Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ నగరం నడి మధ్య నుండి పాత, కొత్త నగరాలను వేరు చేస్తూ ఆహ్లాదంగా పారే ఒకప్పటి ముచుకుందా నది నేటి మూసీ నది రసాయన, వ్యర్థాల నిలయంగా మారింది. కృష్ణా నదికి ఉపనదైన మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో 2,168 అడుగుల ఎత్తులో పుట్టి భాగ్యనగర వాసుల దాహార్తిని తీర్చిన జలాశయం. హుస్సేన్ సాగర్ సరస్సును మూసీ ఉపనదిపై నిర్మించారు అంటేనే మూసీ నీరు ఎంత స్వచ్ఛంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. మూసీనదిపై హైదరాబాద్ నగరంలో దాదాపు ఏడు వంతెనలు ఉన్నాయి. వీటిలో పురానాపూల్ అత్యంత పాత వంతెన. హైదరాబాద్ గుండా సుడుల సయ్యాటలు ఆడుతూ సందర్శకులను అలరిస్తూ వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన మూసీనది పట్ల అప్పటి ఉమ్మడి పాలకుల స్వార్థపూరిత వైఖరి వలన ప్రజల ఆరోగ్యం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఏ ప్రభుత్వం వచ్చినా మాటలతో కాలం వెళ్ళబుచ్చడమే కానీ మూసీ శుద్ధి కార్యాచరణకి నడుం కట్టలేదు. విపరీతమైన పారిశ్రామిక కారిడార్లకు అనుమతులిచ్చి వాటి నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలకు డంపింగ్ యార్డ్ లాగా మారింది.
1908 సెప్టెంబర్ 28న వచ్చిన వరదల వలన మూసీ ఉగ్రరూపాన్ని జంట నగరాల ప్రజలు చవి చూశారు. అప్పటి అనుభవాల నుండి కొంత మేరకు ఆధునీకరణ చేసినా ఎక్కడ కూడా ఈ నది ప్రక్షాళన కార్యక్రమం ఎంచుకొలేదు. ఫలితంగా ఇప్పటికీ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్వార్థమే పరమావధిగా భావిస్తున్న రాజకీయ నాయకులకు ప్రజల ఆరోగ్యం, ప్రకృతి గమనం గురించిన ధ్యాస ఉండదు అనేది కాలం నిరూపిస్తున్నది. ఈ నది పరివాహక ప్రాంతంలో ప్రజలు, పశుపక్ష్యాదులు అనేక అవస్ధలు పడుతున్నారు. విషపు నీళ్ళతో, విషపు గాలితో పండిన పంటలు తినడంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. జీవ వైవిధ్యం దెబ్బతింటున్నది. గత పాలకుల వలనే స్వరాష్ట్ర పాలకులు కూడా మూసీ పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ కాలం వెళ్లబుచ్చు తున్నారు. తెలంగాణ వస్తే మూసీకి మునుపటి కళ వస్తుంది అనుకున్న నా లాంటి వాళ్లకు నిరాశ మిగిలింది. మూసీ అంటేనే దుర్ఘందాలకు నెలవు అనే భావన నెలకొన్నది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మన చరిత్ర సంస్కృతి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉపన్యసించిన వారికి మూసీ నదీ హైదరాబాద్ చరిత్ర, సంస్కృతిలో విడదీయలేని అనుబంధం అనే యాది మరిచి గత పాలకుల వలనే పాలన కొనసాగిస్తున్నారు. 68శాతం ప్రజలు ఆర్థరైటిస్, 79శాతం ప్రజలు చర్మ వ్యాధులతో, 44శాతం ప్రజలు డయేరియా భారిన పడి అవస్థలు పడుతున్నారు.
మూసీ నరాల్లోకి లాభాల విషాన్ని నింపి చిక్కిశల్యమైంది. నవ యవ్వనంలా ఉరకలెత్తే మునుపటి మూసీ నది లాగా జలకళ ఉట్టిపడేలా ప్రక్షాళన చేసి స్వచ్ఛమైన గాలి, నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. ఉమ్మడి నల్లగొండ ప్రజల బాధలు వర్ణనాతీతం. ప్లోరిన్ భూతం పట్టి పీడిస్తుంది. భూగర్భ జలాలు విషపూరితం అయ్యి స్వచ్ఛమైన జలాలకు బదులు విషపు జల ఊటల ఉయాలలోనే ఊపిరి వదులుతున్నారు. ఈ విషాలన్నింటి మూలంగా పర్యావరణ కాలుష్యం పెరిగిపోయి శ్వాస సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ సమస్యలతో సతమతమై ఆర్థిక బాధలకు తాళలేక అటు అనారోగ్యం ఇటు ఆర్థిక కష్టాలతో తట్టుకోలేక ఆత్మహత్యల పాలవుతున్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజ అభివృద్ధి పురోగమిస్తోంది. ఆరోగ్యవంతమైన మానవుడు ఉత్పత్తిలో భాగం అయినప్పుడు ఉత్పాదకత పెరుగుతుంది. సగటు దేశ, వ్యక్తి ఆదాయం పెరుగు తుంది. ఆర్థిక వృద్ధి రేటు దూసుకెళ్తుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.
తరగతి గదిలో పాఠాలు చెప్పి తన జీతంతో సుఖంగా జీవించే అవకాశం ఉన్నా కానీ సామాజిక బాధ్యతతో, సాటి పౌరులను ప్రేమించే గుణం ఉన్న ప్రొఫెసర్ వెంకటదాస్ మూసీనది ద్వారా వస్తున్న ప్రమాదాన్ని గుర్తించి, ప్రజలు పడుతున్న అవస్థలు చూసి ప్రభుత్వాలు తాము ఇచ్చిన హామీల్లో ఒక్కటైన మూసీ సుందరీకరణను ప్రభుత్వం దృష్టికి తీసుకోచ్చెందుకు సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. అడుగు అడుగు కదుపుతూ హైదరాబాద్ మహానగరం గుండా సాగు తున్న ఈ పాదయాత్ర చరిత్రలో లిఖించదగినది. తన వ్యక్తిగత పనులకు వెచ్చించే సమయాన్ని ప్రజా ప్రయోజనం కోసం వినియోగిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తూ, ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తు చేస్తూ సాగు తున్న ఈ పాదయాత్రలో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు భాగస్వామ్యం అవుతున్నందుకు వారిని అభినందించాలి. జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. ప్రజలను, ఇతర జీవ జాతిని, ప్రకృతిని బతికించుకోవడం ఇప్పుడు మన ముందున్న తక్షణ కర్తవ్యం. మూసినీ శుద్ది చేసి పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాలు కాపాడాల్సిన బాధ్యత గుర్తెరిగి ప్రభుత్వం మూసీ నది సుందరీకరణ కార్యాచరణకు పూనుకోవాలి.
- డా.పి.నారాయణ