Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దసరా తర్వాత పత్తి కొనుగోళ్లకు ముహూర్తం
- గతేడాది కంటే స్వల్పంగా పెరిగిన కనీస మద్దతు ధర
- మార్కెట్లను సిద్ధం చేస్తున్న అధికారులు
అధిక వర్షాలతో అతలాకుతలమైన అన్నదాతలు పత్తి ధరపై గంపెడాశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం గతేడాది కంటే పత్తికి కనీస మద్దతు ధరను స్వల్పంగా పెంచింది. కిందటేడాది క్వింటాల్‌కు రూ.6025 ఉండగా.. ఈ ఏడాది రూ.6380గా నిర్ణయించింది. కానీ తాజాగా ప్రయివేటులో క్వింటాల్‌కు రూ.10వేల వరకు పలుకుతుండటం అన్నదాతల్లో ఆశలు రేకెత్తిస్తోంది. మరోపక్క ఈ ఏడాది మొదట్లో ప్రకృతి సృష్టించిన విలయం కారణంగా పత్తి పంట పూర్తిగా నష్టపోయింది. ఆయా జిల్లాల్లో లక్షల ఎకరాల్లో నష్టపోయినట్లు అధికారులు కూడా ధ్రువీకరించారు. పత్తి మొలక దశ నుంచి ఎదుగుదల వరకు క్రమం తప్పకుండా వర్షాలు కురువడంతో వివిధ తెగుళ్లు సోకి దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అన్నదాతలు పంట దిగుబడులపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దసరా తర్వాత పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. ఆలోపు మార్కెట్లలో కాంటాలు, ఇతర సౌకర్యాలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం అధికారులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించి పత్తి కొనుగోళ్లపై దిశానిర్ధేశం చేశారు.
కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నాం : శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ
ఈ ఏడాది పత్తి కొనుగోళ్లకు సంబంధించి మార్కెట్లను సిద్ధం చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో అయిదు మార్కెట్లలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. కాంటాలు,టార్ఫాలిన్లు, తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించేందుకు పనులు చేపడుతున్నాం. దసరా తర్వాత పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంటగా భావించే పత్తిపైనే రైతులు ఆధారపడి జీవిస్తుంటారు. ఈ పంటను నమ్ముకొని చీడపీడల నుంచి రక్షించుకుంటూ ఏడాదంతా కష్టపడి పండిస్తుంటారు. ఆదిలాబాద్ పత్తికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భలే డిమాండ్ ఉంటుంది. తాజాగా ఈ ఏడాది పత్తి పంట తీసే దశకు రావడంతో అధికారులు కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ కొనుగోళ్లను ప్రారంభించారు. ఆసియాలోనే గుర్తింపు కలిగిన ఆదిలాబాద్ మార్కెట్లోనూ ఈ ఏడాది దసరా పండుగ తర్వాత కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. కిందటేడాది రైతు చట్టాలు అమల్లో ఉండటంతో రైతులు ఎక్కడైనా పత్తిని విక్రయించే అవకాశం లభించింది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో కిందటేడాది చాలా తక్కువ పత్తి విక్రయాలు జరిగాయి. రైతుల వద్ద నుంచి 9.33లక్షల క్వింటాల్ల పత్తిని కొనుగోలు చేశారు. చివరి వరకు క్వింటాల్‌కు రూ.10వేలపైనే ధర పలికింది. బహిరంగ మార్కెట్లో కనీస మద్ధతు ధర కంటే అధికంగా ధర ఉండటంతో సీసీఐ రంగంలోకి దిగలేదు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ధర వస్తుందని అన్నదాతలు ఆశలు పెట్టుకుంటున్నారు. మరోపక్క సీసీఐ కూడా ఈ ఏడాది కొనుగోలు చేస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
దిగుబడిపై దిగాలు..!
ఎడతెరిపి లేని అధిక వర్షాలు ఈ ఏడాది అన్నదాతలను అతలాకుతలం చేశాయి. మొలకదశలోనే భారీ వరదలు రావడంతో పంటంతా కొట్టుకుపోయింది. పత్తి, సోయా, తదితర పంటలన్ని కలిపి సుమారు లక్షకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో రైతు రెండు, మూడు సార్లు విత్తనాలు వేయాల్సి వచ్చింది. ప్రభుత్వాల నుంచి ఎలాంటి పరిహారం రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో ఉన్నారు. వర్షాల కారణంగా వివిధ తెగుళ్లు సోకి పంట పూర్తిస్థాయిలో ఎదగలేని పరిస్థితి ఎదురైంది. ఫలితంగా ఎకరాకు కనీసం 15నుంచి 20క్వింటాల్ వరకు దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 5నుంచి 6క్వింటాల్ వరకు మాత్రమే వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఈ దిగుబడి బాధల నుంచి రైతులను గట్టెక్కించాలంటే..కనీసం మార్కెట్లో మంచి ధర కల్పించడం అత్యవసరంగా మారింది. తాజాగా నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో క్వింటాల్‌కు రూ.10,050 ధర చెల్లించినట్లు తెలిసింది. మిగితా చోట్ల కూడా ఇదే స్థాయిలో ధర పలికితే పంట నష్టపోయి దిగాలుగా ఉన్న రైతులకు కొంత వరకైనా ఉపశమనం కలిగేందుకు అవకాశం ఉంటుంది.