Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీవితపు ఆఖరి మజిలీలో తల్లిని ఒంటరిని చేసే పిల్లల నేపద్యంలో వచ్చిన సినిమా 'మాయీ'. తమను పెంచి పెద్ద చేసిన తల్లితండ్రులను వారి వృద్దాప్యంలో ఒంటరి చేసి వదిలి వేసే పుత్రుల సంఖ్య పెరుగుతున్న సందర్భంలో ఇదే కథావస్తువుతో తీసిన సినిమా 'మాయీ'. 2013లో వచ్చిన ఈ సినిమాలో ప్రధాన పాత్రను సుప్రసిద్ద గాయని ఆశా భోంస్లే తన 79 వ ఏట పోషించారు. ఈ దశాబ్దంలో కూడా మన చుట్టూ ఆడపిల్లల కన్నా మగపిల్లల కోసం అర్రులు చాచే తల్లులు కనిపిస్తూనే ఉన్నారు. మగ పిల్లలు తమ వృద్దాప్యంలో తమకు అక్కరకు వస్తారని, వారి నీడన ఉండడంలోనే తమకు గౌరవం ఉందని అనుకునే సాంప్రదాయం చాలా మంది తల్లులలో నేటికీ ఉంది. మరో ఇంటికి వెళ్ళిపోయే ఆడపిల్ల తమకు అక్కరకు రాదని, మగ పిల్లవాడు, మనపిల్లవాడుగా ఎప్పటీకీ నిలిచి ఉంటాడని కలలు కంటారు.
'మాయి' నలుగురు బిడ్డల తల్లి. భర్త మరణించిన తరువాత అంతా తానయి బిడ్డలను పెంచుతుంది. మొదటి ముగ్గురు ఆడపిల్లలయితే ఆఖరి మగపిల్లవాడు మున్నా. మున్నా అంటే ఆ కుటుంబంలో అందరికీ ప్రాణం. కొడుకుని చాలా ప్రేమగా, ఏ నొప్పీ తెలియకుండా పెంచుతుంది మాయి. పిల్లలందరూ పెళ్ళిళ్ళయి ఎవరి జీవితాలలో వారు బిజీగా ఉంటారు. మున్నా కూడా ఓ బిడ్డకు తండ్రి అవుతాడు. అతని వద్దే తల్లి ఉంటూ ఉంటుంది. ఆమెకు క్రమంగా ఆల్జీమర్స్ వ్యాధి సోకుతుంది. ఈ పరిస్థితుల్లో తల్లి తనకు భారం అవుతుందని అనుకుంటాడు మున్నా. అతని ఆలోచనను సమర్ధించే భార్య సహవాసం కూడా అతనికి తల్లి పట్ల ఓ రకమైన విముఖత ఏర్పడడానికి కారణం అవుతుంది. తనకు విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చిందని, అందుకని తల్లిని వృద్దాశ్రమంలో ఉంచాలనుకుంటున్నానని ఇంటికి పెద్దదయిన మధుకి చెబుతాడు మున్నా. మిగతా ఇద్దరు కూతుర్ల పరిస్థితి అంతంత మాత్రం. ఈ సమయంలో సొంత ఇల్లు ఉన్న మధు తల్లిని వృద్దాశ్రమం పాలు చేయలేక తన ఇంటికి తీసుకుని వస్తుంది.
దీనికి మధు కూతురు, భర్త ఒప్పుకోరు. ముఖ్యంగా తన గది పంచుకునే అమ్మమ్మ అంటే మధు కూతురుకి కోపం. అక్కడకు వచ్చాక మధుకి తమ్ముడికి తల్లిని వదిలించుకోవాలనే ఆలోచన ఉందని, తల్లిని తిరిగి తీసుకెళ్ళే అభిప్రాయం అతనికి లేదని అర్ధం అవుతుంది. తన తల్లికి తానే ఇప్పుడు దిక్కు అని స్పష్టం అవుతుంది. భర్త సహకారం లేకపోయినా అతనికి నచ్చజెప్పుకుంటూ, కూతురికి సర్ది చెబుతూ, తల్లిని తనతో ఉంచుకుంటుంది మధు. అప్పుడే ఆమెకు తల్లి వ్యాధి గురించి తెలుస్తుంది. తన తల్లి వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోవడం, పిల్లల పేర్లు మర్చిపోవడం ఇవన్నీ వ్యాధి లక్షణాలని తెలుసుకుంటుంది. ఒక రోజు ఇంట్లో స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నప్పుడు చీర కట్టుకోవడం మరచిపోయి మధ్యలోకి వచ్చి నిల్చున్న తల్లిని చూసి మధు బాధపడుతుంది. భర్త, కూతురు మాయీని పంపించేయాలనుకుంటూనే ఉంటారు. మధు మాత్రం తన తల్లిని వదిలి ఉండనని చెబుతుంది.
ఆ సమయంలోనే మున్నా ఫారిన్ వెళ్ళలేదని, తల్లిని వదిలించుకోవడానికి అబద్దం ఆడి నగరంలోనే ఉన్నాడని మధు భర్త తెలుసుకుంటాడు. ఈలోగా మాయి వ్యాధి ముదిరిపోతుంది. గతంలో మున్నాతో ఆడుకున్న ఆటలు తప్ప ఆమెకు మరేది గుర్తుకు రాదు. అంతటి అయోమయపు స్థితిలో కూడా ఆమె మున్నానే కలవరిస్తూ ఉంటుంది. ఇది మధుని ఇంకా బాధిస్తుంది. పైగా ఆమె స్థితిని ఆసరాగా తీసుకుని ఆమె చేతి గాజులను మరదలు ఊడబెరుక్కుని తమ ఇంటిని పంపించిందని మధు, ఆమె భర్త ఇద్దరికీ అర్ధం అవుతుంది.
మాయి మనసు ఎంతగా కొడుకు కోసం కొట్టుకుంటుందో! ఆ స్థితిలో కూడా కొడుకు జ్ఞాపకాలను ఆమె గుర్తు చెసుకుంటూ ఉండడం, అతని పేరునే కలవరించడం ఇవన్నీ చూసిన మధు భర్తకూడా ఆ తల్లి స్థితికి జాలిపడతాడు. ఓ రోజు ఏవో పాత జ్ఞాపకాలతో మాయి వర్షంలో మేడ మీదకు వెళ్ళి దారి మరచిపోయి రాత్రంతా వర్షంలో తడుస్తూ ఉండిపోతుంది. దానితో ఆమె ఆరోగ్యం పాడవుతుంది. అదే స్థితిలో ఆసుపత్రి పాలయి మరణిస్తుంది.
తమను చిన్నతనంలో కష్టపడి పెంచి ఇంతవారిని చేసిన తల్లి అవశాన దశలో వున్నప్పుడు, ఆమెకు కొంచెం అండగా ఉండకపోగా, ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్న ఆమెను వదిలించుకుందామనుకుని అబద్దాలు చెప్పి, అక్క మంచితనాన్ని అలుసుగా తీసుకునే మున్నాకు ఒక్క క్షణం కూడా తన గతం గుర్తుకు రాకపోవడం, అతని భార్య ఒక పక్కన తన కోడుకుతో ఆడుకుంటూ అత్తగారికి ఆ కొడుకు నీడను దూరం చేయాలని, ఆమెను వదిలించుకోవాలనుకోవడం, తాము చేస్తున్నది తప్పన్న ఇంగిత జ్ఞానం వారికి లేకపోవడం ఇప్పుడు చాలా సందర్భల్లో మనకు కనిపించే వాస్తవం. పెళ్ళికి ముందే భర్తకు తల్లితండ్రులు ఉండరాదని, ఉంటే తమకు దూరంగా ఉండాలని, తమతో ఉండకూడదని అంక్షలు పెట్టి, వివాహం చేసుకునే అమ్మాయిలు... వారి ఆలోచనలను సమర్ధించే తల్లులకు ప్రస్తుతం లోటు లేదు. పెళ్లితో వచ్చే లాభాలు తమకు కావాలి కాని, బాధ్యతలు వద్దని చెప్పడానికి ప్రస్తుత తరం సిగ్గు పడట్లేదు. పైగా ప్రాక్టికాలిటి పేరుతో అదో సహజమైన ప్రక్రియగా అందరూ అంగీకరించే వాతావరణం మన చుట్టూ ఉంది.
వృద్దాప్యంలో ఉన్న తల్లితండ్రులకు వారి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి వారి పక్కన పిల్లల తోడు అవసరం. అది మగపిల్లవాడి నుండి ఎక్కువగా ఆశిస్తారు వాళ్లు. కాని చాలా సందర్భాలలో మగపిల్లలు ఆ బాధ్యత తీసుకుకోకపోతే ఆడపిల్లలు ముందుకు రావడం కనిపిస్తుంది. మధు తల్లిని చూసుకోవడానికి తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేస్తుంది. అమ్మమ్మతో కలిసి ఉంటూ పంచుకోవడంలోని ఆనందాన్ని నేర్చుకుంటుంది మధు కూతురు. అర్ధరాత్రి సమయం తెలియక గదిలో పూజ చేసుకునే అమ్మమ్మను ఆమె భరించడం నేర్చుకుంటుంది. వృద్దాప్యాన్ని గౌరవంతో స్వీకరించాలని, వారితో కలిసి గడిపినప్పుడు ఏర్పడే అనుబంధం జీవితపు అర్ధాన్ని వివరిస్తుందని ఆ కుటుంబ సభ్యులందరూ తెలుసుకుంటారు. తమను తాము ఆ వృద్దురాలి అవసరాల కోసం మార్చుకుంటారు. ఆమెకు సేవ చేయడానికి సంసిద్దులవుతారు.
మున్నాకి తల్లి భారం మాత్రమే. ఆమెతో గడిపిన గతం అతనికి గుర్తు ఉండదు. అతని ప్రస్తుత యవ్వనపు స్థితి, జీవితంలో వృత్తిపరమైన ఎదుగుదల, వీటన్నిటి ముందు ఆ వృద్దురాలి బాధ్యత అనవసరమైన లంపటంలా కనిపిస్తుంది. అందుకే కుటుంబంతో సహా ఫారిన్ వెళుతున్నానని అబద్దం చెబుతాడు. తమ సౌకర్యాలకు ఆ ముసలి ప్రాణం ఆమె అనారోగ్యం అడ్డు అవుతాయని అనుకుంటాడు. తల్లి మరణం అంచున ఉన్నప్పుడు అందరూ కలుసుకున్నా, తమ్ముని నమ్మక ద్రోహాన్ని మధు క్షమించలేకపోతుంది.
మొదటి సినిమా అయినా చాలా ఈజ్‌తో నటించారు ఆశా భోంస్లే. ఆమె పెద్ద కూతురుగా చాలా సంవత్సరాల విరామం తరువాత పద్మిని కొల్హాపూరి నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం చేసిన మహేష్ కొడియల్కు ఇది మొదటి సినిమా. సినిమాగా ఇది యావరేజ్ మార్కులనే కొట్టేసినా, కథనం బావుంటుంది. మరాఠీ సాంప్రదాయాలు కథా నేపథ్యంలో కనిపిస్తాయి. ఇది తన మొదటి, ఆఖరి చిత్రం కూడా అని, తనకు ఇక నటించే ఉద్దేశం లేదని ఆశా భోంస్లే ఈ చిత్రం తరువాత స్పష్టం చేశారు. తల్లిని బిడ్డలా కాపాడుకునే కూతురు మధుగా పద్మిని కొల్హాపురి నటన బావుంటుంది.
'మాయి' ఒక సాధారణమైన సినిమా. కాని వృద్ధుల పట్ల బాధ్యతాయుతమైన వైఖరి అవలంబించడంలోనే జీవితంలో ఓ పరిపూర్ణత ఉంటుందనే సందేశం ఇచ్చే మంచి సినిమా. ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధుల పట్ల బాధ్యతగా ప్రవర్తించడంతో వ్యక్తులుగా ఎదుగుతారని, జీవితాన్ని చూసే దృష్టికోణం మారుతుందని చెప్పే ప్రయత్నం దర్శకులు చేయడం ప్రశంసించవలసిన విషయం.
- పి. జ్యోతి, 9885384740