Authorization
Tue May 06, 2025 05:34:31 am
- శశికళ.బి
ఆ.వె
మరుగు దొడ్ల లోన మురి కి పోగొట్టును
చీపురొకటి పట్టి చేతిలోన
అంచనాలు మించి మంచమందున సేవ
పంచె ప్రేమ వొళ్ళు వంచి వీరు!
ఆ.వె
జటిలమైన పనులు తటపటాయించక
చేటునే కరోన చేయకుండ
మంచి మనసు తోడ మన కార్మికులు జేసె
నాటి నుండి సేవ నేటి వరకు!
ఆ.వె
ఓర్పు కలిగియుండు కార్మిక వీరుడు
పారిశుద్ధ్య పనులు ప్రజల సేవ
నిర్మలముగ జేయు నీతడే పనినైన
మర్మ మెరుగనట్టి కర్మ జీవి !
ఆ. వె
దేశ సేవలోన ఆశ వర్కరులంత
లేశ మైన యాశ లేనివారు
ఆసుపత్రులందు దాసులై సేవలు
తీసిపోని యట్లు చేసినారు!
ఆ. వె
కోరి చేయు చుండె కోవిడ్డు రోగికి
భారమనక జేసె వీరి సేవ
ఆర్తి తోడ నర్సు అక్కున జేర్చెను
ఆసుపత్రులందు ఆదరించె!