Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేటి సమాజం గురించి తెలిసిందే. ఎవరి సమస్యలు వారివే. ఎవరికి కష్టసుఖాలు వారివే. 'నేను బాగుండాలి. నాకుటుంబం బాగుండాలి' అని అనుకువారే చాలామంది ఉంటారు. ఇంకొంత మందైతే ఒక్క అన్నం పార్సల్ అనాథలకు ఇచ్చి సెల్ఫీలమీద సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో పోస్టుచేసుంటారు. కానీ కొంత మంది సమాజం కోసం పాటుపడినా, వారి జీవితం ధారపోసినా వార్తల్లోకి ఎక్కరు. ప్రచారం కూడా చేసుకోరు. అలాంటి కోవలోకి వచ్చేవారే డాక్టర్ స్వామి అల్వాల్. ఆయన స్ఫూర్తికి, ప్రేరణకు, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం. అనేకమంది సంఘ సంస్కర్తలు, సామాజిక విప్లవకారుల విగ్రహాలను ఆవిష్కరిస్తూ చాలామందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంబీబీఎస్ చదివినప్పటికీ కార్పొరేట్ ఆస్పత్రిలో పనిచేయకుండా సామాజిక సేవ సంస్థల్లో వైద్యం అందిస్తూ పేదలకు సేవచేస్తున్నారు. అలాంటి వ్యక్తుల గురించి, మనలోనే ఉంటూ పనిచేస్తున్న స్వామి అల్వాల్ లాంటి సంఘ సేవకుల గురించి నేటియువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
స్వామి అల్వాల్ 1941లో ఎల్లమ్మ, మల్లయ్య దంపతులకు హైదరాబాద్‌లో జన్మించాడు. పెరిగింది, చదివింది కూడా ఇక్కడే. చిన్ననాటి నుండే చాలా చురుకైన విద్యార్థిగా, తెలివిగలవానిగా పాఠశాలలో రాణించగలిగాడు. నాటికి జరుగుతున్న స్వాతంత్ర పోరాటం పట్ల అప్పుడప్పుడే ఏర్పరచుకున్న అవగాహనతో సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని తలంపు ఆయనలో కలిగింది. ఏడో తరగతి పాస్ అయిన తర్వాత తన తల్లిదండ్రులకు ఉన్న వెనుకబాటుతనం ,అమాయకత్వంతో శూద్రులు చదవకూడదనే వేల సంవత్సరాల మనువాద మానసిక చట్టాల మూలంగా 'ఇక చదువు మానేరు. ఏడులో ఎల్లినవ్. ఇగ చాలు మానెరు' అని ఒత్తిడి చేశారు. వీళ్ళు చదివించకపోయినా సొంతకష్టంతో చదువుకుంటాననే దీమా, ఆత్మవిశ్వాసంతో అల్వాల్ తల్లిదండ్రులకు తెలియకుండా దొంగచాటుగా వెళ్లి కాచిగూడ హైస్కూల్ హాస్టల్లో 8వ తరగతిలో జాయిన్ అయ్యాడు. అక్కడ మహారాష్ట్రకు చెందిన అనేకమంది విద్యార్థులు ఆ హాస్టల్లో చదివేవారు. అప్పటికే అంబేద్కర్, ఫూలే భావాలు వారి మధ్య చర్చ జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఆ మహనీయుల బాటలో నడవాలి, సామాజిక సేవ చేయాలనే తలంపు అల్వాల్‌కు కలిగింది.
అక్షరంముక్క చదువు రాకపోయినా మొత్తం మహారాష్ట్రలో వివిధ పట్టణాలలో బజార్లు ఊడ్చి పరిసరాలను పరిశుభ్రం చేయడమే కాకుండా అట్టడుగు పేదలకి చదువు నేర్పాలి అనాథలకు ఆశ్రమాలు నెలకొల్పాలని భావించిన గాడ్గే బాబా జీవితంలోకి తొంగి చూశారు. గాడ్గే బాబా స్ఫూర్తితో సామాజిక సేవా సంకల్పం అల్వాల్‌లో కలిగింది. అనేకమంది దగ్గర జోలబట్టి అడుక్కొచ్చి 150సంస్థలను స్థాపించిన గొప్ప సంఘసంస్కర్త సంత్ గాడ్గే బాబా జీవితాన్ని అధ్యయనం చేసి ఆ మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన జీవిత చరిత్రను తెలుగులో తొలిసారిగా డాక్టర్ అల్వాల్ పుస్తకం రాశారు. స్వామి అల్వాల్ తండ్రి అల్వాల్ మల్లయ్యకు సంక్రమించిన 300 గజాల స్థలాన్ని ప్రజాసేవ సామాజిక కార్యక్రమాల కోసం షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీకి విరాళంగా ఇచ్చారు. ఆ స్థలంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ఉత్తరం రాసి బిల్డింగ్ మంజూరు కోసం చొరవచేశారు. ఆ భూమిపైన కొంతమంది కన్నేసి కబ్జా చేయడానికి ప్రయత్నించగా ప్రభుత్వాన్ని ఆశ్రయించి నిరాటంకంగా పోరాటం చేసి ఆ భూమిని రక్షించుకుని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ శతాబ్ది భవనంగా పేరు పెట్టారు. ఆ భవనంలో నేటికీ సామాజిక సేవా కార్యక్ర మాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, వివిధ సామాజిక ప్రజాసంఘాల కార్యక్రమాలు సభలు సమావేశాలు ఉచితంగా నిర్వహించ బడుతున్నాయి. ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రంతో పాటుగా ఇటీవల ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం, కరాటే శిక్షణ కేంద్రం ఇలాంటి అనేకం ఆ భవన్లో నడుస్తున్నాయి. అట్టడుగు కులంలో పుట్టి అత్యున్నత చదువులు చదివి బీహార్ వంటి రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం మెడికల్ ఆఫీసర్‌గా పనిచేయటమే కాకుండా భారతదేశం బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లోనూ పేదలకి అనేక వైద్య సేవలు అందించారు. క్యాన్సర్, టిబి పేషేంట్లకు అనేక వైద్యసేవలు చేశారు. కాచిగూడ నుంచి అమీర్‌పేటకు వెళ్లి నేచురోపతి వైద్యం నేర్చుకొని ట్యూషన్ చెప్పి మెడికల్ విద్యార్థులను అనేక మందిని డాక్టర్లుగా ఆయన తీర్చిదిద్దారు.
1973లో బీహార్‌లో కేంద్ర ప్రభుత్వ మైకాన్ మెన్స్ హాస్పిటల్, సంస్థలలో అనేక వైద్య సేవలందించారు. టీబీ, క్యాన్సర్ పేషంట్లను దగ్గరుండి వారి బాగోగులు చూసుకున్నారు. 1979లో గుంటూరుజిల్లా బాపట్ల ప్రాంతానికి చెందిన కమ్యూనిస్టు నాయకుడు పెద్ద వెంకటేశ్వర్లు కూతురిని తన మిత్రుడి సహకారంతో కులాంతర ఆదర్శ వివాహాన్ని అల్వాల్ చేసుకున్నాడు. ఆమె సైతం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా స్ఫూర్తి నిచ్చాడు. 2013 సంవత్సరంలో తీవ్ర అనారోగ్యానికి గురైన తన జీవిత సహచరి మరణించడంతో ఒంటరి జీవనాన్ని గడపాల్సి వచ్చింది. 300 గజాల స్థలం తీసుకున్న షెడ్యూల్డ్ క్యాస్ట్ రైడ్స్ ప్రొటెక్షన్ కమిటీ దాన్ని సద్వినియోగం చేయడంలో ఘోరంగా విఫలం కావడంతో అటు భూమిని రిటర్న్బ్యాక్ తీసుకొని అందులో సేవా, సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని, మహనీయులు చేసిన త్యాగాలు నేటి తరానికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలని వారి విగ్రహాలు నెలకొల్పాలనే తలంపుతో అల్వాల్ స్వామి ముందుకు నడుస్తున్నాడు.
గౌతమ బుద్ధుడు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, రమాబాయి అంబేద్కర్, సంత్ గాడ్గే బాబా, జగ్జీవన్‌రామ్, కాన్షీరాం, జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, సంత్ గురు, రవిదాస్, నారాయణ గురు, పెరియార్ రామ స్వామి నాయకర్, చత్రపతి శివాజీ, గుర్రం జాషువా, చిట్యాల ఐలమ్మ, టి ఎన్ సదాలక్ష్మి, సాహూ మహారాజ్ వంటి విగ్రహాలను సొంత ఖర్చులతో నెలకొల్పారు. అల్వాల్ ఎల్లమ్మ, మల్లయ్య (డాక్టర్ స్వామి అల్వాల్ తల్లి దండ్రులు) ప్రస్తుతం ప్రపంచ మానవాళి విముక్తి ప్రదాత కారల్ మార్క్స్ విగ్రహాన్ని 2023 మార్చి 19న తిలక్‌నగర్‌లోని సంజీవయ్యనగర్ శతాబ్ది భవన్లో నెలకొల్పారు.
81 సంవత్సరాల వృద్ధాప్యంలోనూ అల్వాల్ మహనీయుల ఆలోచనలు అడుగుజాడలు వదిలిపెట్టకుండా, ఆచరణాత్మకంగా కృషి చేయడం అభినందనీయం. 2007 సంవత్సరంలో ఎంబీబీఎస్ డాక్టర్‌గా ఆయన రిటైర్డ్ అయిన తర్వాత కూడా రోగులకు ప్రత్యక్ష సేవలు అందించాలని ఆయన ఆరోగ్యశ్రీ అడ్వయిజర్‌గా చేరాడు. ఎనిమిది పదుల వయసులో గోల్నాక నుంచి అమీర్‌పేటకు వెళ్లడానికి ఆరోగ్యం సహకరించక దానికి దూరమయ్యాడు. ప్రస్తుతం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు మల్లు వెంకట నరసింహారెడ్డి చారిటబుల్ ట్రస్టులో డాక్టర్‌గా వైద్య సేవలందిస్తున్నారు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన తనకు వస్తున్న కొద్దిపాటి పెన్షన్‌లో నెలకు రెండు వేల రూపాయల చొప్పున శతాబ్దిభవన్ నిర్వహణ కోసం ఖర్చు పెడుతున్నారు. వారికి ముగ్గురు బిడ్డలైనప్పటికీ వారి వివాహానంతరం జీవిత సహచరి లేకపోయినా ఒంటరి జీవనాన్ని గడుపుతూ ఈరోజుకి కూడా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. 19 మంది మహానుభావుల విగ్రహాలు నెలకొల్పడమే కాకుండా వారి జయంతులు, వర్థంతులు, వివిధ రకాల కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు
నేటికీ ఏ చిన్న మీటింగ్ లోనైనా జై భీమ్, లాల్ సలాంతో ఆయన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు తన ముగ్గురు బిడ్డలను పిలిచి 'నా తదనంతరం కూడా శతాబ్దిభవన్లో సామాజిక సేవా కార్యక్రమాలకి మీ వంతు తోడ్పాటునివ్వాలని వారిని కోరారు'. కేవీపీఎస్, ఎమ్మార్పీఎస్ ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల కార్యక్రమాలకు ఉచితంగా భవనం ఇవ్వడమే గాక ఆయా సామాజిక కార్యక్రమాలలో క్రియాశీలక భూమిక పోషిస్తున్నారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటి దిగ్గజాల చేతుల మీదుగా అవార్డ్ తీసుకున్నారు. ఆయన సేవలకు గాను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దళిత రత్న అవార్డ్ ప్రదానం చేసింది. ఢిల్లీ ప్రభుత్వం 2002లో విజయరత్న అవార్డ్‌ను బహుకరించింది.
డాక్టర్ అల్వాల్ జీవితంలో కించిత్తు స్వార్థం ఎరగక సమాజ హితం కోసం తన సర్వస్వం త్యాగం చేశారు. నేడు సామాజిక తరగతులు, ఉద్యోగ రంగాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కింద ఉన్న ఆభాగ్యులుగా జీవిస్తున్న వాళ్లకి ఏ రకంగా అండగా నిలబడాలో ఆయన వ్యక్తిగత జీవితమే పాఠం అవుతుంది. ఆయన ఆచరనే గీటురాయిగా నిలుస్తుంది. డాక్టర్ స్వామి అల్వాల్‌కు లాల్‌సలామ్.
- స్కైలాబ్‌బాబు
9177549656