Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహర్జాతకుడమ్మా... వీడు!
ఆన్న మాటను నేను, అమ్మ ఒడిలో ఉన్నపుడు, మా తాత మాచన పుండరీకం ఆన్నాడట. ఆ మంచి మాట విన్న మా అమ్మ, ఆ! ఏదో పెద్దాయన కదా, మనవడిపై ప్రేమతో పెద్దాయన అలా అని ఉంటాడులే... అని సంబరపడింది. నాకు నాలుగు పదులు దాటాక కానీ అమ్మకు తాత ఆ..మాట ఎందుకన్నాడో బోధపడలేదు. గతేడాది మే 31న హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం వారు... మేడం, మీ అబ్బాయిని ఇంటర్వూ చేయమని ఢిల్లీ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మాచన రఘునందన్ లాంటి వాళ్ళు సమాజానికి ఎంతో అవసరం. ఓ ఆదర్శ అధికారిగానే గాక, స్ఫూర్తి దాయక వ్యక్తి మీ అబ్బాయి అని వారు వ్యాఖ్యానించడం అమ్మకు ఎంత ఆత్మ సంతృప్తి కలిగిందో. అమ్మ ఎదురు గుండా... నన్ను ఓ ప్రభుత్వ ఛానల్ వారు ఏకధాటిగా గంట పాటు ప్రత్యక్ష ప్రసారంలో ఇంటర్వ్యు చేయడం. అమ్మ కు అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఓ కొడుకుగా అమ్మకు నేను అంతకంటే ఏం... చేయగలను.
రెండు దశాబ్దాలకు పైగా... ఎవ్వర్ని పడితే వాళ్ళను,ఎక్కడ పడితే అక్కడ... సార్... ధూమపానం అలవాటు మానండి మహాప్రభో.. పొగాకు ఆరోగ్యంపై పగ బడుతుంది. కన్న వాళ్లకు పుత్ర శోకం కలిగించకండి. అని రెండు దశాబ్దాలకు పైగా జన బాహుళ్యానికి ప్రార్ధన చేస్తున్న ఈ...మీ హితైషి ''మాచన''... బతికే ఉన్నాడు, అంటే జన్మనిచ్చిన అమ్మే పునరజన్మనూ... ఇచ్చింది.
నేను ఎస్సెస్సీ చదువుతున్న రోజుల్లో... ఓ సాయంకాలం ట్యూషన్ అయ్యాక ఇంటికి బయల్దేరా... అప్పటికే ఉరుములు, మెరుపులతో వర్షం దంచికొట్టింది. చెల్లి, తమ్ముడు వర్షం ఆరంభంకంటే ముందే ఇల్లు చేరారు. ముషీరాబాద్, న్యూ బాకారంలో బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీ దారిలో దయాళ్ మోహన్ స్టీల్ ఇండిస్టీస్ వెనుక మా ఇల్లు ఉండేది. ఇంటికి చేరేందుకు ఓ వీధి గుండా వెళ్లే వాళ్ళం.ఆ వీధి మలుపులో, ఓ విద్యుత్ స్తంభం ఉంది. గాలి దుమారం దెబ్బకు పోల్ పై నుంచి హై టెన్షన్ కరెంటు వైరు తెగి కింద పడింది. దారికి అడ్డంగా... సరిగా సాయంత్రం ఐదు గంటలకు, నేను ట్యూషన్ అయిపోయాక అరగంట లో ఆ వీధి మలుపుకు వచ్చేశా.
అమ్మ పాపం... నాలుగున్నర నుంచి తెగి పడిన విద్యుత్ తీగ సమీపంలోనే ఉంది. ఆ దారిన వెళ్లే వాళ్ళను బతిమాలుతూ... ఉంది. 'బాబూ కాస్త మా అబ్బాయి రఘు కనపడితే?! జాగత్తగా రమ్మని' చెప్పండీ. అంటూ... అలా చెప్పి, చెప్పి ఆమె గొంతు తడారిపోయింది.నేను వచ్చే వరకు తల ఎత్తి చూస్తూ..నే ఉంది. నేను కొద్ది దూరంలో కనపడగానే..ఒక్క సారిగా, ''ఆగు! అక్కడే ఉండు, నేనొస్తున్న'' అంటూ... జాగ్రత్తగా... గోడవారగా ఉన్న ఓ చిన్న అరుగుపై నుంచి నా వద్దకు చేరుకుంది. ఏమైందమ్మ అంటే... కరెంటు తీగ కింద పడింది. షాక్ తగులుతుందని నీకు చెప్పడానికి గంట నుంచిక్కడే ఉన్నా అందీ. తమ్ముడికో, చెల్లికో చెప్పొచ్చు కదా... అన్నా! వాళ్ల ఏమరుపాటుకు కరెంటు షాక్ కొడితే ఎలా? అని ప్రశ్నించింది. అలా... నాకు జన్మనిచ్చిన అమ్మ మరలా... నన్ను మృత్యు గండం నుంచి గట్టెక్కించింది. క్షణకాలం కూడా... కనురెప్ప వాల్చకుండా... కాపలా కాసి, కన్న బిడ్డను విద్యుదాఘాతం నుంచి తప్పించి, మరు జన్మనూ... ప్రసాదించింది. డిగ్రీ అయ్యాక ''నేను సివిల్స్ ప్రిపేర్ అవుతా అమ్మా'' అంటే... ఏమో రా నాన్నా ఒప్పుకుంటారో లేదో ఎంత కావాలేంటీ అని అడిగింది. ఓ లక్ష ఆవ్వచ్చు అన్నా... సరే చూద్దాం అంది. నేను తేలిగ్గా తీసుకుందేమో అనుకున్నా... తన ఆభరణాలు, మంగళసూత్రాలు తనఖా పెట్టి కొంత డబ్బు సర్దింది. నాకు స్వతహాగా డబ్బు దాచుకునే అలవాటు మా నాన్న గారు అభిమన్యు (టీచర్) నేర్పడం వల్ల పోగైన పైకంతో సివిల్స్ సాధన కోసం ప్రయత్నం చేశా. ఇంత చేసిన అమ్మకు నేను ఇంతవరకు ఏనాడూ... ఒక్క చీర కొని ఇవ్వక పోయినా... తను మాత్రం అడపా దడపా... నా ఆర్థిక ఇబ్బందిని అడిగి తెలుసుకుని యధాశక్తి సాయం ఇప్పటికీ చేస్తుంది. నాన్న మమ్మల్ని తన డ్యూటీ హడావిడిలో పెద్దగా పట్టించుకోక పోయినా... అమ్మ మాత్రం అండ, దండగా ఇప్పటికీ తన కను పాపల్లానే చూసుకుంటుంది. విజయమ్మ భలే బిడ్డని కన్నావమ్మా... నీ కొడుకు అందరిచేత, బీడీ, సిగరెట్లు, పొగాకు మాన్పించి ఇళ్లలో వెలుగు నింపుతున్నాడని వాళ్లు వీళ్లు అంటుంటే ఆమ్మ కళ్లలో ఆ ఆనందమే వేరు. అధికారిని అయినప్పటికీ సాదాసీదాగా ఉండటం, బంధు మిత్రులతో కలుపుగొలుగా వుండటం అలవాటు. ఒక్కోసారి నా అత్యుత్సాహాన్ని గమనించి ఎందుకంత అవసరమా?! ఆఫీసర్లా హుందాగా ఉండు అంటూ ఇప్పటికీ ఓ గొప్ప వ్యక్తిత్వ వికాస నిపణురాలిగా సూచిస్తుంది.
అమ్మ... నన్ను చెడు నుంచి కాపాడే, కాపాడుకునే,
ఓ ''అమ్ము'' లా..నే నిర్భయాన్నిస్తుంది. ఆపదలో అభయంగా ఉంటుంది.
(మే 14 అంతర్జాతీయ మాతృ దినోత్సవం)
- మాచన రఘునందన్, 9441252121