Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజు రోజుకూ దిగజారిపోతున్న రాజకీయా లలో చేరడం అవసరమా? రాజకీయ రంగంలో కేరీర్ అవకాశాలు చాలా తక్కువ కదా! రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే చాలా ఎక్కువ కాలం పడుతుంది! పొలిటికల్ కంటిన్యూటీ ఉండదు. మొత్తం కేరీర్ పది లేదా పదిహేనేండ్ల కంటే మించి ఉండదు. రాజకీయాలు జుగుప్సా కరంగా మారుతున్నాయి. అవంటే అసహ్యం, విలువవుండదు. రాజకీయాల్లో ఉండాలంటే కోట్లకొద్ది డబ్బు కావాలి కదా! ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తు ఆగమవుతుంది. రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదగలేము! మొదలైన మరెన్నో సందేహాలకూ ప్రశ్నలకూ సుదీర్ఘ సమాధానపత్రమే నేలంటి మధు రాసిన ''రాజకీయ వృత్తి'' నాయకత్వ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు - కొత్తకాలానికి కొత్త రాజకీయం అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన 300 పేజీల పుస్తకం. ఇలాంటి ఒక సమగ్ర రాజకీయ ఆచరణలకు, అందులోని వివిధ స్థాయిలకు, విభాగాలకు, అవకాశాలకు సంబంధించిన పుస్తకం ఇంత క్రితం నాకైతే కనపడలేదు. ఇది నేటి యువతరానికి ఎంతో బాగా ఉపయోగపడే పుస్తకం. అంతే కాదు, రాజకీయాలలో ఇప్పుడు కొనసాగుతున్న వాళ్లు కూడా అధ్యయనం చేయాల్సిన పుస్తకం. ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్న అనేక మందికి రాజకీయాలపట్ల పూర్తి అవగాహనలేదు. అంతే కాదు, గత చరిత్రను బట్టి అర్థం చేసుకునే పాఠాలూ తెలియదు. వర్తమానం ఎంత మార్పు చెందినదో కూడా అవగాహన కావటం లేదు. ఈ పుస్తకంలో సాధారణంగా ఎకడమిక్ పుస్తకాల్లో ఇచ్చిన రాజకీయ విశ్లేషణలు, నిర్వచనా లకు భిన్నంగా వాస్తవికంగా, ఆచరణాత్మకంగా వివరించారు. 'పరిపాలనలేని చోట బలవంతుడు బలహీనుని మింగేస్తాడు. పరిపాలన ఉన్న చోట బలహీనుడు బలవంతుని నిరోధిస్తాడు.' అన్న సూక్తి ఆధారంగా పరిపాలనను అజ్ఞానులకు, స్వార్థపరు లకు, అవకాశవాదులకు వదిలేస్తే 'బలవంతుడు దుర్భల జాతిని బానిసలను గావించాడు' అన్న చందంగానే రాజకీయాలూ ఉంటాయని మధు చెప్పారు.
పన్నెండు చాప్టర్లు ఉన్న ఇందులో 1. రాజ్యాంగం, రాజకీయం మొదలైన అంశాల వివరణ 2. ప్రజారంగంలో రాజకీయ నాయకత్వ అవకాశాలు, 3. రాజకీయ పార్టీల్లో నాయకత్వ అవకాశాలు, 4. ప్రభుత్వంలో రాజకీయ నాయకత్వ అవకాశాలు, 5. సామాజిక ఉద్యమరంగం నాయకత్వ అవకాశాలు, 6. అంతర్జాతీయ రాజకీయ రంగంలో అవకాశాలు, 7. రాజకీయ ఉద్యోగావకాశాలు, 8. రాజకీయరంగంలో స్వయం ఉపాధి అవకాశాలు, 9. రాజకీయ కల్సెల్టెన్సీ, 10. రాజకీయాల రిపేరింగ్ 11. యువత- రాజకీయాలు, 12. రాజకీయ కేరీర్ - సందేహాలు మొదలైన విభాగాలలో చాలా విషయాలను అనుభవపూర్వకంగా వివరించారు.
సుస్థిర జీవనం, సామాజిక అస్థిత్వం పొందిన విభిన్న ప్రజలందరినీ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా దేశీయతా గుర్తింపుతో జీవింప చేసే నోబుల్ ఎంటిటీ రాజకీయం అని ప్రస్తావిస్తారు. స్వాతంత్య్ర పోరాట కాలంలో సామాజిక బాధ్యతతో రాజకీయాలు కొనసాగించారు. ప్రజాస్వామిక వ్యవస్థలను స్థాపించారు. ఇప్పుడు ఈ వ్యవస్థలను ధ్వంసం చేశారు. సొంత ప్రయోజనాలకు రాజకీయాలను కులాల స్థాయికి దిగజార్చారు అని ఆరంభిస్తారు. అయితే వర్గ సమాజంలో దోపిడీ శక్తులకు సాధనంగా రాజకీయాలు కొనసాగుతాయనేది శాస్త్రీయ చరిత్రకారుల విశ్లేషణ. రాజకీయాలు ఎందుకోసం పుట్టాయి? రాజ్యాంగం ఏయే హక్కులు, బాధ్యతలను మనకిచ్చింది. రాజకీయాలు అంటే ఎవరు? పరిపాలన ఎవరి చేతుల్లో ఉంటుంది. మొదలైన విషయాలెన్నో ఇందులో సవివరంగా ఇచ్చారు. పన్నెండు చాప్టర్లూ సామాజిక రంగంలో, రాజకీయ రంగంలో ఆసక్తి ఉన్న వాళ్లు తప్పకుండా చదవాలి. ఇక ఆసక్తిలేని వాళ్లు కచ్ఛితంగా చదవాలి. ఎందుకంటే, రాజకీయాలతో సంబంధం, అవసరం లేకుండా జీవనం ఉండదు.
ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రాజకీయాల్లో ఉండటమంటే ఎన్నికల్లో నిలబడటమే కాదు, ఒక పార్టీలో ఏయే అంశాలుంటాయి, ఏ విభాగానికి మనం సరిపోతాము అని నిశ్చయించుకోవచ్చు. కార్యకర్త, ఏజెంట్, అధికార ప్రతినిధి, నాయకుడు, పార్టీ ప్రజా సంఘ నాయకుడు మొదలైనవెన్నో ఉంటాయి. రాజకీయాలతోనే ప్రభుత్వాలేర్పడతాయి కాబట్టి ప్రభుత్వాలతో ఏయే అవకాశాలున్నాయో తెలుస్తుంది. స్థానిక ప్రభుత్వాలు, సామాజిక ఉద్యమ రంగంలో స్వచ్ఛంద సంస్థలలో, అంతర్జాతీయ రంగంలో ఎలా పనిచేయవచ్చో వివరిస్తారు. రాజకీయ ఉద్యోగవకాశాలను చాలా స్పష్టంగా పేర్కొన్నారు.
రాజకీయాలు చెడిపోయాయని, అసహ్యించు కోవడం వల్ల ఉపయోగం లేదు. వాటిని మార్చాలి. అంటే యువత రాజకీయాల్లోకి రావాలి. వారు వచ్చినప్పుడు మాత్రమే నేటి తరం ఆశలకు, ఆశయాలకు రాజకీయాల్లో చోటు ఉంటుంది. ఆ ఉద్దేశ్యంతో రాజకీయాలను తమ కెరీర్‌గా ఎంచుకునే వారికి హ్యాండ్‌బుక్‌గా ఉండదగిన పుస్తకంగా ఇది ఉపయోగపడుతుంది. గత 50 సంవత్సరాలుగా రాజకీయ సామాజిక పరిణామాలను చూస్తూ అధ్యయనం చేస్తూ, జర్నలిజంలో విశేష అనుభవమున్న, స్వయంగా రాజకీయాలలో పాల్గొన్న మధురాసిన 'రాజకీయ వృత్తి' పుస్తకం విలువైనది. అధ్యయనం చేయదగినది.
- కె. ఆనందాచారి