Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాయా... మాయా.. .అంతా మాయా. ఎక్కడ చూసినా స్మార్ట్ఫోన్ల మాయనే. పిల్లల నుంచి పెద్దల దాకా లేచిన దగ్గర నుంచీ పడుకునే దాకా అది చేతిలో ఉండాల్సిందే. లేకుంటే పొద్దుపోనట్టే. పిల్లలు పాలు తాగాలన్నా.. తిండి తినాలన్నా చేతిలో ఉండాల్సిందే. లేకుంటే ఏడ్చుకుంట కూర్చుంటారే తప్ప ముద్దనోటిలోకి దిగని దుస్థితి. నిద్రలోనూ చేతివేళ్లతో ఫోన్లను ఆపరేట్ చేసేలా పిచ్చి పీక్ స్టేజీకి చేరుకున్నది. ఏమైనా అంటే 'ఎప్పుడు మీరే చూస్తరా? చూసుకోండి. నేనేం తినను పో' అంటూ మారాం. బెదిరిస్తే ఏడ్చేయటమే. మొదట్లో మురిపెం కోసం పాటలంటూ..డ్యాన్స్‌లంటూ పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చిందీ మనమే. 'ఆ స్మార్ట్మాయ నుంచి బయటపడటం ఎలారయ్యా?' అంటూ తలలు పట్టుకుంటున్నదీ మనమే. పిల్లలు అనేదాంట్లోనూ వాస్తవం ఉందండోరు. ఇంట్లో ముగ్గురు పెద్దోళ్లుంటే ముగ్గురి చేతుల్లో స్మార్ట్ఫోన్లే. లేచినదగ్గర నుంచీ పడుకునేదాకా నిమిషానికోసారి వాట్సాప్.. ఫేస్బుక్... ఇన్‌స్ట్రాగామ్..ట్విట్టర్, యూట్యూబ్.. జీమెయిల్.. మెసెంజర్.. తొక్కాతోలు.. తోటకూర అంటూ చూస్తూ గడిపేయటం షరామామూలే. 'ఆవు చేన్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా'? అన్న సామెతకు గుర్తుచేసేలా స్మార్ట్ఫోన్ల విషయంలో పిల్లలు, తల్లిదండ్రుల మధ్య తంతు నడుస్తున్నది. అంతా అయిపోయినాక 'ఈ ఫోన్లు పాడుగాను' అని తలలు పట్టుకుంటే ఏం లాభం.
- గుడిగ రఘు