Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక సామాజిక మాధ్యమాలు ఆరంభంలో స్వేచ్ఛాయుత భావ ప్రకటన సాధనాలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రజల మధ్య స్నేహ సంబంధాల నిలయంగా గుర్తింపు పుచ్చుకున్నాయి. కానీ వాటిలో నేడు కుప్పలు తిప్పలుగా పొంగిపొర్లుతున్న అర్థసత్యాలు, అసత్యాలు, తప్పుడు, అభ్యంతరకర సమాచారం, దృశ్యాలతో మురికి నీటి గుంటలను తలపిస్తున్నాయి. అంతేకాదు రాజకీయ ప్రేరేపిత పుక్కిటి పురాణాలు, కుల, మత, ప్రాంతాల మధ్య విద్వేష వ్యాఖ్యానాలు రాజ్యాంగ వ్యవస్థలను కూడా వదలకుండా విలువ, స్వయం ప్రతిపత్తి తగ్గించే ఉద్దేశపూర్వక వ్యాఖ్యానాలకు వేదికలవుతున్నాయి. ప్రజా సంఘాల మధ్య వైషమ్యాలు ఏర్పడేలా నకిలీ వార్తలు, మహిళా, అల్పసంఖ్యాక వర్గాల జీవన, గౌరవ, భద్రతలకు ప్రమాదం ఏర్పడేలా సందేశాలు సామాజిక మాధ్యమాల్లో నిత్యం స్వైర విహారం చేస్తున్నాయి. రాజకీయ వర్గా(పార్టీ)లు వారి ప్రభావం కోసం, పాలక వర్గాలు అసమ్మతి స్వరాలను అణిచివేయడానికి నిఘా నేత్రాలు, వేధింపులు, బూటకపు కథనాలను చూస్తు(వింటు)న్నాం. సామాజిక మాధ్యమాలు ఏవైనా సరే వ్యక్తిగత గోప్యతకు తిలోదకాలిస్తూ కట్టు తప్పుతున్న మాధ్యమాలను నియంత్రించడం అత్యావశ్యకమైంది. సామాజిక మాధ్యమాల ప్రవాహంలో నేటితరం స్మార్ట్ఫోన్లు, ట్యాబులు, కంప్యూటర్ల వినియోగంలో అత్యధిక సమయం అంటే రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎక్కువ కాలం గడుపుతుండడంతో మానసిక రుగ్మతల పాలవుతున్నారు. విచక్షణ కోల్పోయి హింసాత్మక సంఘటనలకు వెనకాడటం లేదు. అంతేకాదు సాంకేతిక పరిజ్ఞానంతో సామాజిక మాధ్యమాల వలన మనుషుల మధ్య, కుటుంబాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. ఈ సమస్య ఎంత తీవ్రతరమైందంటే? పొద్దస్తమానం వాటిలోనే తలమునకలై వాటికి బానిసలవుతున్నారు. దాని ఫలితంగా బంధాలు, అనుబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. విఘాతం ఏర్పడుతుంది. చిన్న-పెద్ద, ఆడ-మగ అనే తేడా లేకుండా అనారోగ్యం, మానసిక రుగ్మతలు, చదువులో ఆసక్తి తగ్గి విలువైన భవిష్యత్తును కోల్పోతున్నారు. ముఖ్యంగా యువత వారి లక్ష్యాన్ని, వ్యక్తిగత కుటుంబ బాధ్యతలను విస్మరిస్తున్నారు. తమ అత్యంత విలువైన జీవితాలను వారి చేతుల్లో లేకుండా, సామాజిక మాధ్యమాల చక్రబంధంలో బంధీలవు తున్నారు. వాస్తవానికి ప్రజా సమూహాలు సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండలేరా? రోజు రోజుకూ పెరిగిపోతున్న డిజిటల్ ఉపకరణాల వినియోగం వలన సమాజానికి మంచి కన్నా చెడునే ఎక్కువగా అంట గడుతు(చేస్తు)న్నట్లు నిపుణులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాలకు, ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలు అవుతున్న పిల్లలు, యువత వాస్తవ ప్రపంచానికి దూరంగా... బంధాలను బాధ్యతలను విస్మరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే వారిలో సహజసిద్ధ సృజనాత్మకత, వినూత్నత, క్రియేటివిటీ తగ్గిపోతుంది. చదువుల, కెరియర్ పట్ల ఆసక్తి సన్నగిల్లుతుంది. అంతేకాదు మానసిక ఒత్తిళ్లు, చికాకులు, ఆందోళనలు వంటి మానసిక రుగ్మతలు కూడా పెరిగిపోతున్నాయి. తన యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ పెరగలేదని, లైకులు, షేర్లు పెరగలేదని మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు వింటుంటే... ఈ సమాజం ఎటు పోతుందని బాధేస్తుంది. ఏమి చేయలేమా? ఇంత తీవ్రంగా పెరిగిపోతున్న స్మార్ట్ రుగ్మతలు పరాకాష్టకు చేరి నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా పోతోంది. నేటి తరాన్ని వీటి భారీ నుంచి కాపాడుకోవడానికి కొన్ని నగరాల్లో, పట్టణాల్లో ప్రత్యేకంగా ''స్మార్ట్‌ఫోన్ డి అడిక్షన్ సెంటర్లు'' పెట్టుచున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో! ఆలోచించాల్సి ఉంది. సామాజిక మాధ్యమాలు స్మార్ట్ ఫోన్లు అనేక యాప్‌ల పుణ్యమా అని విపరీతమైన సమాచారం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. అందులో నిజమేదో, అబద్ధం ఏదో, పనికొచ్చేది ఏదో, పనికిరానిదేదో తెలుసుకోలేకపోతున్నారు. వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఒక దాంట్లో నుంచి ఇంకా అకౌంట్లోకి సమాచారాన్ని తోసేస్తూ పనిని, సమయాన్ని వృథా చేస్తున్నారు. ఆ మాధ్యమాల వలలో పడి విలవిలలాడుతున్నారు. సమాజమా... మీ చేతుల్లో మీరు ఉన్నారా! సామాజిక మాధ్యమాలలో బంధీ అయ్యారా ఆలోచించుకోండి. వీటిలోని సమాచారం ఏది మనకు ముఖ్యమో, ఏది కాదో దేనికి స్పందించాలో దేనికి స్పందించకూడదో తెలుసుకోవాల్సింది మనమే. కనబడ్డ ప్రతిదాన్ని నమ్ముకుంటూ పోవడం కాదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని మసులుకోవాలి. మన చేతుల్లో మనం ఉన్నామా... మనం ఇంకొకరి చేతిలో కీలు బొమ్మగా మారినామా ప్రశ్నించుకొని పయనించాల్సి ఉంది. ''యుద్ధంలో వేలమంది వీరులను హతమార్చే వాడికన్నా... తన మనసును తాను జయించే, ఆధీనంలో ఉంచుకునేవాడే నిజమైన వీరుడు. తనను తాను వశపరచుకోగలిగిన మనిషిని శత్రువు(దేవత)లు సైతం ప్రభావితం చేయలేరు. అంతేకాదు అలాంటి వ్యక్తి విజయాలను అపజయాలుగా మార్చనూలేరు. కాలాన్ని వృథా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే'' అనే వాస్తవాన్ని నేటితరం గ్రహించాలి. కట్టు తప్పుతున్న సామాజిక మాధ్యమాలను కఠిన చట్టాలతో నియంత్రించాలి. సమాజం ఆ మాధ్యమాల విష కౌగిలిలోంచి బయటపడి, విలువైన కాలాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. ''నేనెందుకు ఓడిపోతున్నానని మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం... ఎండా, వాన, కాలరాత్రి, కఠినమైన పరిస్థితి... ఏదైనా రానీ, నేను ఆగక నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడూ ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు ఎప్పటికీ ఓడిపోవు'' అన్నదట కాలం. నిర్లక్ష్యంగా కాలాన్ని వృథా చేసే నేటి తరమా ఒక్కసారి విచక్షణతో ఆలోచించండి.. రాజుకైనా పేదకైనా, ధనవంతుడికైనా దరిద్రుడి కైనా కాలం రోజుకు 24గంటలే దానిని సద్వినియోగపరుచుకోవాలి. అనవసర సామాజిక మాధ్యమాల విష కౌగిట్లో కాలాన్ని కరిగనివ్వకండి. మీ విలువైన జీవితాలకు సార్థకత చేకూర్చండి సమాజమా...
- మేకిరి దామోదర్
9573666650