Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కర్నాటక శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. ఈ విజయం ప్రత్యేకత ఏమంటే ఇంతవరకూ గత ముప్పై ఐదేళ్లలో ఏ పార్టీ కూడా రాష్ట్రంలో ఇంత పెద్ద విజయం అందుకున్న దాఖలాలు లేవు. 1989లో వీరేంద్రపాటిల్ నాయకత్వంలో కాంగ్రెస్ 43.76శాతం ఓట్లతో 178 స్థానాలు సాధించింది.1999లో 40.84 ఓట్లతో 132 సీట్లు, 2013లో 36.6శాతంతో 122 సీట్లు పొందింది. ఇప్పుడు 130 పైన స్థానాలు వచ్చాయంటే రాష్రాన్ని పాలిస్తున్న బీజేపీ ఎంత ఘోరంగా ఓడిపోయిందో దానిపై ప్రజల వ్యతిరేకత ఏ స్థాయిలో వుందో తెలుస్తుంది. అదే బీజేపీ సంగతి చూస్తే ఇంత వరకూ ఒక్కసారి కూడా పూర్తి మెజార్టీ తెచ్చుకోలేదు. ఎప్పుడూ మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం ద్వారానే గట్టెక్కిన పరిస్థితి. జేడీఎస్ మాత్రం దేవ గౌడ నాయకత్వంలో 1994లో 33.54శాతం ఓట్లతో 115 స్థానాలు తెచ్చుకున్నది. కాని తర్వాత నుంచి దాని బలం క్షీణించి తృతీయ పక్షంగానే పరిణామాలను ప్రభావితం చేయగలిగింది. అదే బీజేపీ యడ్యూరప్ప నాయకత్వంలో 2004లో 79, 2008లో 110, 2018లో 104 స్థానాలు మాత్రమే తెచ్చు కోగలిగింది. అయినా జేడీఎస్ అవకాశవాద కలయిక కారణంగా అధికారం చేయగలిగింది. వరుస ఫిరాయింపులను ప్రోత్సహించడమే గాక పార్టీ మారిన వారందరినీ మంత్రులను చేసి గట్టెక్క గలిగింది. వారిని ఆ తర్వాత రాజీనామా చేయించి గెలిపించు కోవడం గొప్పగా చెప్పుకుంది. ఈ అవకాశం కోసం బీజేపీ నేరుగా గాలిజనార్థనరెడ్డి మైనింగ్ మాఫియాకు వత్తాసు నిచ్చింది. మంత్రులను చేసింది. దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన ఒకే ఒక రాష్ట్రం వెనక రాజకీయ నేపథ్యం ఇలా వుంది. మధ్యలో గాలి, యడ్యూరప్పలపై కేసులు, అరెస్టులు వంటి పరిణామాలు చాలా జరిగాయి. యడ్యూరప్ప స్వంత పార్టీ పెట్టుకుని మళ్లీ తిరిగి వచ్చి చేరడం ఒకటైతే గాలి ఇప్పుడు వేరు కుంపటి పెట్టి తన వారిని గెలిపించుకున్నారు.
కుటిల మత ధన రాజకీయాలు
కర్నాటక అధికారం కోసం బీజేపీ మత రాజకీయాలను ప్రోత్సహించడం, యడ్యూరప్ప కుల రాజకీయాలను పెంచడం అందరికీ తెలుసు. ఆర్థిక రాజకీయ పాలనాపరమైన అవినీతిని ప్రతీకగా ఆయన నడిపిన రాజకీయాల చరిత్ర అంతగా తెలి యదు. ఎందుకంటే లింగయాత్లను సమీకరించి గెలిపించడమే గొప్పగా ప్రచారమవుతుంటుంది. అంతకంటే దారుణమైంది మత రాజకీయాలను రెచ్చగొట్టడం. హిందూత్వ విద్వేష రాజకీయాలకు ప్రవేశం కల్పించడం. వాటివల్ల కర్నాటక రాజకీయాల స్వరూపమే మారిపోయింది. హిందూ, ముస్లిం తగాదాలు, ప్రార్థనా స్థలాల వివాదాలు, టిప్పు తదితరుల చరిత్రలు తిరగదోడి వివాదాలు పెంచడం, గౌరీ లంకేశ్, కల్బుర్గి వంటివారి హత్యలు, శ్రీరామ్ సేన వంటివాటితో ప్రేమికులపై దాడులు చేయడం ఒకటేమిటి అదివరకు కర్నాటకకు తెలియని దారుణాలెన్నిటికో బీజేపీ కుటిల వ్యూహాలు కారణమైనాయి. ఈ మధ్యలో మళ్లీ యడ్యూరప్ప వ్యక్తి గత రాజకీయ పేరాశలు. కార్పొరేట్ శక్తుల ప్రాబల్యం, కబ్జాలకు కర్నాటక చిరునామాగా మారింది. రాజకీయ అవసరాల కోసం బీజేపీ ఢిల్లీ నేతలు ఈ పోకడలకు వంతపాడారు. ఈ విధంగా మతతత్వ రాజకీయాల రాష్ట్రాన్ని కల్లోలితం కలుషితం చేశాయి. ఇందుకు ప్రతిగా ఇస్లామిక్ తీవ్రవాదం కూడా ప్రవేశించింది. ప్రశాంత పారిశ్రామిక సాంకేతిక నగరమైన బెంగళూర్ అభద్రతలకు నిలయమైంది. కాంగ్రెస్‌కు ప్రత్యర్థిగా ఉన్న జనతాదళ్ దాని తదుపరి రూపాలైన జేడీఎస్ వంటివి కూడా అవకాశవాదానికి పాల్పడ్డం ఈ కుట్రలకు ఊపిరిపోసింది. ప్రధానిగా దేశానికి దేవగౌడను అందించిన జనతాదళ్ పరివారం ఉత్తరోత్తరా జేడీఎస్ రూపంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య దోబూచులాటకు కారణమైంది.
ఎందుకు విఫలమైంది?
2014లో మోడీ రాజకీయం మొదలై నాక కర్నాటకలో దాన్ని తీవ్ర రూపంలో అమలు చేయడంతో పరిస్థితి మరీ దిగ జారింది. 2023 ఎన్నికలలో భజరంగ దళ్ నిషేధం ఆధారంగా ప్రచారం ముందుకు తేవడం మోడీ సభల్లో అదే నినాదం కావడం ఇందుకు పరాకాష్ట. దీనికి ముందు హిజాబ్ వివాదం, టిప్పుసుల్తాన్ ప్రతిదీ సమస్యా త్మకమైంది. ఇలాటి నేపథ్యంలోనే 2023 ఎన్నికల తీర్పు విలక్షణమైందిగా చెప్పవలసి వస్తున్నది. సర్వేలు ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్నిటిలోనూ దాదాపుగా కాంగ్రెష్ పెద్దపార్టీగా చూపించానా వాస్తవంగా ఉన్న ఆధిక్యతను చెప్పడానికి బీజేపీ భయమే ఆటంకమైంది. ఇప్పుడు ఫలితాలు చూస్తే అసాధారణ విజయంగా గోచరిస్తున్నది. నిస్సందేహంగా ఇది మతతత్వంపై అవినీతిపై ప్రజలిచ్చిన తీర్పు. కాంగ్రెస్ నాయకత్వం అనైక్యత నుంచి బయటపడటానికి చాలా కసరత్తు అవసరమైంది. అలాగే గతవారం చెప్పుకున్నట్టు మతపరమైన సమీకరణలను సంతృప్తి పర్చేబదులు సమస్యల పరిష్కారం ప్రజలకు రాయితీలే వాగ్దానాలుగా కాంగ్రెస్ ప్రణాళిక విడుదల చేసింది. అదే ప్రజలను ఆకర్షించింది. ఆదరణ పొందింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, ట్రాఫిక్సమస్యలు, శాంతిభద్రతలు ప్రతిదీ ప్రజల ఆగ్రహానికి కారణమైంది. బీజేపీ అమితోత్సాహంతో ముందుంచిన వివాదాస్పద అంశాలు ప్రజలలో ఉద్వేగం పెంచలేకపోయాయి. అలా అని ఒక్కసారిగా కర్నాటక లౌకిక విధానమే తీసుకుందని కాదు. మతతత్వ ఘర్షణలు, వివాదాలు, విద్వేష వాదనలకు మాత్రం తావులేదని చెప్పింది. భజరంగదళ్ నిషేదం అంటే ఆంజనేయుడిపై నిషదమేనన్నట్టు ప్రచారం చేస్తే ప్రజలు కొట్టుకుపోలేదు. వాస్తవంలో దీనికి వ్యతిరేకంగా సమీకరణ జరుగుతుందని కూడా కాంగ్రెస్ వ్యూహాత్మక ఆలోచనచేసి ఫలప్రదమైంది.స్థానిక బీజేపీ నేతలు మంత్రులు కూడా ప్రతిష్ట కోల్పోయిన పరిస్థితులలో ప్రచారానికి ప్రధాని మోడీనే ఏకైక ప్రచారకుడుగా తిరగాల్సి వచ్చింది. అయినా ఘోరమైన ఓటమి తప్పలేదంటే మోడీ జనాకర్షణ పరిమితులు కూడా స్పష్టమైనాయి. కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ నిరంతరం మాట్లాడుతుండగా వాస్తవంలో బీజేపీ ముక్త దక్షిణ భారత్ అవతరించింది (పాండిచ్చేరి మినహా) దక్షిణాదిన కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బీజేపీ కాలూనడం పెద్ద రాజకీయ సవాలుగా తయారైంది. ఉత్తర భారతంలో విజయం చేకూర్చిన హిందూత్వ నమూనా రాజకీయాలు దక్షిణాన చెల్లబోవని తేటతెల్లమైంది. మొన్ననే సుప్రీం కోర్టు ఢిల్లీ, మహారాష్ట్ర పరిణామాలపై ఇచ్చిన తీర్పు కూడా కేంద్రం పెత్తనానికి చివాట్లు పెట్టింది. నిజానికి ఆ జాబితాలో కర్నాటక కూడా ఒకటిగా వుండేది.ఇక్కడ నేరుగా ప్రజలే తమ తీర్పుతో మర్చిపోలేని పాఠం నేర్పారు.
కాంగ్రెస్ కసరత్తు
కాంగ్రెస్ పునరుద్ధరణ క్రమంలో ఈ తీర్పు మరో మైలురాయి అవుతుంది.రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర నిజంగానే కొంత ఐక్యత పెంచడంతో పాటు ఓటర్లను ప్రభావితం చేసింది. దళితనేత మల్లిఖార్జున ఖర్గే ఏఐసిసి అధ్యక్షుడు కావడం సానుకూలత పెంచింది. ట్రబుల్షూటర్ గా పేరున్న డికె శివకుమార్, గత ముప్పయ్యేళ్లలో పూర్తికాలం బాధ్యత నిర్వర్తించిన ఒకే ఒక మాజీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యల సఖ్యత కోసం కూడా రాహుల్‌గాంధీ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. బీజేపీ విధానాలు నచ్చక పోవడం, విజయావ కాశాలు లేకపోవడం వల్ల చివరి క్షణాల్లో కాంగ్రెస్ తీర్థం తీసుకున్న మాజీ సీఎం జగదీశ్ షట్టర్ వంటివారిని కూడా చేర్చుకుని పోటీ చేయించింది. కీలక నేతలు విడివిడిగా చేసినవ వాగ్దానాలన్ని కలిపి అయితు హామీలుగా ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఇవన్నీ సానుకూల ప్రభావం నెరిపాయి. జేడీఎస్ అవకాశవాదానికి విరుగుడుగానూ పనిచేశాయి. పోలింగ్ ముగిసిన మరు రోజునే కుమారస్వామి తనే కింగ్మేకర్నవు తాననీ, కాంగ్రెస్ బీజేపీ రెండింటితో మాట్లాడుతున్నానని చెప్ప డం ఇందుకు అద్దం పట్టింది. తీరా ఆయనే ఓట్ల లెక్కింపు కన్నా ముందే ఈసారి తన పాత్ర ఉండకపోవచ్చని ఒప్పుకోవలసి వచ్చింది. విశ్వసనీతయ కోల్పోయిన ఫలితమిది. ఈ ఓట్లు సీట్లు కూడా కాంగ్రెస్‌వైపు మరలడం ఒక కీలకపరిణామం. తొలి ఫలి తాల్లో కొంత అస్పష్టత వుండటంతో బీజేపీ, జేడీఎస్‌తో మంత నాలు ప్రారంబించి భంగపడింది. గాలి జనార్ధనరెడ్డితో పాటు ఆయన పార్టీ తరపున ఒకరిద్దరు ఎన్నికవడం, రెబల్ అభ్యర్థులు కూడా నెగ్గడం ఈ సారి కొత్త పరిణామం. వీరిలో కొందరు కాంగ్రెస్‌లో చేరినా ఆశ్యర్యం లేదు. ఈ ఎన్నికల గురించిన అనేక అంశాలను మున్ముందు సమీక్షించుకోవల్సి వుంటుంది.
కీలక కర్తవ్యం
ఇక ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి ఎవరనేదానిపై చర్చ ఉత్కంఠ కేంద్రీకృతమైంది. సిద్దరామయ్య, శివకుమార్‌లలో ఎవరో ఒకరికి ఈ పదవి లభించవచ్చు. అలాగాక ఇద్దరినీ పదవీ కాలం సమంగా విభజంచి అవకాశం ఇవ్వచ్చునేది మరో అంచనా. ఉపముఖ్యమంత్రి పదవి కల్పిం చవచ్చు కూడా. అనేక కోణాలలో సీనియారిటీ రీత్యా సిద్దరామయ్యకు అవకాశం రావచ్చు. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో అనుభవాలు కూడా కాంగ్రెస్ ముందున్నాయి. ఈ వివాదంతో కాంగ్రెస్ చీలిపో తుందని కూడా బీజేపీ నేతలు వారి అనుకూలురు కథలు వదులుతున్నారు. కాంగ్రెస్ సీట్లలో సగం కూడా తెచ్చుకోలేక పోయిన బీజేపీ అంత దుస్సాహసం చేయకపోవచ్చు. ఈ ఫలితాల ప్రభావం పక్కనే ఉన్న తెలంగాణపై తప్పక వుంటుందని కూడా పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీని గట్టిగా వ్యతిరేకిస్తున్న కారణంగా ఇది సానుకూల పరిణామంగా పరిగణించి శుభాకాంక్షలు చెప్పింది. అయితే ఇతర వైరుధ్యాలు కొనసాగుతుంటాయి గనక తమకే మేలు చేస్తుందని కాంగ్రెస్ వారంటున్నారు. ఆ ఊహాగానాల కన్నా మతోన్మాదాన్ని కేంద్రం నిరంకుశత్వాన్ని ఎదుర్కొవడం కీలకం. ఇప్పటికీ వెనకబడి పోయిన బీజేపీ ఈ దెబ్బతో మరింత వెనక్కు పోవలసి రావచ్చు. ఏపీలో బీజేపీతో అంటకాగుతున్న మూడు ప్రాంతీయ పార్టీలకు కూడా ఇదొక కనువిప్పు కావాలి. ఇక వారితో పొత్తు గురించి కల వరిస్తున్న పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వంటివారు కూడా కళ్లు తెరవాల్సి వస్తుంది. 2024 ఎన్నికల పోరాటానికి అవసరమైన ప్రతిపక్ష అవగాహన కోసం లౌకిక శక్తులు కృషి చేయాల్సి వుంటుంది. కర్నాటకలో లాగే ఒక బలమైన శక్తిగా లేకున్నా కేంద్రాధికారాలతో, మత రాజకీయ ప్రభావంతో రాష్ట్రానికి నష్టం చేస్తున్న బీజేపీపౖౖె ఉమ్మడిగా పోరాడాల్సిన అవసరాన్ని ఈ తీర్పు మరోసారి గుర్తుచేస్తుంది. పోరాడగలమనే భరోసా ఇస్తుంది.తక్షణమే జరిగే నాలుగు హిందీ రాష్ట్రాలలోనూ బీజేపీతో తలపడటానికి అవసరమైన స్థైర్యం కాంగ్రెస్‌కు పెరుగు తుంది. ఏకపక్ష రాజకీయాల స్థానే బహుళ పక్ష ప్రజాస్వామ్యాన్ని పున:ప్రతిష్టించడం, రాజ్యాంగంలోని లౌకిక సమాఖ్య విలువలకు పట్టం కట్టడం, ఈ తీర్పు అసలైన ప్రాధాన్యత.
- తెలకపల్లి రవి