Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక రిలేషన్ షిప్ కంటిన్యూ కావడమనేది వాళ్ల మధ్య ఉన్న అనుబంధం, అవగాహనపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అయితే, ఏ రిలేషన్ షిప్ లోనైనా ఛాలెంజెస్ తప్పవు. ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఇద్దరినీ ఒత్తిడిలోకి నెట్టేస్తాయి. నీది.. నాది.. అనే ఫీలింగ్ సమస్యల్ని తెచ్చిపెడుతుంది. వాటిని నేర్పుగా ఎదుర్కొంటూ ఒకటిగా నడవడం చాలా ముఖ్యం.
దంపతుల మధ్య చికాకులు, కోపాలు, అలకలు వంటివి సహజమే. అయితే ప్రతిసారీ అప్పటికప్పుడు క్షమాపణలు అడిగి పరిస్థితిని చక్కదిద్దుకోవడం అలవాటైతే ఇది శాశ్వత పరిష్కారం కాదు కదా. నాలుగైదుసార్లు ఇలా సారీ చెప్పినా.. అయిదోసారి భాగస్వామికి నమ్మకం కలగకపోవచ్చు. మంచి అభిప్రాయం దూరమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రతిసారీ ఎందుకిలా జరుగుతోంది. దీనికి కారణమేంటి అని ఆలోచించి, అలా మరోసారి జరగకుండా జాగ్రత్త పడటానికి ప్రయత్నిస్తే ఎవరి వైపు నుండి వారు ప్రయత్నం చేయాలి. అప్పుడే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఇరువురూ కాసేపు కూర్చుని ఎందుకిలా చిన్నచిన్న విషయాలకు గొడవ పడాల్సిన అవసరమేంటి అని మృదువుగా చర్చించుకోవాలి. దానివల్ల కలిగే చికాకుతో సంతోషం దూరమవుతుందనే నిజాన్ని ఇరువురూ గుర్తించగలిగితే చాలు. ఒకరిపై మరొకరు అనవసరపు కోపాన్ని ప్రదర్శించాల్సిన సందర్భం రాదు.
మాట్లాడితే..
కారణమేదైనా అవతలివారిపై మనసులోని కోపాన్ని ప్రదర్శించడం కన్నా, వెంటనే దాని గురించి మాట్లాడితే చాలు. కొందరు చిన్న చిన్న విషయాలకే రోజుల తరబడి మాట్లాడకుండా భాగస్వామిని బాధిస్తుంటారు. సమస్య ఏంటో అవతలివారికి చెబితేనే పరిష్కారం దొరుకుతుంది. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకుంటే అసలు జరిగిందేంటో తెలుస్తుంది. ఊహలకు తావు లేకుండా నిజాన్ని గుర్తించొచ్చు. అప్పుడు కోపం దూదిపింజలా ఎగిరిపోతుంది. లేదంటే ఎన్ని రోజులైనా ఇరువురి మధ్య నిశ్శబ్దం ఏర్పడి ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతుంది. పిల్లలుంటే వారిపై చిన్నతనంలోనే ఎంతటి ప్రభావం పడుతుందో అర్థం చేసుకోవాలి.
నమ్మకం..
ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి. నమ్మకమే లేకపోతే ఆ బంధమే బలపడదు. ఎదుటివారిపై కోపం రావడానికి అపనమ్మకం ఒక పెద్ద కారణం.
భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరికి నమ్మకాన్ని కలిగించడమే కాదు, పూర్తిగా ప్రేమించడం మొదలుపెడితే చాలు. వారి బంధం ఎప్పటికీ బలంగా ఉంటుంది. ఒకరికొకరు ఎక్కువ సమయాన్ని కేటాయించడం, కలిసి సంతోషంగా ఆ రోజు విశేషాలను చెప్పుకోవడం, ఇరువురూ ఎదుటివారిపై బాధ్యతవహించడం, వారి బాధ్యతలను పంచుకోవడం వంటివన్నీ కోపతాపాలను దరికి రానివ్వవు. ఆ బంధం మరింత దృఢంగా సంతోషంగా సాగుతుంది.