Authorization
Mon Jan 19, 2015 06:51 pm
75ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా కులం పేరుతో దాడులు, అసమానతలు ఎదుర్కొంటున్న అణగారిన కులాలకు సాంఘిక, ఆర్థిక సమానత్వం సాధించే వరకు రిజర్వేషన్లు అవసరం. నేటి ప్రపంచీకరణ యుగంలో ప్రభుత్వ రంగం కుదించుకొని పోయి, ప్రయివేటు రంగం విస్తరిస్తున్న వేళ ప్రయివేటు రంగంలోనూ ఈ బలహీనవర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఇప్పటికే నిమ్న వర్గాల వారికి అన్యాయం జరుగుతుంది. జనాభాలో 52శాతంగా ఉన్న ఓబీసీలు 27శాతం రిజర్వేషన్లు మాత్రమే పొందుతున్నారు. అంటే ఓబీసీలకు న్యాయంగా దక్కాల్సిన 52శాతం రిజర్వేషన్లు ఇప్పటికీ దక్కడం లేదు. ఇప్పుడున్న రిజర్వేషన్లపై సమీక్ష జరగాలి. దేశంలో జనాభా లెక్కలతో పాటు, కులగణన జరగాలి. ఆయా సామాజిక వర్గాల దమాషా ప్రకారం రిజర్వేషన్ విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. అప్పుడే అన్నీ వర్గాలకు న్యాయం జరుగుతుంది. తద్వారా రాజ్యాంగ ఆశయమైన సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించాలి. అయితే రిజర్వేషన్లు ఒక్కటే పరిష్కారం కాదు. అణగారిన ప్రజల మౌలిక సమస్య భూమి సమస్య. సంపదకు మూలమైన భూమి వీరి చేతికి దక్కకుండా వీరికి సామాజిక హౌదా దక్కదు.
అందుకే స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు దాటినా సామాజిక న్యాయం ఓ కలగానే మిగిలిపోయింది. భూ పంపిణీ జరగకుండా ఈ దేశంలో సాంఘిక, ఆర్థిక సమానత్వం రాదు. వ్యవసాయాధారిత దేశంలో భూమికి సామాజిక న్యాయానికి ఉన్న సంబంధం ఇదే. సామాజిక న్యాయానికి, భూమికి అవినాభావ సంబంధం ఉన్నది. తెలుగు రాష్ట్రాలలో నాలుగో మెట్టు కింద ఉన్న శూద్ర కులాలు అయిన వెలమ, రెడ్డి, కమ్మ, నాయుడులు పై మెట్టులోకి వచ్చి సాంఘిక హౌదా, ఆధిపత్యం ఎలా పొందారు? 1915 నుంచి, అంటే బ్రిటిష్ వారి కాలం నుంచి భూసంబంధాలలో వచ్చిన మార్పుల ఆధారంగా ఈ వర్గాలు భూమిని దక్కించుకొని అగ్రవర్ణాల సాంఘిక హౌదా పొందాయి. సంపదకు మూలమైన భూమి వీరి చేతుల్లోకి వచ్చినాక సహజంగా రాజకీయ ఆధిపత్యాన్ని కూడా ఈ కులాలు పొంది నేడు అగ్రవర్ణాలుగా చెలామణి అవుతూ, బ్రాహ్మణీయ భూస్వామ్య భావాజాలన్ని నెత్తికెక్కించుకొని దళిత, బహుజనుల పట్ల చిన్నచూపు, వివక్ష చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో గత 150సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామమిది. కాబట్టి ఉత్పత్తి శక్తులు, ఉత్పత్తి సంబంధాలలో వచ్చే మార్పులే సామాజిక చలనానికి మూల హేతువులని పై ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. అంటే భూమి (ఆర్థికం)తోనే సాంఘిక హౌదా దక్కుతుందని దళిత, బహుజన వర్గాలు గుర్తించాలి. ఈ ప్రధాన అంశాన్ని గమనించకుండా దళిత, బహుజనులు 'కులాన్ని' (సాంఘిక) పట్టుకొని ఊగుతున్నారు. ఇలా అయితే కులం పోదని 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారతదేశ చరిత్ర చెబతున్న వాస్తవం.
మానవజాతికి, సమస్త జీవులకు జీవనాధారమైనది భూమి. చరిత్రను పరిశీలిస్తే నిరంతర పరివర్తన, మార్పులు, దశలు, అన్ని భూమిపై ఆధిపత్యం కోసం జరిగిన పోరాటాలతో పరిణామం చెందినవే. మనిషి జీవన్మరణాలు, సమస్తం భూమి చుట్టూ తిరుగుతూ వస్తున్నాయి. చరిత్రలో విజ్ఞానం, వికాసం, విధ్వంసం, విప్లవం ఏవైనా భూమికోసమే జరిగాయి... జరుగుతున్నాయి. ఎందుకుంటే భూమి అంటే నేల మాత్రమే కాదు. మట్టిలో నుంచి పుట్టిన సమస్త విజ్ఞానం, సమిష్టి జీవనం, కళలు, సంస్కృతి, సకల శాస్త్రాల విజ్ఞాన సముదాయం మొత్తం జీవనానికి జీవధాతువు. అనాదిగా భూమిని ఆక్రమించుకోవటం, దోచుకోవటం జరుగుతూ వస్తోంది. ఇలా భూమితో పాటు భూమిపై బతుకుతున్న మనుషుల్ని, జీవులను, సంపదను ఆక్రమించుకొని రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజులు ఏర్పడ్డారు. ఇలా చరిత్రంతా మానవాళి నెత్తుటితో తడిసిపోయింది. ఈ వేళ సామ్రాజ్యవాదం పెచ్చరిల్లి రియల్ ఎస్టేట్ పేరుతో -భూ వ్యాపారం ఆర్థిక వ్యవస్థకు ఆక్సిజన్‌గా మారింది. మనుషుల మధ్య సంబంధాలన్ని ఆర్థిక, భూ సంబంధాలుగా మారిపోయాయి. ఇవాళ ప్రపంచ మార్కెట్లో భూమి ప్రధానమైన సరుకుగా మారిన వేళ భూమలేకుండా సామాజిక న్యాయం ఎండమావే. కాబట్టి భూమికోసం దళిత బహుజనులు ఉద్యమించాలి. భూమిని జాతీయం చేయాలి. అందరికి పంచాలి. భూమి పంపిణీ జరగకుండా ఈ దేశంలో ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమానత్వం జరగదు. సాధ్యం కాదు... కాబోదు.
- షేక్ కరిముల్లా
9705450705