Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐ.ఎల్.ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 48కోట్ల (476.6 మిలియన్లు) మంది ఆదివాసీలు ఉన్నారు. వీరంతా 5000 సమూహాలుగా 6700 భాషలు మాట్లాడుతూ 100 దేశాల్లో నివాసం ఉంటూ, ప్రస్తుత ఆధునీకరణ నేపధ్యంలో వారి సంస్కృతి సాంప్రదాయాల విశిష్టతను కోల్పోతూ, చివరికి వారి అస్థిత్వం కోసం, ప్రమాదం అంచున నిలబడి పోరాడుతున్నారు. మన భారతదేశ జనాభాలో 9-10శాతం గిరిజనులు. అనగా సుమారు 10కోట్ల మంది నాలుగు జోన్స్ పరిధిలో హిమాలయలో 11శాతం, మధ్య భారత్లో 57శాతం, పశ్చిమ భారత్లో 25శాతం, దక్షిణ భారతదేశంలో 7శాతంగా విస్తరించి ఉన్నారని వీరిలో ఎక్కువగా ''గోండు'' జాతి గిరిజనులు 12 మిలియన్ల మంది అని నివేదికలు చెబుతున్నాయి. చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో 10-12శాతం గిరిజనులు. వీరిలో ఎక్కువగా లంబాడీలు, రాజ్ గోండులు, చెంచులు. ఇక ఆంధ్రప్రదేశ్లో సుమారు 6శాతంగా ఉన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ ఆదివాసీలు మనదేశంలో, ఆఫ్రికాలో ఉన్నారు. ఏ దేశానికైనా మూలవాసులు ఆదివాసీలు.. గిరిజనులే...
చేగువేరా చెప్పినట్లు ''తెలివిలేక మనం వెనుకబడలేదు... తిరుగుబాటులేక మనం వెనుకబడ్డాం'' అని ఇకనైనా ఆదివాసీలు గుర్తెరగాలి. ఆదివాసీల హక్కుల కోసం, ''జల్, జంగిల్, జమీన్'' కోసం కొమరం భీం, బిర్సాముండా, సోయంగంగులు, సమ్మక్క సారక్క స్ఫూర్తితో ఉద్యమించాలి. వీరికి ఐక్యరాజ్యసమితి నుండి క్రింది గ్రామ పంచాయతీ వరుకూ అనేక హక్కుల ఇచ్చినా, ప్రభుత్వ విధానాలు, పెట్టబడీదారులు, దోపిడీదారుల వలన అన్యాయాలకు గురై అభివృద్ధికి ఆమడదూరంలో ఉండుట శోచినీయం. ఐక్యరాజ్యసమితి 1982లో 140 దేశాల నుంచి 29మంది మేధావులతో కమిటీ ఏర్పాటు చేసి, ఆదివాసీల హక్కుల రక్షణకు రిపోర్ట్ సమర్పించాలని కోరింది. వీరి సూచనలు మేరకు భూములపై యాజమాన్యం హక్కులు గిరిజనులకు కల్పిస్తూ రక్షణ చట్టాలను చేయాలని ఐక్యరాజ్యసమితి కోరుతోంది. అయితే ''హామీలు ఆకాశానికీ... అమలు అదః పాతాళానికీ'' అన్నట్లుగా ఉంది మన ప్రభుత్వాల తీరు. సాక్షాత్తూ భారత రాజ్యాంగం షెడ్యూల్ 5, 6, పదవ భాగం ఆర్టికల్ 244(1) ద్వారా వీరికి హక్కులు, భధ్రత ఏర్పాటు చేసింది. అలాగే 1/70 చట్టం, పీసా చట్టం, జీఓ3 (ప్రస్తుతం అన్యాయంగా రద్దు చేయబడింది) ఉన్నాయి. అయినప్పటికీ వారి హక్కులకు రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా భూములను ఆక్రమించి, వ్యాపారాలు చేస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. విశాఖ బాక్సెట్, ఓబుళాపురం, ఒరిస్సాలో దామన్ జోడ్, అనేక రాష్ట్రాల్లో అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతుంది. ప్రాజెక్టుల పేరుతో నిరాశ్రయులవుతున్నారు. ప్రస్తుతం పోలవరం గిరిజనుల పాట్లు మన కండ్లముందు కనపడుతున్నవి.
రెడ్ ఇండియన్స్ అనే ఆదివాసీలను అంతం చేసి, అమెరికా అగ్రరాజ్యంగా ఎలా ఎదిగిందో... అదే తరహాలో నేటి ప్రజాస్వామ్య యుగంలో పెట్టుబడిదారులు ప్రకృతి వనరులను దోచి, అమాయక గిరిజనులను మోసగించి ఆకాశహర్మ్యాలు నిర్మించుకుంటూ, అభివద్ధి అనే పేరుతో ఆదివాసీల ఆనవాళ్లు లేని స్థితికి దారులు తీయడం అత్యంత బాధాకరమైన విషయం. ఆదిలాబాద్లో 1980వరకూ 90శాతం ఉన్న గిరిజనులు, ప్రస్తుతం మైనార్టీలుగా మారిపోయారు అంటే ఎంతగా ఇతరులు వచ్చి చేరినారో ఇట్టే అర్థమవుతుంది. అలా వివిధ ప్రాంతాల్లో ''అణగారిన అల్ప సంఖ్యాకులుగా ఆదివాసీలు'' మారిపోతున్నారు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాల పూర్తి అవుతున్నా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, రవాణా, విద్య, వైద్యం, తాగునీరు సాగునీరు విద్యుత్, బ్యాంకింగ్, కమ్యునికేషన్ నేటికి అందని ద్రాక్షగా ఉన్నాయి అంటే ప్రభుత్వాలు ఏవిధంగా బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నాయో అర్థం చేసుకోవాలి. నేటికీ గర్భిణి స్త్రీలను డోలీలో, ఎండ్ల బండిలో, ఎత్తుకుని ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు తరచూ చూస్తేనే ఉన్నాం. మార్గ మధ్యంలో ప్రసవాలు జరుగుతున్న సంఘటనలు కోకొల్లలు. దీనికి తోడు మలేరియా, డెంగ్యూ, అనేక సీజనల్ వ్యాధుల బారినపడి మరణించే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో కనీసం ఐసోలేషన్ కేంద్రాలు వీరికి కూడా అందుబాటులో లేవు. ఉన్నా అరకొర వసతులతో నిర్వహణ సాగుతోంది.
శ్రీశైలం, అహౌబిలం వంటి దేవాలయాలకు పూజారులుగా, అవినిభావ సంబంధం కలిగిన ''చెంచుల'' ఉనికే నేడు ప్రమాదం అంచున చేరింది. ప్రభుత్వాలు మేల్కొవాలి. ఐక్యరాజ్యసమితి చేసిన ఆరు తీర్మానాల మేరకు ఆదివాసీలకు స్వయం పాలన హక్కు, స్వేచ్ఛ, మానవ హక్కుల రక్షణ, సాంప్రదాయాల జీవన విధానం, భాషా వేషధారణల రక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలి. 2006 అటవీ హక్కుల చట్టం సక్రమంగా అమలు చేయాలి. సబ్ ప్లాన్ నిధుల మంజూరుకు, సక్రమంగా ఖర్చు చేయాలి. అక్కడ గనులు నుండి లభించే ఆదాయం వారికే ఇవ్వాలి. ఉద్యోగాలు ఇవ్వాలి. అక్రమ అడవులు నరికివేతకు కృషి అరికట్టాలి. వీరి సర్వతో ముఖాభివృద్ధికి విద్య, వైద్యం అందుబాటులో ఉంచాలి. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పాలనా యంత్రాంగం అప్రమత్తంగా, పారదర్శకంగా పనిచేయాలి. ఆ విధంగా ప్రభుత్వాలు, ప్రజలు సహకరించాలి. అప్పుడు మాత్రమే ఆదివాసీల భవిష్యత్ జీవితం ఆనందమయం అవుతుంది. ఆ విధంగా తీర్చిదిద్దటమే ప్రపంచ ప్రభుత్వాల విధి.
- ఐ ప్రసాదరావు
సెల్ 9948272919