Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి సిద్ధిపేట జిల్లాలోని చేర్యాల పేరు వినగానే తెలంగాణ చిత్రపటం మీద విలక్షణంగా వెలిగే జానపద కళారూపం 'నకాశి' చిత్రకళ యాది కొస్తది. జానపద శైలిలో నకాశీ కళాకారులు చిత్రించిన దేవుండ్ల బొమ్మలది ప్రత్యేకమైన విధానం. యిగో...! ఆ నకాశీల నేల చేర్యాల నుండి వెలుగుతున్న కవి, రచయిత, విమర్శకులు, పండిత పరిషత్తు బాధ్యుడు, బాల సాహితీవేత్త, బాల వికాస కార్యకర్త గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ. ఈయన 20 జులై, 1970న పుట్టారు. తల్లిదండ్రులు శ్రీమతి కల్వకోట అరుంధతి -శ్రీ సురేందర్రావులు. అమ్మమ్మ తాతలు శ్రీ గుళ్ళపల్లి అనసూయమ్మ-శ్రీ తిరుమల యాదగిరిరావులు వీరిని దత్తత తీసుకున్నారు.
తెలంగాణలో బడి పిల్లల రచనల విప్లవం ఇవాళ్ళ ముప్పేటలుగా సాగుతోంది. అందుకు ఎందరో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల కృషి, పట్టుదల కారణం. ఈ నేపథ్యంలో తాను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థుల్ని స్వీయ రచనలవైపు తీర్చిదిద్దిన బాల వికాస కార్యకర్తల్లో కాంతికృష్ణ కూడా ఒకరు. వృత్తిరీత్యా తెలుగు పండితుడైన కాంతికృష్ణ తొలుత ప్రచురించింది పద్య రచనయే. తొలి ముద్రిత రచన 'నలువరాణి శతకం'. ఇది అనేక సామాజిక, అంశాలతో పాటు సమకాలీన అంశాలకు అద్దంపట్టే రచన. పద్యరచనతో పాటు వచన కవితా రచనలోనూ కాంతికృష్ణ ముందు వరుసలో నిలిచి, కవితలను 'దృష్యభాష' పేరుతో వెలువరించాడు.
సాహిత్య కార్యక్రమాలను చక్కని కార్యకర్తగా నిర్వహించే కాంతికృష్ణ వికాస భారతి సాహితీ సంస్థ అధ్యక్షులుగా సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకు రూపల్పనచేసి, నిర్వహించిన ఈయన సంస్థ పక్షాన తన సంపాదకత్వంలో 'వికాస తరంగాలు' కవితా సంకలనాన్ని ప్రచురించారు. ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడి విద్యార్థులను రచయితలుగా ముందుకు నడపడమనే విద్య తెలిసిన ఈయన, ఆ విద్యార్థులను ఆకర్షించే విధంగా చిన్న చిన్న పద్యాల ద్వారా నీతిని బోధించి, వాళ్ళను కూడా రచనారంగం వైపుకు తెచ్చేవాడు. అలా రాసినవే వీరి 'తెలిసి మసులుకో తెలంగాణ ధీర', 'కాంతికృష్ణ మాట కడు నిజమ్ము', 'మాటనాలించు చుంచనకోట బాల', 'భరతవీరుడా నర్సాయిపల్లి బాల' వంటి మకుటాలతో వచ్చిన పద్య రచనలు. పిల్లలను రచనలవైపు నడపడమేకాక వారి రచనలను సంకలనాలుగా ప్రచురించారు కాంతికృష్ణ. వాటిలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆవిష్కరించబడిన 'కాంతి కిరణాలు' మొదటిది. ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన 'మన ఊరు-మన చెట్టు' రచనా యజ్ఞంలో ఈయన పనిచేస్తున్న నర్సాయిపల్లి విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ యజ్ఞంలో విద్యార్థులు రాసిన కథలను తన సంపాదకత్వంలో 'మా ఊరి మఱ్ఱికథ' పేరుతో సంకలనంగా వెలువరించారు. రంగినేని చారిటబుల్ ట్రస్ట్, సిరిసిల్ల, బాలచెలిమి, హైదరాబాద్, వర్ణన, తెలుగు కవన వేదిక వంటి సంస్థలు నిర్వహించిన బాల వికాస కార్యక్రమాలు, కార్యశాలల్లో విషయనిపుణులుగా, కార్యకర్తగా పాల్గొన్నారు. తేజ ఆర్స్ట్ పురప్కారం, గురజాడ ఫౌండేషన్, అమెరికా మొదలగు సంస్థల సాహిత్య పురస్కారాలతో పాటు బాల సాహిత్యంలో 'పెందోట విశిష్ట బాల సాహిత్య పురస్కారం', మల్లీనాథసూరి కళాపీఠం నుండి 'బాల సాహితీ కళాసూరి' బిరుదులు అందుకున్నారు.
2000 సంవత్సరంలో మొగ్గలో గుళ్ళపల్లి తిరుమల కాంతికృష్ణ రచనలు అచ్చయ్యాయి. బాలల కోసం తాను రాసిన గేయాలను 'ఊయల' పేరుతో సంపుటిగా తెచ్చారు. 'అనురాగ దేవత అమ్మ/ ఆత్మీయనేస్తం అమ్మ/ ఆ దేవుడు మనకొసంగిన/ అపురూప కానుక అమ్మ' అంటూ పరిచయం చేసిన ఈయన నాన్నను గురించి 'బాధను దాచిన సంద్రము/ మదిని ప్రేమ ఆకాశము..../ పైకి చూడ కఠినము/ లోని మనసు మధురము' అని కీర్తిస్తాడు. అదే కోవలో 'హృదయమ్మును కదిలించును/ మది చీకటి తొలగించును' అంటూ గురువు గురుతు చెబుతాడు. 'ఆటలు ఆడుట ఆనందం/ హాయిగ ఎగురుట ఆనందం.../ చదువుల విలువను తెెలిసి చక్కగ/ చదువుల చదువుట ఆనందం' అంటూ పిల్లల కోసం పిల్లల మనసుతో రాసాడు కవి. బాల సాహిత్యం ఆనందంతో పాటు ప్రయోజనాన్ని యిచ్చే విధంగా ఉండాలనేది ఈయన తాపత్రయం. ఆ కోవలోనే నీటి విలువను, నేటి బాలలకు పరిచయం చేయడానికి చక్కని గేయాన్ని రాశాడు, అందులో 'జలÄమే కదా మనకు బలం/ అవనిపైన నిండు జలం/ అన్న దాత గుండెబలం' అని అంటాడు. పర్యావరణ స్పృహ, స్వచ్ఛభారత చేతన, పలు సామాజిక, సమకాలీన అంశాలపట్ల అవగాహన నిండుగా పిల్లలకు కలిగించడం ఈయన గేయాల్లో మెండుగా చూడొచ్చు. గేయం అంత్యప్రాసలతో కూడితే అందంగా ఉంటుంది, అది తెలిసిన ఈ కవి రచనకు ఒక ఉదాహరణ 'ఎండాకాలం తాతీళ్ళు/ బాగా కాసెను మావిళ్ళు' వంటి పాదాలు. పద్యం, గేయం, వచనకవిత, విమర్శతో పాటు బాలల వికాసోద్యమంలో ముందువరుసలో నడుస్తున్న కవి కాంతికృష్ణ. జయహో! బాల సాహిత్యం.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548