Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్ల డబ్బు, ఎవరి దగ్గిర ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఈ డబ్బున్న వారు, ప్రభుత్వానికి పన్నులు కట్టవలిసి వుంటుందా? కడుతూ వుంటారా? 'నల్ల డబ్బు' అనే మాట, ఇక్కడ ఎందుకు చూడాలి? ఈ డబ్బు అంతా, నల్ల డబ్బేనా? ఈ విషయాలన్నీ తెలిస్తే, 'నల్ల డబ్బు' రహస్యం కూడా తెలుస్తుంది.
అమ్మకాలు జరగవలిసిన రక రకాల సరుకుల్ని, శ్రమలు చేసే కార్మిక వర్గం తయారు చేస్తుందనీ, ఆ వర్గంతో యజమాని వర్గం ఆ శ్రమలు చేయిస్తుందనీ, తెలిసిందే. చెప్పుకున్నాం.
కార్మికులకు, యజమానుల నించి వచ్చే 'జీతాల డబ్బు' తెల్ల డబ్బు అయితే, జీతాల్ని ఇవ్వగా మిగిలే డబ్బు కూడా తెల్ల డబ్బే అవుతుందా, అవదా? అందుకే దీన్ని చూడాలి.
ఒక సరుకు ఉదాహరణని, ఇంతకు ముందే చూశాం. 'చొక్కా' అనే ఒక సరుకు తయారీ కోసం 'ఉత్పత్తి సాధనాల' పాత శ్రమని 80 గానూ, ఆ సాధనాల మీద జరిగిన కొత్త శ్రమని 40 గానూ, చొక్కా కోసం అవసరమైన మొత్తం 'శ్రమల విలువ'ని 80 + 40 = 120 గానూ, చూశాం. ఈ 120 విలువలో, సాధనాల ఖర్చే 'పెట్టుబడి'. ఇది, ఇంకో సరుకు తయారీ కోసం, ఎప్పుడూ వెనక్కి ఉండవలిసిందే. దీన్ని, పెట్టుబడిదారుడు తినడం కుదరదు.
చొక్కా కోసం కొత్త శ్రమ చేసిన కార్మికుడు, దాని సాధనాల్ని తనే చేసినట్టు కాదు. ఈ కార్మికుడు చేసిన శ్రమ, చొక్కాని కుట్టి తయారు చెయ్యడం. ఇతని శ్రమ విలువ 40. దీన్ని కూడా ఇంతకు ముందే చూశాం.
చొక్కా ధరగా, దాన్ని అమ్మగా 120 డబ్బు వస్తే, అందులో, 'కొత్త శ్రమ విలువ' 40. ఇందులో నించి కొత్త శ్రమ చేసిన కార్మికుడికి జీతంగా అందినది 10 అని చెప్పుకున్నాం. మిగిలిన 30, ఏమవుతుంది?
ఇంకేమవుతుంది? అది యజమానికే అందుతుంది! ఒకే ఒక్క సరుకు వల్ల, యజమానికి వచ్చే డబ్బు ఇది! ఈ 30 లోనించి, 80 పెట్టుబడికి, ఆ 'టైము'ని బట్టి, కొంత శాతం లెక్కన, 'వడ్డీ' రావాలి. ఈ వడ్డీని 2 అనుకుంటే, మిగిలిన డబ్బు 28. దీని పేరు, యజమాని ప్రకారం, 'లాభం!'. అయితే, వడ్డీ ఎవరికి వెళ్తుంది? 80 పెట్టుబడి, అప్పు తెచ్చినది కాకపోతే, ఆ వడ్డీ కూడా సరుకుని చేయించిన యజమానిదే అవుతుంది. లేదా, అప్పే వుంటే, ఆ వడ్డీ, ఇంకో యజమానికి (వడ్డీ వ్యాపారికి) వెళ్తుంది.
అసలు, వడ్డీ లాభాల్ని పంచుకోడానికి వీలైన 30 డబ్బు, ఎలా వచ్చింది? ఆ 30ని పంచుకున్న యజమానులు చేసిన శ్రమల ద్వారా అది వారికి వచ్చిందా? చొక్కా సరుకు తయారవడానికి, వడ్డీ లాభాలతో సంబంధమే ఉండదు. వడ్డీ, లాభాలనేవి, పాత శ్రమ తోటో, కొత్త శ్రమ తోటో చేసినవి కావు. మరి, అవి, 30 డబ్బుని ఎలా పంచుకో గలుగుతాయి? సమాజంలో వెనకటి కాలం నించీ జరుగుతోన్న ఘోరమైన మోసాలు అవే! జీతాల శ్రామికుల శ్రమ వల్ల వచ్చిన విలువ లోనించే, యజమానులు చాలా భాగాన్ని ఆక్రమించ గలుగుతూ వున్నారు.
పెట్టుబడుల్ని (సాధనాల్ని) అప్పుల ద్వారా తెచ్చి, పని స్తలంలో పెట్టించడమే సరుకుల పెట్టుబడిదారుడు చేసేది. చివరికి తీసుకునేది, వడ్డీ లాభాల్ని! ఈ వడ్డీ, లాభాల పద్ధతులు లేకుండానే, పాతా - కొత్తా శ్రమలతో, ఏ వస్తువులు అయినా, తయారవుతాయి!
చొక్కా ఉదాహరణలో, ఒక్క సరుకు నించి, వచ్చే వడ్డీ లాభాలతో, కొంత 'భూమి కౌలు' కూడా కలిసి వుంటుంది. ఏ భూమికి? సరుకుల పని స్తలంగా వున్న భూమికి.
సరుకుల యజమాని, ప్రభుత్వానికి పన్నులు సరైన లెక్కల ప్రకారం కడితే, మిగిలేది తగ్గి, వడ్డీ, లాభాలు, తగ్గుతాయి. పన్నుల్లో కొంత భాగాన్ని అయినా ఎగ్గొడితే, వడ్డీ, లాభాలు పెరుగుతాయి.
అయితే, పన్నుల్లో కొంత బాగాన్ని ఎగ్గొట్టే మార్గం ఏమిటి? - సరుకుల అమ్మకం వల్ల వచ్చే డబ్బుని ఎలాగో తగ్గించి చూపించడమే! అంటే, సరుకుల్ని తక్కువ ధరలతో అమ్మినట్టు, ధరల్ని తగ్గించి చూపించడం. ఈ జిత్తుల లెక్కలన్నిటినీ, యజమానులు ఆడిటర్స్ ద్వారా చేయిస్తారు. ఈ ఆడిటర్లు స్వతంత్ర శ్రామికులుగా అయినా వుంటారు. లేదా అనేక మంది ఆడిటర్లని ఉద్యోగులుగా పెట్టుకుని, కంపెనీలు నడిపేవారిగా అయినా వుంటారు.
పెట్టుబడిదారుడి పని స్తలంలో శ్రమలు చేసే వాళ్ళు ఒక్క కార్మికుడే కాదు. 100 మంది కార్మికులు వుంటారనుకుంటే, వారిలో ఒక్కొక్కరి ద్వారా, ఒక్క రోజులో, 30 డబ్బుని యజమాని అందుకోవడం జరిగితే? మొత్తం దుస్తుల్ని కుట్టే 100 మంది కుట్టు కార్మికుల ద్వారా యజమాని అందుకో గలిగేది, 100 × 30 = 3,000 (3వేలు). ఒక్క రోజులో 3 వేలు అయితే, నెల మొత్తంలో, లెక్క కట్టండి! పదుల వేలు! ఇదంతా చొక్కా వంటి దుస్తుల సరుకుల యజమానికి ఆదాయం!
ఈ ఆదాయం మీదే ప్రభుత్వానికి పన్నులు కట్టాలి.
మొదట, సాధనాల్ని కొనడానికి పెట్టుబడిని ఎక్కువ ధరలతో ఖర్చు పెట్టినట్టూ; తర్వాత, తను తయారు చేయించిన సరుకుని తక్కువ ధరలతో అమ్మినట్టూ, ఈ కిలాడీ తనాలన్నీ, ఈ రెండు రకాలు గానూ వుంటాయి. అంటే, తక్కువ ఆదాయాన్ని చూపించే విధంగా!
ఒక పెట్టుబడిదారుడు, తను సాధనాల్ని కొనడాల్లోనూ, తన సరుకుల్ని అమ్మడాల్లోనూ తప్పుడు లెక్కలు చూపిస్తూ వుంటే, ప్రభుత్వం నమ్ముతుందా? ఎలా నమ్ముతుంది? నమ్మక పోతే, అనేక తణిఖీలు చేయించాలి. అవి చేయించి కూడా అన్నీ నమ్ముతుంది.
ప్రభుత్వం ఎవరిది? పెట్టుబడిదారులదే. పిల్లలు అల్లరి చేస్తోంటే, పెద్ద వాళ్ళు ముచ్చట పడతారు కదా? పిల్లల్ని మందలించినా, అదీ ముచ్చటే.
అదీగాక, దేశంలో పెట్టుబడిదారులు 100 మంది వుంటే, వాళ్ళ మధ్య అనేక పోటీలుంటాయి, వాళ్ళ సరుకుల అమ్మకాల కోసం! ఆ పోటీలు, కోర్టుల దాకా, ఒక్కోసారి హత్యల దాకా కూడా పోతూ వుంటాయి కదా? దేశంలో వున్న 100 మంది పెట్టుబడిదారులూ, ఒకే ఐకమత్యంతో వుండరు. వేరు వేరు గ్రూపులు గానే ఏర్పడి, ప్రభుత్వాన్ని నడిపే అధికారాన్ని తమ గ్రూపు చేతుల్లోకే తీసుకోవాలని ప్రయత్నాలెన్నో! అలా తీసుకోగలిగిన పెట్టుబడిదారుల గ్రూపే ప్రభుత్వాన్ని నడిపే అధికారం లోకి రాగలుతుంది. ఈ గ్రూపు మీద, ఇతర గ్రూపులకు కక్షలు!
పెట్టుబడిదారులు, ప్రభుత్వ బ్యాంకుల నించి కోట్ల కోట్ల డబ్బుని అప్పులుగా తీసుకుని, ఆ అప్పుల మీద, వడ్డీలూ కట్టరు, అసలుని వెనక్కీ చెల్లించరు! బ్యాంకులు, అవి ఇచ్చిన అప్పులు వెనక్కి రాక, దివాళాలు తీస్తూ వుంటాయి. అయినా ఆ ఎగవేతదార్లకి, ఏ భయాలూ వుండవు. ఎందుకు? వాళ్ళ గ్రూపే, లేదా వాళ్ళ వర్గ ప్రయోజనాల్ని కాపాడే వాళ్ళే ప్రభుత్వాన్ని నడిపేదిగా వుండడం గానీ, లేకపోతే వీళ్ళు, దేశాన్నే వదిలేసి, విమానాలెక్కి ఇతర దేశాల్లో విశ్రమించ గలగడం గానీ, జరుగుతాయి. ఈ వార్తలన్నిటినీ శ్రామిక వర్గ మేధావులు కూడా చదువుతూనే వుంటారు. అయినా, చాలా మంది, ఆ వార్తల్ని చదివేసి పత్రికల్ని అవతల పెట్టేస్తారు!
ఈ 'నల్ల డబ్బు' గురించి రాసేటప్పుడు నేను, 30 ఏళ్ళకు పైగా అనుభవం వున్న ఆడిటర్ గారితో మాట్లాడాను. నల్ల డబ్బు గురించి ఆయన చెప్పింది, ఒక్కటే మాట! ''పెట్టుబడిదారులు, ఏ లెక్కలూ చెప్పరండీ! కొన్నిటిని అస్సలు చెప్పరు. చెప్పేవి అబద్దాలు!''
''అయితే, మీరా అబద్దాలే రాసేస్తారా?'' అంటే, ''అవి అబద్దాలో, నిజాలో, మాకూ చెప్పరు. చెప్పినట్టే రాస్తాం. ప్రభుత్వ బాండ్లని కొని, ప్రభుత్వానికే అప్పులు ఇస్తే, ఆదాయంలో కొంత భాగానికి పన్నులు కట్టక్కర లేదు. మీరు, ఇతర వ్యాపారుల నించి సరుకులు కొంటే, ఆ మొత్తం మీద పన్నులు కట్టక్కర లేదు - అని, మాకు తెలిసి వున్న రూల్సు కొన్ని చెపుతాం'' అంటూ చాలా చెప్పారు.
ఆడిటర్ చెప్పిన వింత విషయం: ''పెట్టుబడిదార్ల లెక్కలు, 2 రకాల ఎకౌంట్లుగా, నెంబరు 1, నెంబరు 2లుగా వుంటాయట! 2వ ఎకౌంటు, వాళ్ళూ, వాటాదార్లూ, చూసుకోడానికి అట! మొదటి ఎకౌంటు, ఇన్కమ్టాక్సు ఆఫీసు వాళ్ళ కోసం అట! ఈ మొదటి ఎకౌంట్లో, దేనినీ జరిగినట్టు చెప్పరు. వీళ్ళు, ఏ సాధనాల్ని కొన్నా, ఏది అమ్మినా, అవతలి వాళ్ళూ, వీళ్ళూ కూడా చేసుకునే ఒప్పందాల తోనే ఆ బేరాలు ఉంటాయట!
పన్నుల లెక్కలు కూడా, తక్కువ ఆదాయానికి 5శాతం పన్ను అయితే, ఎక్కువ ఆదాయానికి 10శాతం పన్నూ, ఇంకా ఎక్కువ ఆదాయానికి 30శాతం పన్నూ - ఈ రకంగా ఉంటాయి, పన్నుల లెక్కలు! ఈ పన్నులు కట్టడం పెద్ద ఆదాయాల వాళ్ళకి నచ్చదు. తప్పకుండా ఎగ్గొట్టే మార్గాలే చూస్తారు.
- రంగనాయకమ్మ
(మిగతా తరువాయి వచ్చేసంచికలో)