Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతినిత్యం అబద్ధం
అధికార అంబారీనెక్కి
శహేర్ గల్లీల్లో సైర్ చేస్తే
నిజం నిలకడ మీదే ఓ మూలకు నిలబడి
నేటి సమాజాన్ని బిత్తరపోయి చూస్తుంది..
అన్యాయాల బరాత్‌లో
నిజం నగంగా ఊరేగించబడితే
అబద్ధాల బర్సాత్ లో
అది తడిసి ముద్దౌతుంది..
గుంటనక్కల గూడుపుఠాణీలో
తోడేళ్ల మన్మానీ నడుస్తుంది
అదే సర్వస్వమై అధికారం చెలాయిస్తుంది
కల్లబొల్లి మాటలతో, తొండి ఆటలతో
మొండిగా ప్రవర్తిస్తుంది
పొద్దునే అబద్ధాల అద్దంలో
తనను తాను చూసి మురిసిపోతుంది
సాయంత్రం సాగిలపడి
చుట్టూ మూగినవారిని చూసి
ఇదే నిజమని భ్రమపడ్తుంది
కాలం సాత్ దారీ ఇచ్చి
గద్దెనెక్కిస్తే అధికారమిద్దెనెక్కి
పూరి గుడిసెల్ని నేలమట్టం చేస్తుంది..
ఎదురు మాట్లాడినోళ్ళను బెదిరిస్తుంది..
ఎపుడో ఒకప్పుడు అధికార అద్దె ఇల్లు
ఖాళీ చేసి సొంతింటికి చేరుకోవాల్సిందే
నూకలు చెల్లిన రోజు
మట్టింటితో ములాఖత్ చేయాల్సిందే
ఆత్మీయ చుట్టంలా మారి
పట్టంగట్టిన కాలమే
చూసి చూసి ఎపుడోసారి
నేలమట్టం చేస్తుంది
నిజాన్ని తిరిగి నిలబెట్టనీకి
ఎంతో దూరం లేదు
హిసాబ్ బరాబర్ చేయనీకి
అదే కాలం ఎక్కువ సమయం తీసుకోదు..
- సర్ఫరాజ్ అన్వర్,
9440981198