Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఏమిటే బాధగా ఉన్నావు'! పరామర్శించింది వీణ. తన చెల్లెలైన ఫిడేలును.
'నా బాధ ఏమని చెప్పాలి అక్కడ!' అన్నది ఫిడేల్ ఆవేదనగా.
'అయ్యో! నీ బాధ ఏమిటని అడుగుతున్నాను కదా!' ఏమని చెప్పను అంటే ఎలాగా?
ఎందుకు బాధపడుతున్నావో చెప్పు చెల్లీ' అన్నది వీణ అనునయంగా.
'నీకేమమ్మా! చరిత్రలో నీకు చాలా మంచి పేరు ఉన్నది.
నాకేమో చెడ్డపేరు ఉన్నది. ఆ పేరు పోవాలని ఎంతో ఆశ పడుతుండగా
నిన్న ఆ చెడ్డ పేరు మళ్లీ వచ్చింది!
'నేను నిజంగా చెడ్డదాన్నా?' అడిగింది ఫిడేల్.
'నీవు చెడ్డదానివి ఎవరన్నారమ్మా! నీవు చాలా మంచి దానివే!
అయినా నీకేందుకే డౌటు వచ్చింది?' ఆశ్యర్యంగా ప్రశ్నించింది' వీణ.
'ఈ మధ్యకాలంలో అందరూ నన్ను అదోరకంగా చూస్తు న్నారు! చెడుకు, నిర్లక్ష్యానికి నేను సింబాలిక్లా మారి పోయావని అనుకుంటున్నారు! ప్రజల మధ్య కనబడాలంటే నాకు అవమానంగా ఉందక్కా?' అన్నది ఫిడేల్.
'అంత అవమానపడాల్సిన పని నీవేం చేశావే!' అడిగింది వీణ.
'ఇద్దరు ప్రముఖ వ్యక్తుల చేతుల్లో నేను కనపడ్డప్పటి నుండి నాకు అవమానంగా అన్పిస్తోంది'! అన్నది ఫిడేల్.
'ప్రముఖ వ్యక్తుల చేతుల్లో ఉంటే నీకు గౌరవమే కదా! బాధపడటం, అవమానపడటం ఎందుకు?' అడిగింది వీణ.
'ప్రముఖ వ్యక్తులంటే మామూలు ప్రముఖులు కాదక్కా!
వారిద్దరూ దైవాంశ సంభూతులుగా పేరుగాంచినవారు!
ఈ ప్రపంచాన్నే ప్రభావితం చేయగలిగిన స్థానాల్లో ఉన్నవారు!
అంతగొప్ప ప్రముఖుల చేతుల్లో నేను కనబడ్డప్పుడే అవమానాల పాలు అవుతున్నాను' అన్నది ఫిడేల్.
'అంత గొప్ప ప్రముఖులు ఎవరే?' ఆశ్చర్యంగా అడిగింది వీణ.
'ఒకరు రోమన్ చక్రవర్తి.మరొకరు భారతదేశ సర్వంసహా చక్రవర్తి' అన్నది ఫిడేల్.
'నిజమే! వీరిద్దరూ సాక్షాత్తూ దైవాంశ సంభూతులే! అలాంటి వారి చేతుల్లో కనపడితే అవమానమేమిటే నీ ఖర్మ కాకపోతే!' అన్నది వీణ విడ్డూరంగా.
'అవునక్కా! చరిత్రలో అత్యంత నాగరికత గల సామ్రాజ్యంగా రోమన్ సామ్రాజ్యం కీర్తి గడించింది!
ప్రజలు, పరిపాలనా పద్ధతి, ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది రోమ్ సామ్రాజ్యంలోనే. రోమ్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాడంటే అది మామూలు విషయం కాదు. చక్రవర్తి సాక్షాత్తూ దైవాంశ సాంభూ తుడని ప్రతీతి. కాని అంతగొప్ప చక్రవర్తి ఫిడేల్ వాయించి, నన్ను అవమా నానికి గురిచేశాడు. నాకు అవ మానం ఎందు కంటే చక్రవర్తి నన్ను వాయించింది. శుభ సందర్భంలో కాదు! రోమ్ నగరం మంటల్లో కాలి పోతుంటే, గొప్ప నాగరికత మంటల్లో కలిసి పోతుంటే, అన్నిం టిని మించి, ముసలీ, ముతకా, బీదా, సాదా ఇంకా చిన్న పిల్లలు ఆ మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేస్తుంటే వారిని కాపాడటం మానివేసి, నన్ను వాయించి, తన ఆనందాన్ని వెదుక్కునే శాడిస్టు వ్యక్తి చేతుల్లో నేనున్నానంటే, అది నాకు ఎంత అవమానం? అన్నది ఫిడేల్.
'నిజమే' అన్నది వీణ.
'ఇది వేల ఏళ్ల నాటి చరిత్ర! ఆ గాయం పూర్తిగా మానలేదు. నాకు జరిగిన అవమానం మెల్లిగా మర్చిపోతున్నస్థితిలో మన దేశ సర్వం సహా చక్రవర్తి మళ్లీ నాకు అవమానం కలిగించాడు' అన్నది ఫిడేల్.
'ఈ చక్రవర్తి ఏం చేశాడు'! ఆసక్తిగా అడిగింది వీణ.
'దేశ రాజధాని ఢిల్లీలో మహిళా రెజ్లర్లు, తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న అధికార పార్టీ ఎంపీపై చర్య తీసుకో వాలని ఆందోళన చేస్తున్నారు. వారు సాధారణ అమ్మాయిలు కాదు.
క్రీడా జగత్తులో భారతదేశం గర్వంగా తలెత్తుకునేలా బంగారు పతకాలు సాధించినవారు! పతకాలు సాధించినప్పుడు, మన చక్రవర్తి వారితో ఫొటోలు దిగారు! కాని వారు రోడ్డుమీద ఆందోళన చేస్తుంటే, ఆ బేటీలను పట్టించుకునే తీరిక లేని చక్రవరి, నన్ను వాయిస్తూ ఫొటోలు దిగారు'! అన్నది ఫిడేల్.
'అవును నిజమే'! అన్నది వీణ.
మణిపూర్ ప్రజల మధ్య మెజార్టీ, మైనార్టీ పేరిట ఘర్షణలు చెలరేగి పదుల సంఖ్య లో ప్రజలు ఒకరినొకరు చంపుకుం టున్నారు! రాష్ట్రం రావణకాష్టమైంది. ప్రజలు అక్కడ ఉండలేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. వేరే దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే, ఒక్క ఫోన్‌కాల్‌తో యుద్ధం ఆపగలిగిన చక్రవర్తి, మణిపూర్ ఘర్షణలను ఆపలేదు! కనీసం వారికి ఫోన్ కూడా చేయలేదు! అంటే అక్కడ ఘర్షణలు ఉంటేనే మంచిదను కున్నాడా'? ఆయన ఏమనుకున్నాడో గాని, ఆ సమయంలో నన్ను వాయిస్తూ ఫొటోలు దిగడం వల్ల, నాకు తీవ్రమైన అవమానం జరిగింది'!
రోమ్ చక్రవర్తి నన్ను వాయించినపుడు ఒక రోమ్ నగరమే తగలపడిపోయింది! కాని సర్వం సహా చక్రవర్తి నన్ను వాయిస్తున్నపుడు , మొత్తం దేశమూ, దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు నానా అవస్తలు పడుతున్నారు. రోమ్‌లో మహా అయితే కొన్ని వేల మంది మాత్రమే, ఇప్పుడే కోట్లాది మంది! అందుకే ఇప్పుడే నాకు ఎక్కువ బాధగానూ, అవమానకరంగానూ ఉన్నది. నేననే వీళ్లకి ఎందుకు దొరికానా? అని నరకం అనుభ విస్తున్నానక్కా' అన్నది ఫిడేల్.
'బాధపడకు చెల్లీ! కర్నాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి! నీ బాధ తీరినట్లే!' అన్నది వీణ.
- ఉషాకిరణ్