Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ దేశాలన్నీ అంతర్జాల వలలో బంధించబడ్డాయి. స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచమే కుగ్రామమైంది. దేశ యువత విదేశీ చదువులు, విదేశీ ఉద్యోగాలకు క్యూ కడుతున్నారు. శాస్త్ర సాంకేతికత వేగంగా వ్యాపిస్తున్నది. విశాల భావనలు పెరిగి పోతూ, కులమతాల ప్రస్తావనలు క్రమేపీ సమసి పోతున్నాయని అనుకుంటున్న సందర్భంలో... నేడు దేశం సగర్వంగా చాటుకునే 'భిన్నత్వంలో ఏకత్వం' నినాదం నివ్వెరపోయి చూస్తున్నది. ఇలాంటి డిజిటల్ యుగపు ప్రపంచంలో కులాలు, మతాలంటూ వివాద వేరుకుంపట్లు రాజుకోవడం గర్హనీయం. ఈ వివాదంలో గెలుపు ఎవ్వరిదైనా, జాతీయ సమైక్యత ఓడరాదు. పరమత సహనం పాటించడం భారత మౌలిక సూత్రం. యూనిఫారం ధరించడం ప్రధానం కాదని, విద్యాభ్యాసమే అత్యున్నతమైనదని గుర్తుంచుకోవాలి.
నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయాన జనవరి 1, 2022న కర్నాటక రాష్ట్ర ఉడిపి ప్రాంతంలోని ఓ కళాశాల ప్రాంగణంలో యువత వస్త్ర ధారణ వివాదం రాజుకుంది. నెల రోజులుగా మతాల మధ్య మంటలు రేగుతున్నాయి. రోజురోజుకు అత్యంత పైశాచికంగా మతపరమైన జ్వాలలు రేపుతున్నారు. గత నెలలో కర్నాటకకు చెందిన ఉడిపి ప్రభుత్వ కళాశాలతో పాటు పలు విద్యాసంస్థల్లో ముస్లిమ్ యువతులు 'హిజాబ్' అనబడే బుర్కాలాంటి వస్త్రధారణతో తరగతులకు హాజరు కావడాన్ని హిందూ విద్యార్థులు వ్యతిరేకించడం, దానికి ప్రతిచర్యగా హిందూ యువత కాషాయ కండువాలు కప్పుకొని తరగతులకు హాజరుకావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. ఇలాంటి పరమత అసహన ఘటన ముదిరి హింసాత్మకంగా మారకుండా కాలేజీలు తాత్కాలికంగా సెలవులు ప్రకటించాయి. కొన్ని కళాశాలల్లో ఇరు మతవర్గాల యువతకు వేరు వేరు తరగతి గదులు కేటాయించడం కూడా వివాదాస్పదం అయ్యింది. కొన్ని కళాశాలల్లో హిజాబ్ ధరించిన యువతులను ఇంటికి పంపడం కూడా ఆ వర్గాల తల్లితండ్రుల, ఆ మతస్థుల ఆందోళనలకు కారణం అయ్యింది. హిజాబ్ ధరించిన యువతులకు పాఠాలు బోధించకుండా ప్రత్యేక తరగతి గదిలో కూర్చోబెట్టడం లేదా కాలేజి నుంచి ఇంటికి పంపడంతో రెండు వర్గాల మధ్య చిచ్చురేగింది. ఉడిపి జిల్లాలో ప్రారంభమైన ఈ వివాదం నెమ్మదిగా బెలగావి, శివమొగ్గ, కొప్పెన ప్రాంత కళాశాలకు కూడా వేగంగా వ్యాపించడం భయాందోళనలు రేపుతున్నది.
ఉడిపి, చిక్మగళూరులోని రైట్ వింగ్ గ్రూపులు ముస్లిమ్ బాలికల హిజాబ్ ఆచారాన్ని వ్యతిరేకించడంతో కళాశాల యువత మధ్య గొడవ మొదలైంది. ఆర్థిక సామాజిక సమభావన, స్నేహపూర్వక వాతావరణం, పరమత సహనం లాంటి ప్రయోజనాలు ఉన్నందున విధిగా యూనిఫారం ధరించాలని హిజాబ్ ధరించకుండా ముస్లిమ్ యువతులు కాలేజీకి హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో వివాదం మరింత పెద్దదయింది. ఈ అతి సున్నితమైన మతపరమైన అంశం విద్యార్థినులు హైకోర్టు గడపలో కాలుమోపడంతో తీర్పుకోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హిజాబ్ ధరించిన విద్యార్థినులకు వ్యతిరేకంగా హిందూ విద్యార్థులు కాషాయ కండువాలలో ప్రదర్శనలు నిర్వహిస్తుండటంతో కర్నాటకలో కళాశాల ప్రాంగణాల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ సున్నిత అంశం అదుపు తప్పితే తీవ్ర శాంతి భద్రతల సమస్యగా రూపాంతరం చెందవచ్చు. ఫిబ్రవరి 8న ఉడిపి కళాశాల హిజాబ్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం రాజ్యాంగంలోని ఆర్టికిల్ 25ను ఉల్లంఘించడమే. అందుకే ముస్లిమ్ విద్యార్థినులు హైకోర్టులో పిటీషన్ దాఖల చేశారు. హిజాబ్ అనబడే మతాచారాన్ని వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నారు.
1954 ఫిరూర్ మఠం కేసు తీర్పు ప్రకారం కొన్ని మతపరమైన ఆచారాలను ప్రత్యేక సమయాల్లో ప్రభుత్వాలు నిషేధించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వివాదంపై కర్నాటక ప్రభుత్వం సమానత్వం, సమగ్రత, ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నందున హిజాబ్ ధరించడాన్ని నిషేధించామని తెలుపుతున్నది. సమానత్వం, సమైక్యత, ప్రజాశాంతి భద్రతల సాధనకు ఒకే యూనిఫారమ్ తప్పనిసరిగా ఉండాలంటూ ప్రభుత్వం వాదిస్తున్నది. ఈ వివాదం ముదిరి కర్నాటక సరిహద్దులు దాటి పలు రాష్ట్రాలకు దావానలంలా వ్యాపించకుండా పరమత సహన బోధనలను, మానవీయ అవగాహనలను అన్ని వర్గాల యువతకు అందించి జాతీయతా భావాన్ని పెంపొందించాలి. హిందువులకు బొట్టు, మంగళ సూత్రం, సిక్కులకు తలపాగా, క్రైస్తవులకు శిలువ, ముస్లిమ్‌లకు హిజాబ్/బుర్కా లాంటి మతాచారాలను బాధ్యతగల భారత పౌర సమాజం కోరుతున్నది. డ్రెస్ కోడ్ వివాదంతో యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. మత రాజకీయాలకు బలికావొద్దు. పరస్పర గౌరవంతో ప్రేమలను, స్నేహాలను పెంచుకుంటూ, పంచుకుంటూ ఉన్నత స్థానాలను చేరి దేశాభివృద్ధికి బాటలు వేయాలి. మత వివాదాల కన్నా దేశ మహౌన్నత గౌరవం మిన్న, మతాల కన్న అద్వితీయ మానవత్వమే మిన్న, కులాల కన్న సద్భావనలు మిన్న అని నమ్ముదాం. పరిస్థితులు అదుపు తప్పక ముందే కర్నాటక హైకోర్టు తీర్పుతో లేదా సుప్రీంకోర్టు చొరవతో ఈ వివాదం సమసిపోవాలని, అందరం ఒక్కటే అని జాతీయ ఐక్యతను చాటాలని ఆశిద్దాం.
- డాక్టర్ బుర్ర మధుసూదనరెడ్డి
సెల్: 949700037