Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగా పెండ్లై కోడలు అత్తగారింటికి వచ్చిన తొలిరోజుల్లో కుటుంబ వాతావరణం అలవాటు అయ్యేవరకు కాస్త బిడియం ఉంటుంది. ముందే అత్త అంటే యాజమాన్య అధికారం. కోడలు అంటే కొత్తగా ఉద్యోగం చేరడం దృక్పథాలు అలవాట్లు ఆచారాల్లో తేడా ఉండేది పూర్వపు రోజుల్లో... అప్పుడు కోడలికి పనిరాకపోతే అత్త ఏదన్న మాట అనుడు తొందరగా చెయ్యమనుడు ఉండనే ఉంటది. అత్తకోడండ్లు కల్సి వరి కోసేందుకు పొలం దగ్గరికి పోయినంక వరిపైరు కోసేందుకు ఎవరి మునుం వారికి ఉంటది. మునుం అంటే ఎవరు ఎంత వెడల్పుతో పని చేయాలనే కొలమానం. అత్తా కోడలు ఒకేసారి కొడవలితో కోత మొదలుపెట్టినా అత్త ముందుకు పోతది. కోడలు వెనకబడే ఉంటది. అప్పుడు అత్త ఏమే కోడలా మునుం ఎల్లుతలేదు అని అడిగితే 'మా అవ్వగారి కొడవలి అయితే ఎప్పుడో మునుము ఎల్లుతు' అని అన్నదట. అన్ని కొడవండ్లు ఒక్క తీరే ఉంటయి కానీ తాను పెండ్లి గాకముందు అవ్వగారి కొడవలితో పని చేసినట్టు ఈ కొడవలి మంచిది కాదని చెప్పేటప్పుడు ఈ సామెత ఉపయోగిస్తరు. తనది పని రాకనో లేక రెక్కలు దాసుకునేందుకో అట్ల చేస్తది.
అత్తకోడండ్లు సంబందించి మరెన్నో సామెతలు ఉన్నయి. కొందరు అత్తకోడండ్లు మధ్య తగవు పెట్టిచ్చేవాళ్లు ఉంటరు. వాళ్ళు అత్తకు కోడలు మీద చెప్పడం, కోడలికి అత్తమీద చాడీలు చెప్తుంటరు. వీళ్ళను 'అత్త అమ్ముకొమ్మంటది - కోడలును కొలుసుకోమ్మంటది' అంటరు. అంటే ఆ కాలం అవసరానికి ఇంట్లో బియ్యం వడ్లు అమ్ముకునేవాళ్లు. ఆ సందర్భంలో అత్తకు పక్కింటామె అమ్ముకో వడ్లు అని చెప్పుతది. ఈమె సలహాతో వడ్లు అమ్మినంక మరో రోజు తనే కోడలితో నీ వడ్లు కొలుసుకో తక్కువ వుంటయి అంటుందట. అప్పుడు ఇద్దరి మధ్య కొట్లాట షురువు అయితది. అందుకే ఇవన్నీ చూసి కొందరు 'అత్తలేని కోడలు ఉత్తమురాలు' అంటరు. ఇగ లొల్లి గిల్లి ఏమి ఉండది అని అర్థం.
- అన్నవరం దేవేందర్, 9440763479