Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిల్లల కథలు ఇవి. పెద్దల ద్వారా పిల్లలకు అందాల్సిన కథలు. ఒక మంచి పుస్తకం చదివానన్న సంతప్తి కలిగింది. పది కథల సంపుటి 'ఎదురీత' రచయిత కె.శాంతారావు. నాటక రచన, దర్శకత్వంలోను, కవిత్వం, కథా రచనలోను నిష్ణాతులే కాదు, నిబద్ధత కలిగిన రచయిత వీరు. పిల్లల పట్ల రచయితకుండే కన్సర్న్ ప్రతీ కథలోను కనిపిస్తుంది. ఇది మాతహదయ స్పందన. పిల్లలకు బోధించాల్సినవి, పరోక్షంగా పిల్లల పట్ల పెద్దలు వ్యవహరించాల్సిన తీరు కూడా ఈ కథలు చెపుతాయి.
కథలో నీతిని తెలుసుకోవడం పాత పద్ధతి, అవగాహనతో మెసులుకోవడం ఆధునిక పధ్ధతి అని చెపుతూనే పిల్లలకు పాత కొత్తా అంటూ తేడా లేకుండా కథను వేమన పద్యాలతోనూ, వచన కవితలతోనూ జోడించి పిల్లల్లో అవగాహనతో పాటూ, భాషా నైపుణ్యాన్ని కూడా రచయిత కె.శాంతారావు కథలతో అందించారు.
కథలన్నీ కేవలం రెండు పేజీలు మించవు. గిజిగాని గూడుకథ ప్రకతిని ప్రేమించడంతో బాటూ, జీవుల పట్ల దయను నేర్పిస్తుంది.
మధుర స్నేహం కథ మనసును అమృతమయం చేస్తుంది. ఈ కథ నా బాల్యంలో నాకు ఎదురైన సంఘటనను గుర్తు చేసింది. పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్లకపటమెరుగనీ కరుణామయులే కదా అనిపిస్తుంది. ఇది పిల్లల మనస్తత్వానికి అద్దం పట్టిన కథ.
ఈ కథను
స్నేహమేరా జీవితానికి
వెలుగునిచ్చే వెన్నెలా
స్నేహమేరా బతుకు బాటలో
నీడనిచ్చే తోడురా.
కథాంశాన్ని నీతిగా చెప్పకుండా, పిల్లల అనుభవానికి దగ్గరగా తీసుకొస్తారు రచయిత. ఇంత అభద్రతాయుతమైన పరిస్థితుల్లో వున్న పిల్లలకు బాడ్ టచ్, ఏమిటో చెప్పడం, ఇంకా ధైర్యంగా బతకడం, మూఢత్వాన్ని ప్రశ్నించడం లాంటి సుగుణాలను, వెన్నముద్దలుగా నోటికి అందించిన విధానం పాఠకులకు సంతోషాన్నే కాదు, ఫలితాత్మకంగా కథలు పసిమనసుల మీద గాఢమైన నమ్మకాన్ని కలిగిస్తాయనే భరోసా కలుగుతుంది.
పట్టుపట్టరాదు, పట్టివిడువరాదనీ, అక్కరకు రాని చుట్టాలని, మోహరమున తానెక్కిన పారని గుర్రాన్ని గ్రక్కున ఎలా విడువాలో పిల్లలకు నేర్పిస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే ఎదురీతకు పిల్లలను సిద్ధం చేస్తాయి.
'రోల్ ప్లే' కథలో లాగా రచయిత కోట్ చేసినట్లు
నానా భావోప సంపన్నం
నానా వస్ధాంతరాత్మకం
లోకానువృత్తానుకరణం.
భరతమునిని స్మరిస్తూ
నాటకంలో కనిపించని, జ్ఞానంగాని, శిల్పంగాని విద్యగానీ ఎలాలేవో పిల్లలకు తెలియజెప్పేలా నాటక శిల్పంతో కథను చెప్పారు. పిల్లలు ఈ కథలను చిన్న స్కిట్లుగా విద్యాలయాల్లో ప్రదర్శిస్తే ఎంతో బాగుంటాయి. ఎదురీత పుస్తకం జీవితపు విలువలను, పిల్లలకు అందంగా అందించింది. చిన్న పుస్తకంలో సమస్త జీవిత నిర్మాణానికి కావలసిన పునాదులు వున్నాయి. శాంతారావుకు హృదయపూర్వక అభినందనలు...!!
- లలితా శేఖర్, 9394793921