Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల డిమాండ్
- ఈనె 18న దేశ వ్యాపితంగా పోరాట దినాన్ని జయప్రదం చేయాలని పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, సహాయ కార్యదర్శి మూడ్‌శోభన్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ.రమ, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన తెలుపుతున్నారని, కేంద్ర ప్రభుత్వం కూడా భూషణ్‌పై చర్యలు తీసుకోకపోవడంతో మూడు మాసాల తరువాత ఆందోళన చేస్తున్నారని గుర్తుచేశారు. అంతర్జాతీయంగా పతకాలు సాధించి దేశానికి గౌరవాన్ని, ప్రతిష్టను తెచ్చిపెడుతున్న ఒలింపిక్ పతక విజేతలతో సహా మన అగ్రశ్రేణి క్రీడాకారులు కూడా న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లయోధుల ఆరోపణలపై విచారణ జరిపిన పర్యవేక్షక కమిటీ ఫలితాలను బహిర్గతం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌తో పాటు డబ్ల్యుఎఫ్‌ఐలో పనిచేస్తున్న మరికొందరు కోచ్‌లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ప్రముఖ మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం ఒకవైపు 'బేటీ బచావో బేటీ పడావో' అంటూ సంబరాలు చేసుకుంటూనే, మరోవైపు ఈ దారుణమైన నేరంలో నిందితుడైన బీజేపీ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. దోషులను శిక్షించే వరకు తాము వెనక్కి తగ్గబోమని అగ్రశ్రేణి రెజ్లర్లు అంటున్నారని, నిందితులపై పోక్సో చట్టంతో పాటు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వేధింపులు ఆరోపణలపై న్యాయమైన విచారణ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్ అథ్లెట్లు వారి కలలను సాకారం చేసుకోవడానికి ఇలాంటి ఘటనలు కారణం కాకూడదని నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో ప్రజలందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.