Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్షకున్ని,
పంటచేలో దిక్కులు చూపిస్తున్న
సీతకుండలా నిలబెట్టినది నేటి రాజకీయం
చీడపురుగులు ఆకురసాన్ని పీల్చినట్లు
దళారులు రైతురక్తాన్ని జుర్రుకుంటున్నారు
నారుమడి అద్దంలో
చంద్రుని రూపాన్ని చూసి,
చిరునవ్వుతో సాగిపోతూ
చేను మొక్కల మొదళ్ళ మొలిచిన
చుక్కల కండ్లతో
పంటకు కాపు కాస్తడు సేద్యపతి
బురదనే భస్మంలా
అలంకరించుకున్న నిష్కామయోగి
నల్లరేగడి మన్ను మంత్రించి
మల్లెల అన్నం పుట్టిస్తాడు
అప్పు చేసైనా సరే
పంటకన్యకు కనకపు గొలుసులు
మెడలువంగ అలంకరిస్తాడు
కల్తివిత్తనం కాన్పుకాలేక
సుడులు దిరిగి ఉసురు దీసుకుంటుంటే
కర్షకుని పేగులచెమ్మ ఇంకిపోయి
రోట్టె విరిగిన చప్పుడు వినిపిస్తుంది
అతని చినిగిన చొక్క కిటికిలోంచి
ఎముకల ఊచలు కిలుము వట్టి
పెచ్చులూడుతున్నాయి
రైతుపాద చైతన్యయాత్రల
మేకులు నాటి అడ్డుకుంటున్నరు
నకిలీ మందులతో
సస్యరమ నుదుటి సింధూరం
కారిపోతుంది
పంటలమ్ముడువోక
కృషీవళుని నిండుప్రాణం
పంటకుప్పలపై
దిష్టిదీసిన నిమ్మపండులా చితికిపోయింది
రైతురాజ్యం మాత్రం
పేపర్లలో వెలిగిపోతూనే వుంది
- కోరెంకయాదయ్య
9492363404