Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.18 వేలు ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలి
- ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు ఆశా యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆశావర్కర్లుగా సర్టిఫికెట్ పొందేందుకు ఉద్దేశించిన పరీక్షను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) డిమాండ్ చేసింది. ఇది వరకే ప్రభుత్వ శిక్షణ పొంది రిజిస్టర్స్ రాయడం, సర్వేలు చేయడం, ఆన్‌లైన్ పని చేయడం, బీపీ, షుగర్, థైరాయిడ్ జబ్బులను గుర్తిస్తూ మందులను సరఫరా చేస్తున్న ఆశావర్కర్లకు మళ్లీ పరీక్ష నిర్వహించాలనుకోవడం సరికాదని హితవు పలికింది. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు రెగ్యులర్‌గా సేవలందిండంతో పాటు కరోనా నియంత్రణలో కీలక పాత్ర పోషించి, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ గ్లోబల్ లీడర్స్‌గా ప్రకటించిన ఆశాలకు పరీక్ష పెట్టడం సహేతుకంగా లేదని తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతికి ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.జయలక్ష్మి, ఆర్ నీలాదేవి, రాష్ట్ర కోశాధికారి పి.గంగమణి వినతిపత్రం సమర్పించారు.
అనేక పనులతో ఆశాలతో చేయిస్తూ పని భారం పెంచుతున్న ప్రభుత్వం పోరితోషికాలను రూ.9.750కే పరిమితి చేసిందని తెలిపారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు ఈ పారితోషికం సరిపోక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. వారికి పోరితోషికాన్ని రూ.18 వేలకు పెంచి ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చినట్టు ప్రతి నెల ఒకటి, రెండో తేదీల్లో చెల్లించాలనీ, పారితోషికం లేని పనులు చేయించకూడదనీ కోరారు.
క్షయ, కుష్టు, కంటి వెలుగు తదితర పెండింగ్ బిల్లులు చెల్లించాలనీ, జాబ్ చార్ట్‌ను విడుదల చేయాలనీ, 2021 జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పీఆర్సీ ఎరియర్స్ వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు రూ.వెయ్యి చొప్పున 16 నెలల బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలనీ, 32 రకాల రిజిస్టర్స్‌ను వెంటనే ప్రింట్ చేసి ప్రభుత్వమే సరఫరా చేయాలనీ, నాణ్యతో కూడిన ఐదు సంవత్సరాల పెండింగ్ యూనిఫామ్స్ ఇవ్వాలనీ, జిల్లా ఆస్పత్రుల్లో రెస్ట్ రూం ఏర్పాటు చేయాలనీ, ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలనీ, ప్రసూతి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.