమై వందేళ్ళ సాహిత్యాన్ని (చేతిరాతల్ని) పాఠకులకు అందించిన ఏటుకూరి వారి కృషి ప్రశంసనీయం. 182 మంది కవుల కవిత్వం చేతిరాత - అచ్చుప్రతీ రెండూ ఈ 'పొయిట్రీ వర్క్‌షాప్'లో ప్రచురించారు. గురజాడ అప్పారావు (పూర్ణమ్మ) నుండి కవి యాకూబ్ (వలస రుతువు) దాకా గల ఈ పుస్తకంలో పద్య కవుల పద్యాలు, గీతాలు, పాటలు, వచన కవిత్వం, దైవస్తుతి, పెళ్ళి పద్యాలు, ప్రార్థనలు, ఉగాది కవిత్వం, అభినందనలు... ఇలా ఎన్నో అంశాలున్నాయి ఈ పొయిట్రీ వర్క్‌షాప్‌లో. శ్రీపాద, ఆదిభట్ట, చెళ్ళపిళ్ళ, కట్టమంచి, ఓలేటి, కొప్పరపు సోదరులు (గంటకు 600 పద్యాలు చెప్పారట), త్రిపురనేని, చింతా దీక్షితులు, రాయప్రోలు, గరిమెళ్ళ, చలం, జాషువా, విశ్వనాథ, అడివి బాపిరాజు, దువ్వూరి రామిరెడ్డి, అబ్బూరి, సురవరం, దేవులపల్లి, పట్రాయని, మల్లాది, శ్రీరంగం నారాయణ బాబు, శ్రీశ్రీ, నార్ల, కొమ్మూరి పద్మావతి, సుద్దాల, బోయి భీమన్న, జంధ్యాల, పుట్టపర్తి నారాయణాచార్యులు, కాళోజి, పాలగుమ్మి, చాచో, పైడిమర్రి సుబ్బారావు, పఠాభి, రెంటాల, నాజర్, ఆత్రేయ, తిలక్, కుందర్తి, తిరునగరి, ఆవంత్స, మల్లెమాల, గజ్జెల మల్లారెడ్డి, ఆరుద్ర, దాశరథి, శేషేంద్ర, ఉత్పల, కె.వి.ఆర్, సామల సదాశివ, రావెళ్ళ, అజంతా, సినారె, శివసాగర్, జ్వాలాముఖి, ఇనాక్, వి.వి.నిఖిలేశ్వర్, శివారెడ్డి, గద్దర్, అమ్మంగి, జయధీర్, గోపి, ఓల్గా, జింబో, ఎస్వీ.సత్యనారాయణ, ఆశారాజు, రాధేయ, పాపినేని, కొండేపూడి నిర్మల, తెలిదేవర భానుమూర్తి... ఇలా ఎందరో కవుల చేతిరాత మరియు అచ్చుప్రతి, సంతకం (ఆటోగ్రాఫ్)తో ఈ 'పొయిట్రీ వర్క్‌షాప్ ప్రతి పుట ఎంతో విలువైనదిగా వుంటుంది. కవుల కరదీపిక. నిర్వాహకులకు అభినందనలు ఎంత చెప్పినా తక్కువే. నేటి సాహిత్యకారుల ఇంట వుండాల్సిన విలువైన గ్రంథం.
- తంగిరాల చక్రవర్తి , 9393804472
పొయిట్రీ వర్క్‌షాప్
నిర్వహణ : ఏటుకూరి ప్రసాద్, మామిజాల ఆనంద్
పేజీలు : 610, వెల : 500/-
ప్రతులకు : నవచేతన
పబ్లిషింగ్ హౌస్
గిరిప్రసాద్ భవన్, బండ్లగూడ(నాగోల్), జి.ఎస్.ఇ.పోస్ట్
హైదరాబాద్- 500068.
ఫోన్ : 040-29884453.