Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రైవేటీకరణ కార్పొరేటీకరణ
సరళీకృత ఆర్థిక విధానాలతో
ప్రభుత్వ రంగం క్షీణించి
శాశ్వత ఉద్యోగాలు లేక
పొరుగు సేవలంటూ
కాంట్రాక్టు ఉద్యోగులంటూ
వాలంటీర్ వ్యవస్థ అంటూ
స్కీం వర్కర్స్ అంటూ
యాజమాన్య దయా దాక్షిణ్యాలతో
ప్రైవేట్ రంగ ఉద్యోగులు
భద్రతా భరోసా లేక
కనీస వేతనాలు లేక
ఆర్థిక స్థిరత్వం లేక
పగలనకా రాత్రనకా
నిర్ణీత పని గంటలు లేక
ప్రమాదకర పరిస్థితులలో
పనిచేయుచు కార్మికులు
శ్రమ దోపిడీకి గురవుతున్న వేళ
ఉపాధి లేని నిరుద్యోగ యువతకు
మేడే నేర్పిన పాఠం
శ్రమదోపిడి నివారణకు
కార్మికుల హక్కుల రక్షణకు
కార్మిక చట్టాల అమలుకు
పోరాటాలు ఉద్యమాలు చేస్తున్న
ప్రజా సంఘాలతో ఐక్యమయ్యే
సమయం వచ్చిందని
రాజ్యాంగం కల్పించిన
సంక్షేమ రాజ్య స్థాపన
సాకారమవ్వాలంటే
జాతిసంపదలో అందరు
భాగస్వాములవ్వాలంటే
సామాజిక న్యాయం జరగాలంటే
బడుగు బలహీన వర్గాలకు
రిజర్వేషన్లు అమలు కావాలంటే
ఉత్పత్తి సాధనాలను
సహజ వనరులను
ప్రభుత్వ రంగ సంస్థలను
పరిరక్షించుకోవడమే మార్గం
దానికి ఐక్య ఉద్యమాలే శరణ్యం
అదే మే డే నేర్పిన పాఠం
(మే డే కార్మికుల దినోత్సవం సందర్భంగా)
- పి. రామనాధం