Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక పోరాట యోధుడు, సాహితీ పిపాసి, స్వాతంత్య్ర సమరయోధుడు జైనీ మల్లయ్య గుప్తా 21.12.2022 బుధవారం 97 సంవత్సరాల వయస్సులో కన్నుమూసారు. 1926 అక్టోబర్ 11వ తేదీన జన్మించిన మల్లయ్య గుప్తా భువనగిరి పురపాలక సంఘానికి తొలి వైస్ ఛైౖర్మన్గా సేవలందించారు. 1942లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నైజం రాజ్యంలో సాగే దొరల పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. 1946లో అరెస్టు అయ్యారు. 1948లో జైలునుంచి తప్పించుకొని తిరిగి ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అలనాటి వీర తెలంగాణ విప్లవ పోరాట యోధులైన రావి నారాయణరెడ్డి, రాజ్బహదూర్గౌర్, కుర్రారం రాంరెడ్డి, బూర్గుల నర్సింగరావు లాంటివారితో గుప్తా పనిచేసారు. నైజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఆయనపై ఆ రోజుల్లో 15కేసులు నమోదు చేశారు. అన్నింటిని ఉక్కు క్రమశిక్షణతో ఎదుర్కొన్నారు. దాదాపు 10నెలలు కఠిన కారాగార వాసం గడిపారు. కమ్యూనిస్టు పార్టీలో పనిచేసారు. తెలంగాణలో గ్రంథాలయోధ్యమానికి విశేషమైన కృషి చేశారు. తన ఇంటిని కూడా లైబ్రరీగా మార్చారు. సాహితి మిత్రమండలి స్థాపించి ఎన్నో సాహిత్య, సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. పలు సాహిత్య గోష్టుల్లో వయోభారాన్ని లెక్కచేయకుండా పాల్గొని యువ కవుల్ని, కళాకారుల్ని ప్రోత్సహించేవారు. ఉమ్మడి రాష్ట్రంలో సాహితి స్రవంతి నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనేవారు. సభ చివరివరకు ఉండి కవుల్ని ప్రోత్సహించేవారు. తెలంగాణ సాహితి నిర్వహించే పలు సదస్సుల్లో (టి.పి.ఎస్.కె.హాలు) ఆయన అతిథిగా విచ్చేసే ప్రోత్సహించేవారు. కాళోజీపై కె. ఆనందాచారి దీర్ఘకావ్యం పుస్తకాన్ని 'గుప్తా'గారే ఆవిష్కరించి అలనాటి పోరాట స్మృతులతో ప్రసంగించి సభికుల్ని ఆలోచింపచేశారు. బాగ్లింగంపల్లి దగ్గరలోని అచ్చయ్యనగర్లో ఉన్న సందర్భంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సామాజిక ఉద్యమ సదస్సుల్లో, సాహిత్య కార్యక్రమాల్లో ఆయన ఉత్సాహంగా వచ్చి పాల్గొనేవారు. గ్రామీణ మట్టి మరిమళాల స్వచ్ఛమైన భాషా వికాసం కోసం ఆయన నిరంతరం తపించేవారు. సాహిత్య వికాసం కోసం పలు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. వక్తల ఉపన్యాసాల అనంతరం విశ్లేషించేవారు. తన అనుభవాలు చెప్పేవారు. 'వట్టికోట ఆళ్వార్ స్వామి'పై తెలంగాణ సాహితి నిర్వహించిన సాహితి సదస్సులో ఆయన ఎంతో ఆర్థ్రంగా... అలనాటి పోరాటంలోని తన అనుభవాల్ని ఉద్యమ స్ఫూర్తిగా ప్రసంగించారు. కొత్తతరానికి ప్రోత్సహించాలని సూచించే వారు. తొమ్మిది పదుల వయస్సులో సాహితి, సామాజిక అంశాలపై జరిగే అనేక సభల్లో పాల్గొనే ఆయన నేటి తరానికి స్ఫూర్తి ప్రధాత. సాహిత్యానికి సేవలు - గ్రంథాలయోధ్యమం - వామపక్ష భావాల్ని చివరివరకూ కొనసాగించిన 'జైని మల్లయ్య గుప్తా' మనకాలంలో మన మధ్య మెసలిన ఆదర్శమూర్తి, పోరాటస్ఫూర్తి. ఆమహానీయునికి నివాళి...
- తంగిరాల చక్రవర్తి
9393804472