Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవకతవకలు సరిచేయండి :సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలను సరిచేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు మంగళవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో ఏడు వేల కేంద్రాలు తెరిచి కోటి టన్నుల యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. వరికోతలు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకూ లక్ష్యంలో 10 శాతం కూడా సేకరించలేదని వివరించారు. మార్కెట్‌కు వచ్చిన ధాన్యం అకాల వర్షాలకు తడవటమే కాక నీటిలో కొట్టుకుపోయి రైతులకు భారీ నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు కొనుగోళ్లలో ఐకేపీ, సొసైటీ, మార్కెట్ కమిటీ, మిల్లర్లు మిలాఖతై తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను మోసగిస్తున్నారని విమర్శించారు. మార్కెట్లలో ధాన్యం నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ మార్కెట్ నుంచి మిల్లుకు వెళ్లిన తర్వాత మిల్లర్లు ఐకేపీ ఏజెంట్లను పిలిచి, ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉన్నదని క్వింటాలుకు నాలుగు కిలోల వరకు తగ్గించి ఇస్తున్నారని పేర్కొన్నారు. రైతుకు చెల్లించాల్సిన డబ్బులో 10 శాతం కోత పెడుతున్నారని వివరించారు. అంతేకాకుండా తాలు, మట్టి ఉన్నాయనే పేరుతో కూడా మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. రెండేండ్లుగా ఇలాంటి పద్ధతినే అనుసరించి ఏటా రూ.500 కోట్లు రైతులకు నష్టం కలిగించారని తెలిపారు. తిరిగి ఈ యాసంగిలో కూడా ఇదే తరహాలో మోసానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని 'ఉప్పుడు బియ్యం'గా మార్చాలని సూచించారు. అందువల్ల తేమ ఒక యూనిట్ ఎక్కువ, తక్కువ ఉన్నా
ప్రమాదం లేదని తెలిపారు. పైగా వాతావరణంలో 46 డిగ్రీల వేడి కొనసాగుతున్నదని వివరించారు. ఈ ఎండలో ధాన్యం ఒక గంట ఉన్నట్టయితే నిర్ణీత తేమ శాతం కన్నా తక్కువకు పడిపోతుందని పేర్కొన్నారు. అందువల్ల మిల్లర్లు విధిగా తేమ కలుపుతారని తెలిపారు. తద్వారా ఉప్పుడు బియ్యం క్వింటాలుకు 68 కిలోల దిగుబడి వస్తుందని వివరించారు. ఇది మిల్లర్లకు అదనపు లాభం అయినప్పటికీ రైతుల చెల్లింపుల్లో కోత విధించడంపై మార్కెట్లలో పెద్దఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అయినా మోసాలకు పాల్పడిన వారిపై చర్యల్లేవని పేర్కొన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి విజిలెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మార్కెట్లో క్వాలిటీ ఇన్స్పెక్టర్ను నియమించి ధాన్యం నాణ్యతా ప్రమాణాలను గుర్తించాలని కోరారు. రైతులకు జరుగుతున్న నష్టాలను అరికట్టేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.