Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెతుకుతున్నా ....
చీల్చివేయబడ్డ మది దేహానికి
ఎక్కడైనా కాసింత మనఃశాంతినిచ్చే
ఔషదం దొరుకతుందేమోనని !
అన్వేషిస్తున్నా ....
ఎడారిలో విసిరివేయబడ్డ
హృదయ గొంతుకకి
కాసింత ఊరటనిచ్చే
ఊట కనిపిస్తుందేమోనని !
వెంపర్లాడుతున్నా ....
అమావాస్య నిశీధిలోకి తరిమివేయబడ్డ
ఒంటరిని కాసింత వెన్నెల పోగులు
అక్కున చేర్చుకుంటాయేమోని !
ప్రాకులాడుతున్నా ....
రోదించి రోదించి కాలవలై పారుతున్న
కన్నీటికి ఆనకట్ట వేసే రెప్పలు కనిపిస్తాయేమోనని !
ఆశపడుతున్నా ....
అర్థాంతంగా దగాపడ్డ మనసుకి కనిపించని
ఏ అదృశ్య అదృష్టమైనా
కాసిన్ని ఓదార్పు వరాల పలుకులు తెస్తాయేమోనని !
వేచిచూస్తూనే ఉన్నా ....
కనిపించని కంటికి ఏ కాంతిపుంజమైనా
వెలుగుల రేఖలు నింపి దారి చూపుతుందని !
ఆరాటపడుతూనే ఉన్నా ....
ముక్కలవుతున్న ఆశల మాలికల్ని
ఏ దారపుతీగైనా ముడివేసుకుని బంధమై నిలుస్తుందేమోనని !
మరీ మరీ వేడుకుంటునే ఉన్నా ....
భయంకర కీకారణ్యాన్ని మించిన మానవారణ్యంలో
దిక్కుమొక్కూ కానక
భీతిల్లుతున్న హృదయానికి
ఏ అపార శక్తైనా దయార్ద్ర మనసుతో ఆదుకుని
కాసింత మమతపంచి నెలవిస్తుందని !
ప్రార్థిస్తున్నా ....
వెతల ఊబిలో తోసివేయబడ్డ కర్మజీవి బ్రతుకును
కాపాడమని చివరి ప్రయత్నంగా
ఎప్పుడూ కానరాని మనిషి సృష్టించుకున్న
దైవ రూపాన్ని !
దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నారుగా
వెనకటికి ఎవరో ? అందుకని !!
- నాగముని. యం.
9490856185