Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గత నెల 31నాడు వెలువరించిన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (డిగ్రీ అధ్యాపకులు) ఉద్యోగ ప్రకటనలో సామజిక శాస్త్రాల సబ్జెక్టులకు ఏమాత్రం స్థానం కల్పించకపోవడం ఆయా సబ్జెక్టుల నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చివరిసారిగా డిగ్రీ అధ్యాపకుల ప్రకటన వెలువడిన పదేండ్ల కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ప్రకటనకి నోచుకోగా కేవలం సైన్స్, కంప్యూటర్, భాషలకి సంబంధించిన డిగ్రీ అధ్యాపక ఉద్యోగాల భర్తీకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి సామాజిక శాస్త్రాల అధ్యాపక పోస్టుల భర్తీని విస్మరించడం నిరుద్యోగ ఉద్యోగార్థులని మాత్రమే కాకుండా విద్యారంగ నిపుణులను, మేధావులను సైతం విస్మయానికి గురిచేసింది. రాకరాక డిగ్రీ అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన వస్తే ప్రపంచ గమనానికి పట్టుకొమ్మలయిన సామాజిక శాస్త్రాల అధ్యాపక ఉద్యోగాల భర్తీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శీతకన్నుతో వ్యవహరించడం ఏమాత్రం సహేతుకం కాదు. ఆయా సామాజిక శాస్త్రాల ఉద్యోగాల భర్తీ కోసం ఉద్యోగార్థులు నేషనల్ ఎలిజిబిటి టెస్ట్ (నెట్), స్టేట్ ఎలిజిబిటి టెస్ట్ (సెట్), పిహెచ్.డి డాక్టరేట్ డిగ్రీలు పూర్తి చేసి పదేండ్ల నుండి కళ్ళల్లో వత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఈ డిగ్రీ అధ్యాపక ఉద్యోగాల కోసం అవసరమైన విద్యా, అర్హతా పరీక్షలలో కృతకృత్యులు కావడానికి నిరుద్యోగ ఉద్యోగార్థులు అనేక సవాళ్లు, సంఘర్షణలు అధిగమించి చివరికి లక్ష్యాలు సాధించారు. అయినా ఉద్యోగాలు భర్తీకి నోచుకోకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న విపరిమాణానికి నిదర్శనం కాగలదు.
నేడు తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ పరీక్షలు సహా దాదాపు ప్రతి ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలలో ప్రధానంగా భారతదేశ చరిత్ర - తెలంగాణ చరిత్ర, రాజ్యాంగం, ఎకానమీ, భూగోళ శాస్త్రం, సమాజశాస్త్రం మొదలైన సామాజిక శాస్త్రాల సబ్జెక్ట్ల నుండి అత్యధిక శాతం జ్ఞానం, అవగాహన, వినియోగం, సంశ్లేషణ, విశ్లేషణ మొదలైన నైపుణ్యాలను ప్రాధాన్యతా క్రమంలో పరీక్షిస్తున్నారు. ఈ రకంగా ఉద్యోగ పరీక్షలలో సామాజిక శాస్త్రాలు అత్యధిక ప్రాధాన్యత వహిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వం ఈ రకంగా సామాజిక శాస్త్రాలను కేవలం ఉద్యోగాల భర్తీ వరకు మాత్రమే ప్రభుత్వం ప్రాధాన్యతని ఇచ్చి వాటిని డిగ్రీ అధ్యాపక ఉద్యోగాలలో కరివేపాకు లాగా తీసిపారేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నని నిరుద్యోగ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఒక రకంగా ప్రభుత్వం 'నిరుద్యోగుల్లో మానసిక అశాంతి'ని సృష్టించింది అని చెప్పవచ్చు. ఏది ఏమైననూ సైన్స్, టెక్నాలజీతో పాటుగా సామాజిక శాస్త్రాలు కూడా సమాజ పురోగమనానికి కీలకమనడంలో ఎవరికీ సందేహం లేదు. అయినప్పటికీ ఈ అధ్యాపక పోస్టుల భర్తీలో నిర్లక్ష్యమెందుకో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
ఒకపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కె.జి. టు పి.జి విద్యకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెపుతూనే, మరోపక్క కనీసం డిగ్రీ అధ్యాపక సామాజిక శాస్త్రాల ఉద్యోగాల భర్తీ విషయంలో మౌనం వహించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ''ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో సామాజిక శాస్త్రాల విద్యార్థులు, పరిశోధకులు కూడా బాగస్వాములు'' అనే విషయాన్ని ప్రభుత్వం గమనంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలు సాధనే లక్ష్యంగా సాధింపబడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యోగాల భర్తీ విషయంలో మొండిచేయి చూపడం న్యాయం కాదు. ఇప్పటికై తెలంగాణ ప్రభుత్వం సామాజిక శాస్త్రాల డిగ్రీ అధ్యాపక పోస్టుల భర్తీకి చొరవ చూపి సాధ్యమైనంత త్వరగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మొత్తం ఖాళీలకు ఉద్యోగ ప్రకటన విడుదల చేయించాలి.
జెజెసిపి బాబూరావు
9493319690