Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యం. రాములు పేరుతో బాల లోకానికి, బాల సాహిత్యానికి పరిచయమైన సాహితీవేత్త అసలు పేరు డా. ముష్టిదొరల రాములు. పాలమూరు జిల్లా ఆత్మకూరులో ఆగస్టు 6, 1949న పుట్టారు. శ్రీమతి అచ్చమ్మ-శ్రీ సంజప్ప వీరి తల్లితండ్రులు. ఎం.ఎ., ఎం. ఈడి., ఎం.ఫిల్., పిహెచ్.డిలు చేసి ఉపాధ్యాయవృత్తి నిర్వహించారు. దాదాపు యాభైయేండ్ల వివిధ సంస్థల్లో విద్యా సేవలందించి, వందలాది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పదవీ విరమణ పొందిన డా. రాములు పిల్లలకోసం అనేక మేలిమి రచనలు చేశారు.
బాల సాహితీవేత్తగానేకాక కవిగా, రచయిత గా, చరిత్ర పుస్తకాల రచయిగా ముష్టిదొరల రాములు సుప్రసిద్ధులు. మహబూబ్ నగర్ జల్లా సాహిత్యం, చరిత్రలపై వీరు ప్రామాణిక పుస్తకాలను రాశారు. వాటిని 'పాలమూరు చరిత్ర-సంసృతి' పేరుతో అయిదు భాగాలుగా ప్రచురించారు. పాలమూరు (మహబూబ్ నగర్) చరిత్ర సంస్కృతులను తెలుసుకోవడానికి ఇవి దోహదపడుతున్నాయి. వివిధ పత్రికల్లో దాదాపు యాభై పరిశోధక వ్యాసాలు, రెండు వందలకు పైగా కథలు రాసిన రాములు కవిగా, వ్యక్తిత్వ్త వికాస నిపుణుడిగా కూడా పరిచితులు.
ఉపాధ్యాయునిగా తరగతి గదిలో పాఠాలు బోధించిన అనుభవాలు, జీవితం నేర్పిన పాఠాలు, తాను బడిలో గమనించిన అనేక విషయాలు రచనలుగా మలిచారు డా.రాములు. అటువంటి పుస్త కాలే 'సక్సెస్ఫుల్ టీచర్', 'మన మార్కులు-మన చేతిలో....' వంటివి. పైన చెప్పినట్టు వ్యక్తిత్వ్త వికాసం విషయంలోనూ ఆయన తన అనుభవాలను మనం దరికి అందిం చేందుకు 'జయానికి ఒకే మెట్టు', 'జ్ఞాపకశక్తి పెరగాలంటే?', 'మన తలరాత రాస్తున్న దెవరు?', 'ఎవరు ఎవరి తో ఎలా మెలగాలి', 'జీవిత మంటే ఆలోచించు -ఆకాంక్షిచు', మొదలగు అనేక రచనలు చేశారు. కవిగా 'రామ భాషితాలు' పేరుతో అయిదు భాగాలు ప్రచురించారు. ఇంకా 'కవితా ప్రస్థానం', 'కవిత స్రవంతి', 'కవితా ఝరి' వంటివి వీరి ప్రచురిత రచనలు. ఎం.ఫిల్లో బంగారు పతకం అందుకున్న డా. రాములు ఉపాధ్యాయునిగా చేసిన సేవలకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. మండల స్థాయితో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సత్కారం అందుకున్నారు.
వివిధ అంశాలపై, విషయాలపై విలువైన రచనలు చేసిన డా.రాములు పిల్లల కోసం కూడా ఎన్నదగిన రచనలు చేశారు. వాటిలో మూడు భాగాలుగా 'చిన్నారుల కథలు' ప్రచురించారు. 'సిసీంద్రుల కథలు' రెండు భాగాలుగా తెచ్చారు. ఈ అయిదు బాలల కథల పుస్తకాలు బాల సాహితీవేత్తగా డా.రాములు స్థానాన్ని తెలుగు బాల సాహితీ క్షేత్రంలో సుస్థిరం చేస్తున్నాయి. చిన్నారుల నీతి కథలు 77 కథల సంపుటి. పిల్లలకు నీతుల్ని, లోక రీతుల్ని చక్కగా పరిచయం చేసిన పుస్తకమిది. ఇందులోని మొదటి కథ 'ఇరుగు పొరుగు' మానవుడు సంఘజీవిగా జీవించాలన్న విషయాన్ని చక్కని ఉదాహరణతో పిల్లలకు తెలుపుతుంది. ఇరుగు పొరుగు బాగుంటేనే మనమూ బాగుంటాం అన్న సందేశం యిస్తున్న ఈ కథ బాలలను ఉత్తమ పౌరులుగా, బాధ్యత తెలిసిని నాగరికులుగా ఎదిగేందుకు తోడ్పడుతుంది. ఇంకా ఇంఉదలోని ముందుచూపు, ఏకాగ్రత, జ్ఞానోదయం, స్ఫూర్తి, కనువిప్పు, అత్యాష, జ్ఞానతృష్ణ, శ్రమకు తగ్గఫలితం. మంచి మనసు, సృష్టి ధర్మం వంటి కథలు పిల్లల మనసుకు హత్తుకునేలా, వారు చెచ్చేలా వారికి ఎలా చెప్పొచ్చో తెలుపు తాయి. ఇందుకు యాభైయేండ్ల బోధనానుభవం వీరికి తోడ్పడింది. నిజానికి ఈ డెబ్బైయేడు కథల్లో దేని గొప్పతనం దానిదే. బాలల కథకునిగా డా. రాములును ఈ కథలు చక్కగా పరిచయం చేయడమేకాక ఎలా రాయాలో కూడా తెలుపుతాయి.
ఏది రాసిన 'బాల బాలికల్లో నైతిక విలువలను పొంపొందించాలి' అన్నదే డా. రాములు ఆలోచన, ఆశ, ఆశయం. అందుకు ఆయన రచనలు తార్కాణాలుగా నిలస్తాయి. సిసీంద్రుల కథల్లో కూడా మనం యిది చూడొచ్చు. ఈ కథలు మూడు భాగాలుగా వెలువడ్దాయి. 'కథలు బాల బాలికలు మిఠాయిలాంటివి' అని నమ్మారుకాబట్టే తీయని కథలను పిల్లలకు తాయిలంగా అందిచగలిగారు. ఈ సిసీంద్రి కథలన్నీ ఆంధ్రభూమి సిసీంద్రీలో వచ్చినవే. కలం హలం, అసత్యం, మిత్రలాభం, కీర్తి, అసూయ, ఎవరు గొప్ప, సమర్ధుడు వంటి అనేక మంచి కథలు ఇందులో ఉన్నాయి. బాలల్లొ మానవీయ విలువలు, సామాజిక విలువలు పెంచేందుకు తన కథలను ఒక సాధనంగా ఎంచుకుని రచనలు చస్తూ, తెలుగు బాల సాహిత్యాకాశంలో వెలుగుతున్న తెలంగాణ బాల సాహిత్యపెద్దల్లో డా. ముష్టిదొరల రాములు ఒకరు. ఇవ్వాళ్ళ 73వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా జేజేలు!
- డా|| పత్తిపాక మోహన్,
9966229548