Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థగా భారత్ పేరొందింది. అనేక లక్షల మంది ఉపాధి పొందుతూ గత దశాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారు. ఇక దీనికి అనుసంధానంగా అనేక లక్షల మంది తినుబండారాలు, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ జీవనయానం కొనసాగిస్తున్నారు. బ్రిటిష్‌వారు మొదట్లో మనదేశ సంపద, ప్రకృతి వనరులు, ఖనిజాలు వంటివి దోపిడీ చేసే నిమిత్తం ఈ రైల్వే వ్యవస్థ నిర్మాణం చేసినా, తరువాత కాలంలో మనదేశంలో వివిధ ప్రాంతాల ప్రజలకు ప్రయాణసాధనంగా ఆనాటి నుంచి నేటి వరకూ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా చౌకగా ప్రయాణం చేయడానికి, సురక్షితంగా దూర ప్రాంతాలకు వెళ్ళేందుకు రైల్వేకు మించిన వేరొక ప్రయాణ సాధనం లేదంటే అతిశయోక్తి కాదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రైల్వేశాఖలో అనేక ఆధునీకరణ పనులు చేపట్టారు. ముఖ్యంగా బొగ్గుతో నడిచే ఇంజన్లు స్థానంలో డీసిల్ ఇంజన్లు, తదుపరి ప్రస్తుతం చాలా రైళ్లు విద్యుత్‌తో నడుస్తూ దూరప్రాంతాలను అతి తక్కువ సమయంలో చేరవేయుట జరుగుతుంది. ముఖ్యంగా మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్‌గా మార్చుట, సింగిల్ లైన్ వ్యవస్థను డబుల్ లైన్ ఏర్పాటు చేయుట, రైల్లు నడిచే వేగం పెంచుట, కొన్ని రైళ్లను పొడిగిస్తోంది. ఇక వస్తు రవాణా చేసే ''గూడ్స్'' రైళ్ల ద్వారా అనేక ప్రాంతాలకు వివిధ వస్తువులను ఎగుమతి, దిగుమతి చేయుట ద్వారా అధిక ఆదాయం సమకూర్చుకుంటూ దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా రైల్వే దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇక గత మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అమలు అవుతున్న సరళీకరణ విధానాలు, రైల్వే వ్యవస్థపైన ప్రభావం చూపుతూ లాభాల్లో నడుస్తున్న రూట్లో కూడా ప్రస్తుత ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయడం వల్ల రైల్వే అస్థిత్వానికి ప్రమాదం ఉందని అందరూ గ్రహించాలి. ఇప్పటికే అనేక విభాగాల్లో కేటరింగ్, టికెట్స్, మెయింటైనెన్స్, కోచ్ తయారీ, లైన్లు, వర్క్‌షాప్ వంటివి ప్రయివేటీకరణ చేశారు. భవిష్యత్తులో మరెన్నో విభాగాల్లో చేయనున్నట్టు తెలుస్తోంది.
ఎంతో ప్రెస్టీజియస్‌గా, స్వదేశీ పరిజ్ఞానంతో తయారై ప్రవేశపెట్టిన, తరచూ మన ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తున్న 'వందే భారత్' రైల్ సామాన్య ప్రజలకు ఆమాటకొస్తే మధ్య తరగతి ప్రజలకు భారంగా ఉన్న మాట వాస్తవం. ఎక్కువ ధరలతో చాలామంది నడ్డివిరిచే ప్రయాణాలు. అనగా ధనికులు, భూస్వాములకు మాత్రమే ఈ ప్రయాణాలు అనుకూలం. అనగా అనాదిగా పేదలకు, అల్పాదాయ వర్గాలకు అనుకూలంగా, సౌకర్యంగా ఉండే రైలు ప్రయాణం బహుభారం కానుంది. కరోనా పుణ్యమా అని ఇప్పటికే ''ప్యాసింజర్ రైళ్లు రద్దు'' చేసి, పేదలకు చౌక ప్రయాణం దూరం చేశారు. వృద్ధులకు, ఇతర మినహాయింపు ఇచ్చే వారికి ఇచ్చే సౌకర్యాలు, ఆఖరుకు జర్నలిస్టులకు ఇచ్చే రాయితీలు కూడా రద్దు చేశారు. ఇదేనా నేటి పాలకులు, ప్రభుత్వాలు సామాన్య, వృద్ధ్ధులకు ఇచ్చే బహుమతి..!? ఆలోచన చేయాలి. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ ఆశయాలు సామాన్య ప్రజలకు అన్ని వసతులు అనగా విద్య, వైద్యం, రవాణా, తాగునీరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షిస్తూ ఉంటే, వాటినే ఖరీదైన వాటిగా, అందుబాటులో లేకుండా చేయడమా నేటి పాలకుల విధానం..!? ప్రతీదీ ప్రయివేటీకరణ చేయడానికా ఈ ప్రభుత్వాలకు అధికారం కట్టబెట్టుతుంది. పౌర సమాజం కూడా నేటి ప్రభుత్వాల విధానాలుపై విశ్లేషణ చేయాలి. వాస్తవాలను గ్రహించాలి. భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి.
ఇటీవల కాలంలో 2.40లక్షల కోట్ల రూపాయలు అనగా 25శాతం పైబడి లాభాలతో రైల్వే శాఖ ఉందని గణాంకాలు చెబుతున్నాయి. పేద ప్రజల నడ్డివిరిచి, సంపాదించే ఈ లాభాలు ఎవరి కోసం అనేది అందరూ ప్రశ్నించాలి. ఒక ప్రక్క ''బుల్లెట్ ట్రెయిన్'' అని, మరొక పక్క ''వందే భారత్'' అని నూతన రైల్లు ప్రస్తుతం ఆధునిక కాలంలో అవసరతలు రీత్యా అవసరమే కానీ అదే సమయంలో పేద, సామాన్య ప్రజలకు రైల్వే ప్రయాణం భారం చేయుట సమంజసమా..!? ఒకపక్క దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, కానీ నేటికీ మనదేశంలో మూడు పూటలా తిండిలేని వారు 22కోట్ల మంది ఉన్నారు అనే విషయం మరువరాదు. అభివృద్ధి అంటూ జాతీయ రహదారులు, పెద్ద పెద్ద విగ్రహాలు భవనాలు నిర్మాణాలు విమానాశ్రయాలు వంటివి ప్రపంచానికి చూపెడుతూ, పేదరికాన్ని దాచి పెడుతూ పాలన సాగించటం వాస్తవ అభివృద్ధా... ప్రపంచ సూచికల్లో అనేక రంగాల్లో మనం వెనుకబడిన సంగతి మరువరాదు. అదనపు భారాన్ని ప్రజలపై మోపకుండా ఆధునిక విధానాలు అమలు చేయడం ద్వారా రైల్వేలకు లాభాలు సంపాదించవచ్చు. ఉదాహరణకు ''మెట్రో రైలు'' ప్రయాణించడానికి టికెట్ లేకుండా ప్రయాణించడం దాదాపు అసాధ్యం. ఆ విధంగా దాదాపు అన్ని రైల్వే స్టేషన్లో దశల వారీగా ఈ విధానం అమలు చేయడం ద్వారా ప్రతీ ఒక్కరూ టికెట్ కొని ప్రయాణం చేయడం ద్వారా లాభాలు వస్తాయి. సరుకు రవాణాపై అవకాశం మేరకు చార్జీలు పెంచాలి. నిత్యావసరాలపై తగ్గించాలి. ధనికులు, పెద్ద, పెద్ద వ్యాపార సంస్థలు, వేత్తలకు ఇచ్చే రాయితీలు ప్రోత్సాహకాలు తగ్గించాలి. ప్రభుత్వాలు పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు కలిగించే రీతిలో రైల్వే వ్యవస్థలో మార్పు చేస్తూ, మనదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేలు భారత దేశ ప్రజలకు మేలుచేసే విధంగా ఉంటుందని ఆశిద్దాం...
- ఐ.ప్రసాదరావు