Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాను వస్తోంది
ఈ ఫిబ్రవరి 26 కే తాను వస్తోంది
రెక్కలు విపుకున్న కలల్ని
గుండె గూట్లో పొదవుకున్న ఆవేదనల సానువులని
ప్రేమ సంగీత శృతులని
బాధ్యతామయ గతుల్ని
ఒక్క కూర్పుతో మనకు అందించేందుకు తానై వస్తోంది
నేను నిగ్రహి
నేను సంగ్రహి
నేను ఆగ్రహి! అంటూ జరామరణ మాయలెరుగని అక్షర లక్షతలు తీసుకుని వస్తోంది
ఓదార్పు నీలిమగా
మాధుర్య నీలిమగా
జోల పాట నీలిమగా
వేట పదును నీలిమగా
మెరుపు వర్ణ నీలిమగా
ఊరట పాదుల నీలిమగా
దారిదీప నీలిమగా
వినమ్ర వినుత నీలిమగా
నలుబది కవితల కదంబ హారముగా తాను వస్తోంది
ఎందుకిలా ఊరిస్తావని అడుగుతున్నారా!? ఎందుకింత ఉపోద్ఘాతాన్ని కురిపిస్తున్నావని ఆశ్చర్యపోతున్నారా!?
పిండాన్ని గర్భస్తం గానే విచ్ఛిన్నం చేసిన ఓ అతివ భావోద్వేగ దుఃఖంలో దేశాన్ని మునిగి చచ్చిపొమ్మనే ఆ నిర్భయ గుండెను ఇలానే కదా తలచుకోవాలి, బతకడానికి కూడా కాస్త మరణం కావాలనీ, ఎవరి అభిజాత్యాలు, అహంకారాలు, ఆధిపత్యాలు ఏ ఒక్కరి సొంతానికో కాకూడదంటూ, ప్రేమ నిప్పులా వ్యాపించాలనే పరివ్యాప్త ఆలోచనను ఇలాగే కదా స్వాగతించాలి.
''మాఖీ పిల్లా''
కాషాయ కర్కశత్వానికి
బలైపోతున్నజి
నీ కథ విన్నాక
నన్ను కాస్త కాస్త
నీలోకి ఒంపుకున్నాక
నా తనువంతా కన్నీటి
సముద్రమయ్యాకజి
అనే సహానుభూత సమాహారాన్ని ఇలా వేవేల వెలుగుల మధ్యకు రప్పించాలి, చీకటి మిగిల్చిన గాయాల్ని బహిర్గత పరచి అనుయాయపు రోజుల్లోకి పయనింపచేయాలి. అమరత్వ సిద్ధికి తనను తాను వికసింప చేసుకున్న పుష్ప విలాప సౌందర్యాన్ని ఇలానే కదా వీక్షించాలి.
అవును ఈ ఆగ్రహి అనేక భావోద్వేగాల, రసోద్వేగాల సమాహారిణి, నిత్య నూతన వేదనల ప్రవర, పాత బడని అతివల మనో వ్యధల జ్వలన
అందుకే
పుట్టుకతోనే ఓ ఆయుధం కావాలని
అది అచ్చోసిన ఆంబోతు నైజాలను హతమార్చాలని మనసా వాచా కర్మణా కవనమై కన్నీరొలికిస్తింది , దుఃఖానికే దుఃఖం ముంచుకొచ్చేలా చేసిన కనిపించని శత్రువుని కడతేర్చేదెలా? అంటూ గుబులు వాకిట వాడిన పువ్వై విలపిస్తుంది.
వై మీ టూ అంటూ నూరొక్క నారీ లోకం కోసం గొంతు పగిలే పొలికేక పెడుతుంది.
ఏ స్త్రీ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
స్త్రీ జాతి చరిత్ర సమస్తం
పురుష పీడన పరాయణత్వం
అంటూ మూడంకెలు వేసుకు కూర్చున్న మూఢత్వ ముసుగును తెరచి చూపిస్తుంది.
యుద్ధపు రంకెలను ఎంత ఒడుపుగా తిప్పికొట్టిందో అంతే లాలనతో నువ్వూ నేనుల బంధాన్ని పరిమళింపచేయడం ఈ కవయిత్రి కలానికున్న బలం. బ్రాహణత్వ మేలి ముసుగు వేసుకుని విర్ర వీగుతున్న మనువాద మనుషులు అనే నానుడిలో నలిగి, బండ బారిన గుండెతో , కన్నీరుని కారడం కూడా నేరమని నసిగే సమసమాజం మీద విరక్తితో ఉన్న ఓ సదరు మహిళ, సగటు అబల వినిపించిన ఈ రాగాలాపనల నిండా ఎన్ని జగాల చరిత్రలు పునరావృతం అవుతున్నాయో, అన్నిటికి అన్నీ ఆలోచనల లావాలు వెదజల్లుతున్నాయి. ఆమెకు అందరూ ఒకటే అని, ఆమెలందరూ ఒకటే నని ఎప్పటికీ గుర్తుంచుకునే కొన్ని శబ్దాలు ఈ కవితల నిండా ప్రవహిస్తున్నాయి.
అమ్మ, ప్రేమ
నాన్న, నమ్మకం
అతడు, ఆమె
అబ్బాయిని బెగొచ్చేయమనే ఆమె బెంగ
వర్షాన్ని, వర్ష వర్ణాలను కలబోసిన మెరుపు
అన్నీ ఈ ఆగ్రహి తొలి సంతకంలో మిలమిలా మెరిసే అక్షర రవ్వలై చక్కగా కుదురుకున్నాయి, అర్ధ నిమీల హృదయాలపై మెత్తగా వాలుతున్నాయి.
అన్నీ నేనే చెప్పేస్తే మీరెలా ఆస్వాదిస్తారో నాకు ఎలా తెలిసేది...
అందుకే కళ్ళల్లో ఆనందపు వత్తులు వేసుకుని ఈ 26 న ఎదురెళ్ళంది , అవ్యాజ్య ప్రేమ ఆలింగనాల నడుమ ఈ నీలిమను గుండెలకు హత్తుకోండి...
- సుధా మురళి