Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
- అనారోగ్య లక్షణాలుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి : వైద్యారోగ్యశాఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వేడిగాలుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ సూచించింది. ఒకవేళ అనారోగ్యానికి గురైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ''దాహం వేయకున్నా సరే...నీటిని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలనీ, నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను, ఇంట్లో చేసుకున్న పండ్ల రసాలను తీసుకోవాలి. కాటన్ దుస్తులను ధరించాలి. తలను మూసుకునేలా గొడుగు తదితర వాటితో కప్పుకోవాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలనీ, ఉదయం, సాయంత్రం వేళల్లో బయటి పనులను పెట్టుకోవాలి. వాతావరణశాఖ ఎప్పటికప్పుడు చేసే హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటూ ఉండాలి... '' అని తెలిపారు. ''మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల మధ్య బయటికి పోకుండా ఉండాలి. వేడి బాగా ఉన్న సమయంలో వంట చేయొద్దు. షుగర్ ఎక్కువగా ఉన్న పానీయాలు తీసుకోకూడదు. వీటితో శరీరంలో నీటి శాతం తగ్గి తిప్పుతుంటుంది. హై ప్రొటీన్, తాజా ఆహారాన్నే తీసుకోవాలి'' అని చెప్పారు. అనారోగ్యానికి గురైతే వెంటనే చికిత్స అందించేందుకు ప్రత్యేక బెడ్ల ఏర్పాటుతో పాటు ఐవీ ఫ్లూయిడ్స్ ప్రభుత్వాస్పత్రుల్లో, ఒఆర్‌ఎస్ పాకెట్లను ఏఎన్‌ఎం, ఆశా, అంగన్ వాడీ వర్కర్ల వద్ద అందుబాటులో ఉంచినట్టు శ్రీనివాసరావు తెలిపారు.