Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన జనాలకు జ్ఞాపకశక్తి తక్కువ అని భావిస్తున్నారో లేక పాలకులు చేయించిన సర్వేలలో అలాంటి ఫలితం వచ్చిందేమో తెలియదు గానీ జ్ఞాపకశక్తి తక్కువ అన్న నిర్థారణకు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సత్య హరిశ్చంద్రుడికి అసలు సిసలు వారసులం, శీలవంతులం అని చెప్పుకుంటున్న వారు కూడా అదే విధంగా ఉన్నారా? 2022 డిసెంబరు 20న రాష్ట్రాలు, జిల్లాల సామాజిక ప్రగతి సూచికలను విడుదల చేశారు. మౌలిక మానవ అవసరాల ప్రాతిపదికన పోటీ తత్వం, సామాజిక ప్రగతి అవసరం గురించి అధ్యయనం చేసిన ఒక సంస్థ ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలికి సూచికలను అందచేసింది. దాన్ని మండలి అధó్యక్షుడు డాక్టర్ వివేక్ దేవరాయి అధికారికంగా విడుదల చేశారు. ఉచితాలు-అనుచితాల గురించి దేశంలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఒక వైపు ప్రతిపక్షాల మీద అనుచిత దాడి చేస్తూనే మరోవైపు ఉచితాలను చూపి 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీ సిద్దం అవుతోంది. దానిలో భాగంగానే మరో ఏడాది పాటు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వేరే చెప్పనవసరం లేదు.
ఈ పథకం గురించి గతంలో బీజేపీ ఏమి చెప్పింది, ఇప్పుడు ఎలా ప్రచారం చేసుకుంటోంది? 2013లో నాటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చేందుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. పార్లమెంటు సమావేశాలకు ముందు అదెందుకు అని నాడు ప్రతిపక్ష బీజేపీ ప్రశ్నించింది. దాని మీద పార్లమెంటు చర్చలో బీజేపీ నేత మురళీ మనోహర జోషి ఆ బిల్లు ఆహారం కాదు, కాంగ్రెస్ ఓట్ల భద్రత కోసం తెచ్చిందని సెలవిచ్చారు. ఇక బీజేపీ మాజీ కేంద్ర మంత్రి శాంతకుమార్ పార్టీ అంతరంగాన్ని వెల్లడిస్తూ బహిరంగంగా చెప్పిన అంశాల మీద 2015 జనవరి 23న ఇచ్చిన వార్తకు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక పెట్టిన శీర్షిక ''జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని బీజేపీ వ్యతిరేకించిందని చెప్పిన మాజీ ఆహార శాఖ మంత్రి శాంతకుమార్''. కావాలంటే విదేశీ గూగుల్ దేవతను అడిగితే మన స్వదేశీ సమాచారాన్ని కూడా చూపిస్తుంది. ఎందుకంటే వేదాల్లో అన్నీ ఉన్నప్పటికీ మనకు అలాంటి దేవత లేదు మరి. అదే బీజేపీ నేతలు ఆహార భద్రత చట్టం కింద ఇస్తున్న వాటి గురించి ఇప్పుడు ఎంతగా ప్రచారం చేసుకుంటున్నదీ తెలిసిందే. కరోనా సాయం పేరుతో 2020 నుంచి 2022 డిసెంబరు వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇచ్చే పథకం ముగిసింది. దాన్ని 2023 ఆఖరు వరకు పొడిగించాలని తాజాగా కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇది 2024 ప్రారంభంలో జరిగే లోక్సభ ఎన్నికల కోసమని ఎవరైనా అంటే అవునో కాదో ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. జనాలకు తాము ఇప్పటికే నాలుగు లక్షల కోట్ల విలువగల ఆహార ధాన్యాలు సరఫరా చేశామని మరో రెండులక్షల కోట్లు వచ్చే ఏడాది ఖర్చు చేస్తామనే ప్రచారాన్ని బీజేపీ ఊదరగొట్టనుంది.
శాంత కుమార్ (88) బీజేపీలో వెనుకటి తరానికి చెందిన వారు. అలాంటి వారిలో కొంత మంది పార్టీ ఏదైనా కొన్ని సందర్భాలలో సూటిగా మాట్లాడతారు. ఆహార భద్రతా చట్టాన్ని ప్రారంభం నుంచీ బీజేపీ వ్యతిరేకించినప్పటికీ ఎన్నికల ముందు జనంలో చెడుగా చూపే అవకాశం ఉన్నందున సమర్థించినట్లు చెప్పారు. పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు 67శాతం మందిని ఆ చట్టపరిధిలోకి తేవటం చాలా ఎక్కువని చాలా మంది భావించారు, ఎన్నికలే గనుక లేకపోతే అదే చెప్పేవారు. ఎలాగూ తమ ప్రభుత్వం వస్తుందని, దాన్ని సవరిస్తాం గనుక మేము కూడా ఆమోదించామన్నారు. ఇక నరేంద్రమోడీ గుజరాత్ సిఎంగా కేంద్రానికి ప్రతిపాదిత ఆ బిల్లు మీద ఒక లేఖ రాశారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే ఆహార ధాన్యాలను నెలకు 35 నుంచి 25 కిలోలకు తగ్గించటం ఏమిటని మండిపడుతూ భద్రత సంగతి సరే ఆ మొత్తంతో అవసరమైన కాలరీలను ఎలా సమకూర్చు కోగలరని ప్రశ్నిస్తూ ఆ బిల్లు ఒక మనిషికి రెండు పూటలా తిండికి హామీ ఇవ్వటం లేదన్నారు. నిజంగా ఎంత చక్కగా చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆ తరువాత అధికారంలోకి వచ్చి మూడోసారి లోక్సభ ఎన్నికలకు పోతున్నప్పటికీ సరఫరాను ఒక్క కిలో కూడా పెంచలేదు. బీజేపీ నేత మురళీ మనోహర జోషి బిల్లుకు ప్రతిపాదించిన సవరణల్లో ఆహార ధాన్యాలతో పాటు పప్పులు, నూనె కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదరు జోషి ఇప్పుడు బీజేపీ మార్గదర్శక మండలి సభ్యుడిగా ఉన్నారు. తన ప్రతిపాదన గురించి మోడీకి చెప్పారో లేదో లేక చెప్పినా ఊడగొట్టిన నాగటి దుంపలతో మనకు పనేమిటని, ఎన్నికలకు ముందు అనేకం చెబుతాం అన్నింటినీ అమలు జరుపుతామా అని మోడీ పట్టించుకోలేదో మనకు తెలియదు.
ప్రపంచ ఆకలి సూచికలో మన దేశ స్థానం పడిపోతున్నది తప్ప మెరుగుపడటం లేదు. 2022లో అంతకు ముందున్న 101 నుంచి 107కు దిగజారింది. మదింపు సరిగా జరగటం లేదని ప్రతిసారీ బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కూడా చెబుతున్నది. దాని సంగతి పక్కన పెడితే ప్రపంచ సంస్థలు మన సూచికను పెంచే వరకు లేదా అసలు అన్నార్తులు లేరు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఉచితంగా ఆహార ధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంత మాత్రాన బీజేపీ రాజకీయాన్ని జనం దృష్టికి తేకుండా ఉండాల్సిన అవసరం లేదు. తాజాగా కేంద్ర ఆహార మంత్రి పియుూష్ గోయల్ తమ ప్రధాని చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఏడాది పాటు 81.35కోట్ల మందికి ఉచితంగా ఆహార పంపిణీ జరపనున్నట్లు జేజేలు పలికారు. ఈ పథకాన్ని దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి అమలు జరపాలి. 2014 నుంచి మూడేండ్ల వరకు అమలు జరపాలని 2013లో నిర్ణయించారు. తరువాత అవసరాన్ని బట్టి అమలు చేస్తున్నారు. కానీ ఇంతవరకు దారిద్య్రరేఖకు ప్రాతిపదికను కేంద్ర ప్రభుత్వం తేల్చలేకపోతోంది. కొన్ని అంచనాల ప్రకారం 22శాతం మంది అంటున్నారు. ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలంటే ఈ లెక్కన దేశంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు 58శాతంగా చెప్పాలి. మోడీ సర్కార్ తొమ్మిది సంవత్సరాల్లో సాధించిన ప్రగతిగా దీన్ని చెప్పుకుంటారా? లేక పాలక పార్టీకి ఓట్ల కోసం ప్రజల సొమ్ముతో అర్హత లేని వారికి కూడా ఇస్తున్నారా? సమాధానం చెప్పేవారెవరు? పరిస్థితి ఇలా ఉంటే పేదలకు అనుచితంగా ఉచితాలను ఇస్తున్నారని, గుజరాత్లో అలాంటి పథకాలు, ప్రలోభాలను తిరస్కరించారని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు.
ఇది నిజమేనా ?
వివిధ రాష్ట్రాల్లో ఇస్తున్న ఉచితాల మంచి చెడ్డల గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఉచితాలు వస్తు, ధన, సేవలు ఏ రూపంలో ఉన్నా వాటిని పొందిన వారు ఆమేరకు వాటికోసం ఖర్చు చేయాల్సిన మొత్తాలను ఇతర వాటికి వినియోగదారుల రూపంలో వెచ్చిస్తే ఆ మేరకు మార్కెట్ పెరిగి అది దేశాభివృద్దికే తోడ్పడుతుందన్నది ఒక వాదన, కనిపించే వాస్తవం. కానీ పరిశ్రమలను పెట్టక ముందే ఏటా లక్షల కోట్ల మేరకు రాయితీల రూపంలో లబ్ది చేకూర్చుతున్న కార్పొరేట్లకు ఉత్పాదకతతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల పేరుతో కేంద్రం మరికొన్ని రాయితీలను ఇస్తున్నది. లబ్ది పొందిన కంపెనీలు ఆ మేరకు పెట్టుబడులు పెట్టి ఉంటే మన పారిశ్రామిక ఉత్పాదకత, ఉపాధి ఎందుకు పెరగటం లేదు?
ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) 2020లో వేసిన అంచనా ప్రకారం మన దేశంలో తీవ్ర ఆహార కొరతతో 22కోట్ల మంది, ఒక మోస్తరు నుంచి తీవ్రంగా ఉన్న వారు 62కోట్ల మంది ఉన్నట్లు పేర్కొన్నది. ప్రపంచానికి ఆహార ఎగుమతులు చేస్తున్న మన దేశంలో ఆకలి ఏమిటని కొందరు అడుగుతారు. లేదని నమ్మించ చూస్తారు. ఆఫ్రికాలో వజ్రాలు, బంగారు గనులున్నా అక్కడ ఎంత మంది చేతిలో అవి ఉన్నాయి? అలాగే మన జనాల్లో రెండు పూటలా తిండి తినేందుకు అవసరమైన వాటిని కొనుగోలు చేసే శక్తి ఎందరికి ఉంది? నిజానికి అలాంటి శక్తే ఉంటే పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎందుకు ఉన్నట్లు? ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల మధ్య వయసులో ఉన్న పిల్లల్లో రక్తహీనత ఉన్నవారు 2015-16తో పోలిస్తే 2019-21 కాలంలో 58.6నుంచి 67.1శాతానికి పెరిగినట్లు 2022 ఆగస్టు 5న కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ పార్లమెంటులో ప్రకటించారు. ఇది మన ప్రభుత్వ సర్వే ప్రకారమే తేలింది. దీనికి కారణం ఏమిటి? మెజారిటీ రాష్ట్రాల్లో రెండింజన్ల సర్కార్లే ఉన్నాయి. గుజరాత్లో పరిస్థితి మరీ దారుణం. జాతీయ సగటు కంటే ఎక్కువగా గడచిన ఐదు సంవత్సరాల్లో పిల్లల్లో రక్తహీనత 62.6 నుంచి 79.7శాతానికి పెరిగింది, తీవ్ర పరిస్థితిలో ఉన్నవారు 1.7 నుంచి 3.1శాతానికి పెరిగారు. పిల్లలే కాదు, స్త్రీ, పురుషులందరిలో రక్తహీనత పెరిగింది. ప్రతివారం పండ్లు తీసుకొనే వారు దేశంలో సగటున 56.1శాతం ఉంటే అభివృద్ధి చెందిన గుజరాత్లో 39.8శాతమే (2022 మే 23 టైమ్స్ ఆఫ్ ఇండియా). దీనికి ఏమంటారు? జాతీయ వినియోగ ఖర్చు గురించి 2017-18 సర్వే వివరాలను మోడీ ప్రభుత్వం తొక్కి పెట్టింది. తరువాత అసలు సర్వే ఊసే లేదు. రెండింజన్ల బీజేపీ పాలిత రాష్ట్రాలు, సంక్షేమ పధకాల అమలు గురించి గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఐదవ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2019-21 ప్రకారం చూసినా కేరళలో పరిస్థితి మెరుగ్గా ఉంది. నాలుగవ సర్వేతో పోలిస్తే ఐదవ సర్వేలో దేశంలో దేశం మొత్తంలో రక్తహీనత సమస్య పెరిగింది.
ఇక 2022 సామాజిక ప్రగతి సూచికను చూస్తే బీజేపీ రెండింజన్ల ప్రభుత్వాల వైఫల్యం గురించి చెప్పుకుంటే సిగ్గు చేటు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సూచికలను చూస్తే 36కు గాను బీజేపీ ఏలుబడిలోని అసోం 34, మధ్యప్రదేశ్ 33, ఉత్తరప్రదేశ్ 31, గుజరాత్ 22, హర్యానా 21, వైసీపీ పాలనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 23, తెలంగాణ 26వ స్థానంలో ఉంది. తమిళనాడు, కేరళ 6,9 స్థానాల్లో ఉన్నాయి. తొలి ఐదు స్థానాల్లో పుదుచ్చేరి, లక్ష ద్వీప్, గోవా, సిక్కిం, మణిపూర్ ఉన్నాయి.
ఉచితాల గురించి ఆర్బిఐ విడుదల చేసిన ఒక నివేదికలో 2022-23 బడ్జెట్లలో కేరళలో సున్నా కేటాయింపులున్నట్లు పేర్కొన్నది. తొలి రెండు స్థానాల్లో పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం 2022 మార్చి ఆఖరుకు మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో పురుష వ్యవసాయ కార్మికులకు అతి తక్కువగా రోజువారీ సగటు వేతనం రూ.217.8, 220.3 చొప్పున ఉండగా, కేరళలో రూ.726.8 ఉంది. కేరళ నిర్మాణ రంగంలో రూ.837.7 కాగా గుజరాత్లో రూ.373 కూలీగా ఇస్తున్నారు. దేశ కార్మికశాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాలో వ్యవసాయేతర పనులకు 2020-21లో సగటు వేతనం రూ.315.3 కాగా ఆంధ్రప్రదేశ్లో రూ.305.3 ఉండగా, కేరళలలో అది రూ.677.6 ఉంది. అందుకే అంటారు, జనా లకు చేపలను తెచ్చి పెట్టటం ఉచితం, అదే చేపలను పట్టటం నేర్పితే సాధికారత అని. ఏడాదికి వంద రోజులు సగటున పని దొరికింద నుకుంటే ఆంధ్రప్రదేశ్లో రూ.30,530 రాబడి ఉంటుంది. అదే కేరళలో రూ.67,776 వస్తుంది. అందుకే అక్కడ ఉచితాలతో పనిలేదు, ఉచితాలు ఇచ్చినచోట, ఇవ్వనిచోటా మానవాభి వృద్ది లేదు. దేశమంటే అదానీ, అంబానీలు కాదు, మనుషులు అన్నపుడు గుజరాత్లో మనుషులెందుకు అంతగా అధ్వాన్న జీవితం గడుపుతున్నారో వేరే చెప్పాలా? కనికట్టుతో గుజరాత్లో అంతా బాగుంది అని నరేంద్ర మోడీ గారడీ చేస్తే కుదరదు, తన పాలన వైఫల్యాలు దాస్తే దాగేవి కాదు.
- సత్య