Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
గాంధీజీ సూచించిన బహుళ సూత్రాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గాంధీజీ 153వ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆదివారం జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గంలో అహింస, సన్మార్గంతో నడవాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ బాపూజీ చెప్పిన ఏడు సూత్రాలను ప్రతి ఒక్కరూ జీవితంలో పాటించాలని అన్నారు. గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తున్నారని, పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాల అభివృద్ధికి హరితహారం, పల్లె ప్రగతి, పరిశుభ్రత వంటి కార్యక్రమాలతో పాటు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద పనులు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. గాంధీజీ జీవిత చరిత్రపై ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, భావితరాల వారికీ ఆయన గురించి వివరించాలని అన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, సత్యాగ్రహం, అహింస, భిన్నత్వంలో ఏకత్వం వంటి సిద్ధాంతం ద్వారా గాంధీజీ స్వాతంత్యం సముపార్జించారని అన్నారు. మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ గాంధీజీ, లాల్‌బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అహింస అనే ఆయుధంతో స్వాతంత్యం సంపాదించుకున్నామని అన్నారు. గ్రామాలు, పట్టణాలలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి అరవింద్ కుమార్ మాట్లాడుతూ గాంధీజీ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, స్వతంత్ర పోరాటంలో ప్రజల జీవన విధానం, అసమానతలను, కులమత బేధాలను అన్నింటిని అధ్యయనం చేసుకొని, ప్రజలందరిని సంఘటితం చేసి స్వాతంత్య పోరాటం చేసి సంపాదించుకోవడం జరిగిందని అన్నారు. మంచి ఆలోచనలతో సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచేవిధంగా గాంధీజీ సూచించే వారని అన్నారు. అంతకు ముందు గాంధీజీ చిత్రపటానికి కలెక్టర్, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ చైర్మెన్, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్లో మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు ఫ్రీడమ్ పార్క్‌లను కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ రాజేశ్వర్ రాథోడ్, మున్సిపల్ కమీషనర్ శైలజ, కౌన్సిలర్ వెంకన్న, అధికారులు, ప్రజాప్రతినిధులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.