Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకానొక కన్నీటి వర్షపు రాత్రి..
పూడుకు పోయిన గొంతుతో ఆమె అన్నది
గుండె తడి ఇంకింది కదా..
పెదాలు పెలుసెక్కి నెర్రెలు తీశాయి కదా
పెనవేసుకోవడానికి...పెనగులాడుకోడానికి
చేతులు లేవలెత్తలేను గదా
ఇక.. ఈ స్వరపేటికను మూసి ఈ తిత్తిలోని గాలిని బయటకు పారద్రోలనా...
ఇన్నాళ్ళూ నా అణువణువూ తాకి
ఆపాద మస్తకం అనుభవాల జరీ కుచ్చిళ్ళు తొడిగి
అక్షర అక్షరానికి నీ అద్వితీయ అంతరంగ
వీణా గానాన్ని సింగారించావు గదా..
పదాలకు పచ్చిక బైళ్ళ పావడా చుట్టి
నీ కలల సుతిమెత్తని ఉలితో శిల్పాన్ని పట్టి
శిలల కాఠీన్యపు ఒంటికి సైతం
అనుభూతుల అత్తరులను అద్దావు కదా..
అనువును అనంతం చేసి
అనంతాన్ని అనువులోకి దిగేసి
పత్రికల ఒంటికి అనుభూతుల్ని నేర్పి
ఉద్యమాల ఉద్యాన వనాల్ని నా కంటి
పఠాలంపై ఆవిష్కరించి
ఖాళీ అయిన ప్రాణవాయువు భాండాగారాలకెత్తావు కదా
నిద్ర పట్టని నీ రాత్రి కోసం
నేను నీ కన్నుల్లొకి ఒదిగి నీ గుండె కవాటాలని
ముద్దు పెట్టుకున్నదీ నీ కోసమే
నీ కోసమే... అచ్చంగా నీ కోసమే
వెన్నెల మైదానాల అంచుల మీదుగా
ఇసుక తిన్నెలా పరుచుకొని మన పాదాలను
కరుచుకునే మంచు పరదాల మీదుగా
మౌన బురుజుల మీదుగా..
కలల నిచ్చెనల మీదుగా
నీ కోసమే... నీ వేలు పట్టుకొని ...
ఊరు నిద్రపోతున్న వేళ
నువు మేలుకొని... నన్ను మేలుకొలిపి
మనిద్దరం కలిసి ఆ నిశబ్ద రాత్రిని గిల్లి నిద్రపోనివ్వక
నువ్వూ ....
నేను...
రాత్రి....
బాధ పడి.. భయపడి.. ఒకరినొకరు పట్టుకొని
వాగ్దానాలేవి లేని
నమ్మకాల నావ మీద కాసింత నవ్వుకుని ...
కాసింత ఏడ్చుకుని ఒకరినొకరు విలీనం చేసుకొని
ఓ శీర్షికను తగిలించుకొని ఒడ్డున పడే వాళ్ళం
ఎందరని! ఎందరు మనల్ని ఆప్యాయంగా
ఆలింగనం చేసుకునే వాళ్ళు
కొందరైతే వాళ్ళ హృదయాల్లోకి
లాక్కొని బంధించుకునే వాళ్ళు
మరి కొందరు మస్తిష్కాలపై మనల్ని
శిలా ఫలకాల్లా తగిలించుకొనే వాళ్లు
ఎన్నాళ్ళయిందని నువు నన్ను తాకక
ఎన్నాళ్ళయిందని
నువు నా కురులనూ కుచ్చిళ్ళను సరిచేయక
ఏవి ఆ రాత్రులు?
కలల కోలాహలంతో మనం
ఊరేగింపైన కాలి జాడలెక్కడీ
శీతల రాత్రుళ్ళో ఒంటరి నక్షత్రాన్ని వెంటేసుకుని
వేకువ వరకూ పెనవేసుకున్న నమ్మకాలెక్కడీ
నీ కోసం ఏడ్చి...
నీ కోసం చేయి చాపి...
నిన్ను విడువలేక... వీడలేక
వదిలెయ్యనా ... ఈ కాస్త ఊపిరిని
చెప్పు ఒదిలెయ్యనా...
ఆర్తిగా దీనంగా అడుగుతుందామె
ఒక నిశ్శబ్ద దీర్ఘ శ్వాస తర్వాత నేనన్నాను
వద్దు ఇక్కడే ఉండిపో..
ఈ క్షణమే నేను ఓ ఊటల చెలిమెను తోడుతాను
తోడుగా నువ్వుంటావు
ఆమె నన్ను పెనవేసుకొని
నా ఊపిరి ఆమె లోకి ప్రవహిస్తుండగా..మళ్ళీ
ఆమె...
నేను...
రాత్రి ....
- చెమన్, 9440385563