Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆహౌ! ఏమిది! గాఢాంధకారం అలముకున్నది?
డబుల్ ఇంజన్ సర్కార్‌కు పతన మారంభించినా... తేజోవంతమైన మా ప్రకాశము ఇక మసకబారునా..? ఎన్నెన్ని ఎత్తులు. పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, కడకు ఎవరు గెలిచినా అధికార పీఠం అధిష్టించేది తాముగాక మరెవ్వరూ? అని విర్రవీగుతున్న తమకే పాఠం నేర్పే ఓటరున్నాడా..? హతవిధి!
అవును ఉన్నాడు. ఉన్నాడు గనుకనే పరిపూర్ణ మెజార్టీ ప్రత్యర్థికి కట్టబెట్టాడు. ప్రతిపక్ష నేతలను అంచనా వేసితిమి గాని ఆఫ్ట్రాల్ ఓ ఓటర్ని అంచనా వేయలేక పోతిమా..?
ఆ... నా యోగము, నా ధ్యానము, నా నటనా సామర్థ్యమూ, వన్నెతెచ్చే వన్‌సైడ్ వాగ్భూషణమూ అన్నీ ఇక వ్యర్థమేనా.
ఆఁ... ఎచటివారు... ఎక్కడివారు... ఈ ముస్లిం మైనారిటీలు, మూడు దశాబ్దాల కింద నాటి జనతాదళ్ సెక్యులర్ ప్రభుత్వం వీరికి కల్పించిన నాలుగుశాతం రిజర్వేషన్లు మా ప్రభుత్వం తొలగించి, వొక్కలిక, వీరశైవులకు కేటాయించాలని చేసిన నిర్ణయం కన్నడ ఓటరుకు, అదియునూ హిందూ ఓటరుకు ప్రీతిపాత్రము కాలేదా? ఏమీ దుర్గతి? మరిక ముస్లిం ఓటర్లను బెదిరించుటెట్లు? భయపెట్టుటెట్లు? ఉక్కుపాదంతో అణచవలెనన్న యోచనను భంగపరిచితిరే...
హిందూత్వ పెట్టుబడి రాజకీయాలకు తూట్లు పడుటలేదు కదా..? ప్రతిఘాత ఆలోచనలు ప్రతిహతమౌ గాక.చీ... చీ... అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ అధికారం ఉన్నా ఫలితం లేకపోయెనే? ఇది స్వయం కృతాపరాధం కాదుకదా? మరి అంతులేని ధనం... కార్పొరేట్‌రంగం ఏమైంది? తామే మేము, మేమే తాము అన్న రీతిలో కార్పొరేట్ రంగాన్ని భుజాన వేసికొంటిమే. మరి ఈ కీలక సమయంలో వారు మా అండనుండి గట్టెక్కించవలెను కదా..? ఏమయ్యారు వారు?
లేక వారి బండారాన్నీ కనుగొంటున్నాడా ఓటరు. ఓటరుకు అంత తెలివి వచ్చినదా? కనుకనే ఎవ్వరూ ఊహించని తీర్పు నిచ్చాడా..? హంగ్ ఊహాగానాలకే తెరదించాడు. కింగ్ మేకర్లకు స్థానం లేకుండా చేశాడు ఈ ఓటరు. ఏమిది? నేను ఓటరును పొగడటం లేదుకదా!
ప్రచారంలో భూసురునిగా భావించి పూలు జల్లారే. కాళ్ళకు మొక్కారే. ఆ భక్తి పారవశ్యం ఇంకనూ కళ్ళలో మొదులుతున్నది. నా నటనకు ప్రతినటన కాదు కదా! కాదు.. కాదు... వారి నిజాయితీ, అమాయకత్వము లవలేశము శంకించ జాలము. కనుకనే దాదాపు గత శాతం ఓట్లు దక్కనే దక్కాయి. సీట్లు తప్ప.
ప్రత్యర్థి గెలుపునకు వారి పంచ సూత్ర ప్రణాళికా పథకమే కీలకమా? గృహజ్యోతిపథకం - ప్రతి పేద కుటుంబానికి 200యూనిట్లు ఉచిత విద్యుత్, గృహలక్ష్మి పథకం - యాజమాన్య గృహణులకు రెండువేల రూపాయల ఆర్థిక సహాయం, అన్న భాగ్య పథకంగా నిరుపేదలకు 10కిలోల ఉచిత బియ్యం. యువనిధి యోజన పథకం ద్వారా పట్టభద్ర నిరుద్యోగికి నెలకు మూడువేల రూపాయలు, డిప్లమో వారికి పదిహేను వందలు, ఆర్టీసీలో పేద మహిళకు ఉచిత ప్రయాణ పథకం.
ఏమిది, వారి ఎన్నికల ప్రణాళిక పథకాలను నేను ఏకరువు పెడుతుంటిని? ఆ... లోతుగా చూసినా... ఈ ప్రణాళికలో యువజన, మహిళా సాధికారితా అంశాలు గోచరిస్తున్నవి సుమా...
మరి మా ఎన్నికల ప్రణాళిక ఏమైంది? మేమూ ఉచితాలు వాగ్దానాలు చేసితిమే. అయినా మా ప్రభుత్వ చేతలే మా ప్రణాళిక. ఎవరికైనా ఆచరణే కదా గీటురాయి. భళా! మా చేతలే మా మాటలు. మా చేతలను విశ్వసించిన వారే మాకు ఓట్లు వేసితిరి.
వైదిక ధర్మ ప్రభోద కుల మత భావోద్వేగాలు కన్నా కూడు గుడ్డ నీడ వంటి తుచ్ఛమైన కనీస అవసరాలవైపే ఈ ఓటరు మొగ్గు చూపుతున్నాడంటే... మన పాలనను మెరుగు పరచకోక తప్పదు గాక తప్పదు.
జై భజరంగ భలి... హిజాబ్ వ్యవహారం హిందూ ఓటర్లను ఉద్దీపన గావించడం లేదా? 40శాతం కమిషన్ల వ్యవహారం హిందూ ధర్మానికి ఆటంకం అవుతున్నదా..?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మా భారత్ తోడో విధానాలు సమాధానం కావా..? కిం కర్తవ్యం?
వ్యూహం మార్చాలా? ఉన్న విధానాలు మొరటుగా కొనసాగించాలా..?
అదియునూ చూసెదము.
విద్వేషదుకాణం బందై ప్రేమ దుకాణం తెరిచింది అని అరచేవారికి పాఠం చెప్పెదను. క్రోనీ కాప్టిలిజంపై పేదల విజయ బావుటా! అనే వారికి కూడా సమాధానం ఇవ్వవలసి అగత్యం ఏర్పడింది.
ముందున్నది ముసళ్ళ పండుగ. ఎప్పటికైనా ఈ దేశం మాది అంటే హిందువులది. దేశం అంటే సింహాసనం అని వేరే చెప్పాలా..?
ఓటర్లది మాత్రమే భారతదేశం. అదీ ప్రజాస్వామ్య దేశం... హా...హా...హా...
- కె. శాంతారావు
9959745723